ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Sports - Jul 30, 2020 , 19:17:55

‘అందుకే శాంసన్ కంటే పంత్​కు ఎక్కువ అవకాశాలు’

‘అందుకే శాంసన్ కంటే పంత్​కు ఎక్కువ అవకాశాలు’

న్యూఢిల్లీ: లెఫ్ట్ హ్యాండర్ అయిన కారణంగానే భారత జట్టులో వికెట్ కీపర్​గా రిషబ్ పంత్​కు ఎక్కువ అవకాశాలు వచ్చాయని సంజూ శాంసన్ కోచ్​ బిజూ జార్జ్​ అభిప్రాయపడ్డారు. సంజూ ప్రతిభ తెలిసిన వ్యక్తిగా, అతడికి మరిన్ని అవకాశాలు దక్కాల్సిందని గురువారం ఓ ఇంటర్వూలో చెప్పారు. 2015 జింబాబ్వేతో ‘టీ20 ద్వారా టీమ్​ఇండియాలోకి వచ్చిన సంజూ శాంసన్​… మరో అవకాశం కోసం నాలుగేండ్లు వేచి చూడాల్సి వచ్చింది. గతేడాది బంగ్లాదేశ్​తో టీ20 సిరీస్​కు ఎంపికైనా తుదిజట్టులో చోటు దక్కలేదు. దీంతో అప్పుడు పెద్ద చర్చే జరిగింది. అయితే ఈ ఏడాది జనవరిలో శ్రీలంకతో జరిగిన రెండు టీ20ల్లో చోటు దక్కించుకున్న శాంసన్ వరుసగా 8,2 పరుగులు చేశాడు. అయితే నాలుగేండ్ల కాలంగా అతడికి సరైన అవకాశాలు దక్కలేదని ఎందరో మాజీలు అభిప్రాయపడ్డారు. తాజాగా అతడి కోచ్​ బిజూ సైతం ఈ విషయంపై మాట్లాడాడు.

“సంజూ శాంసన్​ను దగ్గరినుంచి చూస్తున్న వ్యక్తిగా చెబుతున్నా, అతడికి మరిన్ని ఎక్కువ అవకాశాలు దక్కాల్సింది. అయితే టీమ్​ఇండియా కోణంలో చూస్తే.. రిషబ్ పంత్​కు ఎక్కువ అవకాశాలు ఎందుకు వచ్చాయంటే.. మొదటిది అతడు లెఫ్ట్ హ్యాండర్​. రెండోది జట్టు వ్యూహాలు. ప్రపంచకప్​ను దృష్టిలో ఉంచుకొని పంత్​కు టీమ్​ఇండియా మేనేజ్​మెంట్ ఎక్కువ అవకాశాలు ఇచ్చింది. అలాగే లెఫ్ట్ ఆర్మ్​ స్పిన్నర్లు, లెగ్ స్పిన్నర్లు ఉన్న జట్లతో ఆడాల్సి ఉన్నందున లెఫ్ట్  హ్యాండర్ అయిన పంత్​ ఉంటే బాగుంటుందని అనుకొని ఉంటారు. ఇది నా అభిప్రాయం. జట్టు అంటే అంతే. కెప్టెన్​, కోచ్ తుది నిర్ణయాలు తీసుకుంటారు. ప్రత్యర్థి జట్లకు సరిపోయిన జట్టేదో సెలెక్టర్లు నిర్ణయించాల్సి ఉంటుంది. అయితే ఉద్దేశపూర్వకంగా అవకాశాలు ఇవ్వకూడదని ఎవరూ అనుకోరు” అని బిజూ అన్నారు. కాగా పంత్ సైతం విఫలమవుతుండడంతో ఎక్స్​ట్రా బ్యాట్స్​మన్ కోసం కేఎల్ రాహుల్​నే వికెట్ కీపర్​గానూ ఉపయోగించుకోవాలని టీమ్ఇండియా మేనేజ్​మెంట్ భావిస్తున్నది. 


logo