గురువారం 26 నవంబర్ 2020
Sports - Oct 12, 2020 , 13:07:28

రాఫెల్ నాద‌ల్‌ను మెచ్చుకున్న రోజ‌ర్ ఫెద‌ర‌ర్‌

రాఫెల్ నాద‌ల్‌ను మెచ్చుకున్న రోజ‌ర్ ఫెద‌ర‌ర్‌

హైద‌రాబాద్‌:  పురుషుల టెన్నిస్‌లో రోజ‌ర్ ఫెద‌ర‌ర్ గ్రాండ్‌స్లామ్ టైటిళ్ల‌ను రాఫెల్ నాద‌ల్ స‌మం చేసిన విష‌యం తెలిసిందే.  ఆదివారం జ‌రిగిన ఫ్రెంచ్ ఓపెన్ ఫైన‌ల్లో గెలిచిన నాద‌ల్‌.. ఫెద‌ర‌ర్ పేరిట ఉన్న 20 గ్రాండ్‌స్లామ్ టైటిళ్ల రికార్డును స‌మం చేశాడు. ఈ ఘ‌న‌త ప‌ట్ల ఫెడ‌క్స్ స్పందించాడు.  త‌న ట్విట్ట‌ర్ అకౌంట్‌లో రాఫేల్ నాద‌ల్‌పై ప్ర‌శంస‌లు కురిపించాడు స్విస్ట్ మాస్ట‌ర్‌.  స్నేహితుడు ర‌ఫాను ఎప్పుడూ గౌర‌విస్తాన‌ని, ఓ వ్య‌క్తిగా ఒక చాంపియ‌న్‌గా అత‌న్ని గుర్తిస్తాన‌ని, చాలా ఏళ్ల నుంచి నాకు స‌రైన ప్ర‌త్య‌ర్థి అత‌నే అని,  ఇన్నాళ్లూ ఇద్ద‌రం పోటీప‌డ‌డం వల్లే తాము ఉత్త‌మ ఆట‌గాళ్లుగా రాణించ‌గ‌లిగామ‌ని ఫెద‌ర‌ర్ త‌న ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నారు.  

ఆదివారం జ‌రిగిన మ్యాచ్‌లో నాద‌ల్ 6-0, 6-2, 7-5 స్కోర్ తేడాతో జోకోవిచ్‌పై గెలుపొంది ఫ్రెంచ్ ఓపెన్‌ను అత్య‌ధికంగా 13వ సారి ఎగురేసుకుపోయాడు.  ఫ్రెంచ్ ఓపెన్‌ను నాద‌ల్ 13 సార్లు గెల‌వ‌డం అద్భుత‌మ‌ని ఫెడెక్స్ అన్నాడు.  ఇంత‌టి ఘ‌న‌త‌ను ఎవ‌రూ ఒంట‌రిగా సాధించ‌లేర‌ని, త‌న టీమ్ స‌భ్యుల‌కు కూడా కంగ్రాట్స్ చెబుతున్న‌ట్లు ఫెద‌ర‌ర్ తెలిపాడు. 20 గ్రాండ్‌స్లామ్‌లు త‌న ఇద్ద‌రి జ‌ర్నీలో భాగ‌మ‌ని భావిస్తున్న‌ట్లు చెప్పాడు.  20 గ్రాండ్‌స్లామ్ టైటిళ్ల‌ను గెల‌వ‌డానికి అర్హుడ‌వ‌ని నాద‌ల్‌ను ఫెద‌ర‌ర్ మెచ్చుకున్నాడు.  జోకోవిచ్ ఇప్ప‌టి వ‌ర‌కు 18 గ్రాండ్‌స్లామ్ టైటిళ్ల‌ను గెలుచుకున్నాడు. ఇక ఈఏడాది ఫ్రెంచ్ ఓపెన్‌లో ఫెద‌ర‌ర్ ఆడ‌లేదు. స్విస్ ప్లేయ‌ర్ ఈ ఏడాది రెండు సార్లు మోకాళ్ల‌కు స‌ర్జ‌రీ చేయించుకున్నాడు. వ‌చ్చే ఏడాది మ‌ళ్లీ రాకెట్ ప‌ట్ట‌నున్న‌ట్లు ఫెద‌ర‌ర్ తెలిపాడు.  ఈ ఏడాది యూఎస్ ఓపెన్‌లో కూడా అత‌ను ఆడ‌లేదు.