బుధవారం 15 జూలై 2020
Sports - Jun 04, 2020 , 23:59:36

ఆత్మహత్య ఆలోచనలతో సతమతమయ్యా: రాబిన్‌ ఊతప్ప

ఆత్మహత్య ఆలోచనలతో సతమతమయ్యా: రాబిన్‌ ఊతప్ప

మెంటల్‌ హెల్త్‌.. ఇటీవల క్రీడారంగంలో తరచూ వినిపిస్తున్న పదం. గతంలో మానసిక సమస్యల గురించి చర్చించేందుకు పెద్దగా ఇష్టపడని ఆటగాళ్లు ఇప్పుడు ఎలాంటి జంకు లేకుండా తమ ఇబ్బందులను బయటపెడుతున్నారు. ఆసీస్‌ ఆల్‌రౌండర్‌ మ్యాక్స్‌వెల్‌ దీనికి శ్రీకారం చుట్టగా.. ఆ తర్వాత ఎంతోమంది అతడిని అనుసరించారు. తాజాగా భారత వెటరన్‌ బ్యాట్స్‌మన్‌ రాబిన్‌ ఊతప్ప ఈ జాబితాలో చేరాడు. కుంగుబాటు కారణంగా ఆత్మహత్య చేసుకోవాలనుకున్నట్లు వెల్లడించాడు.

న్యూఢిల్లీ: మానసిక ఆందోళనలతో రెండేండ్ల పాటు ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలతో సతమతమయ్యానని వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ రాబిన్‌ ఊతప్ప పేర్కొన్నాడు. జీవితంపై విరక్తితో ఒకానొక దశలో బాల్కనీ నుంచి దూకేద్దామనుకున్నానని చెప్పాడు. అయితే తనువు చాలించాలనుకున్న ప్రతీసారి ఏదో శక్తి తనను అడ్డుకునేదని వెల్లడించాడు. టీ20 ప్రపంచకప్‌ (2007) గెలిచిన భారత జట్టులో సభ్యుడైన ఊతప్ప.. టీమ్‌ఇండియా తరఫున 46 వన్డేలు, 13 టీ20లు ఆడాడు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)లో చాన్నాళ్లుగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఊతప్పను ఈ సారి వేలంలో రాజస్థాన్‌ రాయల్స్‌ రూ. 3 కోట్లకు కొనుగోలు చేసింది. గురువారం రాయల్‌ రాజస్థాన్‌ ఫౌండేషన్‌.. ‘మనసు, దేహం, ఆత్మ’ పేరిట నిర్వహించిన లైవ్‌ సెషన్‌లో రాబిన్‌ ఊతప్ప.. తన అనుభవాలు పంచుకున్నాడు. ఆ వివరాలు అతడి మాటల్లోనే..

ఆట కన్నా అవే ఎక్కువ..

2009-2011 మధ్య చాలా కఠిన పరిస్థితులు ఎదుర్కొన్నా. అసలు క్రికెట్‌ గురించి ఆలోచించేవాడినే కాదు. మనసులో ఎప్పుడూ  ఆత్మహత్య ఆలోచనలే మెదులుతుండేవి. భవిష్యత్తు ఊహలు పక్కనపెట్టి.. ఈ రోజు బతికేదేలా అని ఆలోచించేవాడిని. ఇక క్రికెట్‌కు దూరంగా ఉండే ఆఫ్‌ సీజన్‌లో అయితే మరీ ఎక్కువ. నా జీవితం ఎటుపోతుంది? నేను ఎంచుకున్న దారేది? ఇలాంటి ప్రశ్నలతో సతమతమయ్యేవాడిని.

అర్థం చేసుకోవడం మొదలెట్టా..

ఆ తర్వాత ఇక లాభంలేదని నన్ను నేను అర్థం చేసుకోవడం ప్రారంభించా. జీవితంలో కోరుకున్న మార్పులు చేసుకునేందుకు ఇతరుల సాయం తీసుకున్నా. నెట్స్‌లో తీవ్రంగా శ్రమించా.   సమస్య నాలోనే ఉందనే విషయాన్ని అంగీకరిచలేకపోయా. చాలాసార్లు మన తప్పుల్ని మనం అంగీకరించం. మరీ ముఖ్యంగా పురుషుల్లో ఈ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. మానసిక సమస్య గురించి పట్టించుకోం. 

మూడంకెలు లెక్కబెట్టుకున్నా.. 

సంఘర్షణ ఎక్కువ కావడంతో ఒక్కోసారి తనువు చాలించాలని దృఢంగా సంకల్పించుకునేవాడిని. పరుగెత్తుకెళ్లి బాల్కనీ నుంచి దూకాలని కుర్చీలో కూర్చొని మూడంకెల వరకు లెక్కబెట్టుకున్న రోజులు కూడా ఉన్నాయి. ఇలా తరచుగా జరుగుతున్నా.. ఏదో తెలియని శక్తి నన్ను వెనక్కి లాగేది.


logo