గురువారం 03 డిసెంబర్ 2020
Sports - Oct 11, 2020 , 19:27:59

సన్‌రైజర్స్‌పై రాజస్థాన్‌ ఉత్కంఠ విజయం

సన్‌రైజర్స్‌పై రాజస్థాన్‌ ఉత్కంఠ విజయం

దుబాయ్‌: సన్‌రైజర్స్‌  హైదరాబాద్‌తో  ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో  రాజస్థాన్‌ రాయల్స్‌  గెలుపొందింది. చివరి బంతి వరకు నువ్వానేనా అన్నట్లు సాగిన  పోరులో  రాజస్థాన్‌ 5 వికెట్లతో విజయం సాధించింది.  రియాన్‌ పరాగ్‌(42 నాటౌట్:‌ 26 బంతుల్లో 2 ఫోర్లు, 2సిక్సర్లు), రాహుల్‌  తెవాటియా(45 నాటౌట్‌ :28 బంతుల్లో  4ఫోర్లు, 2సిక్సర్లు ) అద్భుతంగా పోరాడి జట్టుకు  విజయాన్నందించారు.  రాజస్థాన్‌ టాప్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌ బెన్‌స్టోక్స్‌(5), జోస్‌ బట్లర్‌(16), స్టీవ్‌ స్మిత్‌(5), శాంసన్‌(26), రాబిన్‌ ఉతప్ప(18) స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. ఈ దశలో క్రీజులో ఉన్న ఈ జోడీ బాధ్యతాయుత ఇన్నింగ్స్‌తో చెలరేగారు. 

వీరిద్దరి ధనాధన్‌ బ్యాటింగ్‌తో   159 పరుగుల  లక్ష్యాన్ని   రాజస్థాన్‌ మరో బంతి మిగిలుండగానే 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది.  రాజస్థాన్‌ ఆశలు వదుకున్న స్థితిలో  యువ ఆటగాళ్లు స్ఫూర్తిదాయక ప్రదర్శనతో ఆకట్టుకున్నారు.  మధ్య ఓవర్ల వరకు మ్యాచ్‌పై పట్టుసాధించిన సన్‌రైజర్స్‌..ఆఖర్లో కుర్రాళ్ల బ్యాటింగ్‌ మెరుపులకు చేతులెత్తేసింది.  హైదరాబాద్‌ బౌలర్లలో  ఖలీల్‌ అహ్మద్‌(2/37), రషీద్‌ ఖాన్‌(2/25) చెరో రెండు వికెట్లు పడగొట్టారు.   

అంతకుముందు మనీశ్‌ పాండే(54: 44 బంతుల్లో 2ఫోర్లు, 3సిక్సర్లు ) అద్భుత అర్ధసెంచరీకి తోడుగా డేవిడ్‌  వార్నర్‌(48: 38 బంతుల్లో 3ఫోర్లు, 2సిక్సర్లు) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4  వికెట్లకు 158 పరుగులు చేసింది.  కేన్‌  విలియమ్సన్‌(22నాటౌట్‌: 12 బంతుల్లో 2సిక్సర్లు )  విజృంభించడంతో సన్‌రైజర్స్‌ సాధారణ స్కోరు చేయగలిగింది.  రాజస్థాన్‌ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్‌, కార్తీక్‌ త్యాగీ, ఉనద్కత్‌ తలో వికెట్‌ పడగొట్టారు.