శనివారం 28 నవంబర్ 2020
Sports - Nov 01, 2020 , 02:00:18

రైజర్స్‌ రైట్‌ రైట్‌

రైజర్స్‌ రైట్‌ రైట్‌

  • ప్లేఆఫ్స్‌కు హైదరాబాద్‌ మరింత చేరువ  
  •  బెంగళూరుపై సన్‌రైజర్స్‌ ఘనవిజయం

అనూహ్య మలుపులు తిరుగుతున్న ఐపీఎల్‌ 13వ సీజన్‌లో మ్యాచ్‌ మ్యాచ్‌కు సమీకరణాలు మారిపోతున్నాయి. వరుస విజయాలతో ప్లే ఆఫ్స్‌కు చేరడం పక్కా అనిపించిన బెంగళూరు కట్టుతప్పి హ్యాట్రిక్‌ పరాజయాలను మూటగట్టుకుంటే.. ఇక ముందుకెళ్లడం కష్టమే అనుకున్న హైదరాబాద్‌ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి దూసుకెళ్లింది. సన్‌రైజర్స్‌ పటిష్ట బౌలింగ్‌ ముందు నిలువలేకపోయిన కోహ్లీ సేన.. బౌలింగ్‌లోనూ పెద్దగా ప్రభావం చూపలేక వరుసగా మూడో ఓటమిని ఆహ్వానించింది. ఈ గెలుపుతో ఫుల్‌ జోష్‌లో ఉన్న ‘డేవిడ్‌ భాయ్‌' గ్యాంగ్‌.. ఇక చివరి మ్యాచ్‌లో ముంబైని ఓడిస్తే.. 

ప్లే ఆఫ్స్‌కు చేరడం దాదాపు ఖాయమే!

షార్జా: లీగ్‌లోనే పటిష్ట బౌలింగ్‌ లైనప్‌ ఉన్న హైదరాబాద్‌ అదే బలంతో మరో విజయాన్ని మూటగట్టుకుంది. శనివారం రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ)తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (ఎస్‌ఆర్‌హెచ్‌) 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. మొద ట బ్యాటింగ్‌ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 120 పరుగులు చేసింది. జోష్‌ ఫిలిప్‌ (32), డివిలియర్స్‌ (24) ఫర్వాలేదనిపించారు. హైదరాబాద్‌ బౌలర్లలో ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌' సందీప్‌ శర్మ, హోల్డర్‌ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో  హైదరాబాద్‌ 14.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 121 పరుగులు చేసింది. వృద్ధిమాన్‌ సాహా (39), జాసన్‌ హోల్డర్‌ (10 బంతుల్లో 26 నాటౌట్‌; ఒక ఫోర్‌, 3 సిక్సర్లు) రాణించారు. 

అలవోకగా..

స్వల్ప లక్ష్యఛేదనలో హైదరాబాద్‌ అదరగొట్టింది. వార్నర్‌ (8) త్వరగానే ఔటైనా.. సాహా, మనీశ్‌ పాండే ఇన్నింగ్స్‌ను నడిపించారు. సైనీ వేసిన మూడో ఓవర్‌లో4,6 కొట్టిన పాండే.. మోరిస్‌ ఓవర్‌లో రెండు ఫోర్లు అందుకున్నాడు. సిరాజ్‌ వేసిన ఆరో ఓవర్‌లో సాహా 4,6 బాదడంతో పవర్‌ ప్లే ముగిసేసరికి హైదరాబాద్‌ 58/1తో నిలిచింది. కాసేపటికి పాండే ఔటైనా.. సాధించాల్సిన రన్‌రేట్‌ ఎక్కువగా లేకపోవడంతో హైదరాబాద్‌కు ఇబ్బంది లేకపోయింది. విలియమ్సన్‌ (8) ఆకట్టుకోలేకపోయినా.. ఆఖర్లో హోల్డర్‌ (10 బంతుల్లో 26 నాటౌట్‌; ఒక ఫోర్‌, 3 సిక్సర్లు) ధాటిగా ఆడి మరో 35 బంతులు మిగిలుండగానే జట్టుకు విజయాన్నందించాడు. 

బౌలర్లు భళా..

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరుకు శుభారంభం దక్కలేదు. మంచి ఫామ్‌లో ఉన్న పడిక్కల్‌ (5) మూడో ఓవర్‌లో పెవిలియన్‌ చేరగా.. కాసేపటికే కెప్టెన్‌ కోహ్లీ (7) అతడిని అనుసరించాడు. ఈ రెండు వికెట్లు సందీప్‌ శర్మ ఖాతాలోకే వెళ్లాయి. ఆరంభంలోనే వికెట్లు పడటంతో పవర్‌ప్లే ముగిసే సరికి బెంగళూరు 30/2తో నిలిచింది. ఫిలిప్‌, డివిలియర్స్‌ క్రీజులో ఉన్నా.. హైదరాబాద్‌ బౌలర్లు కట్టుదిట్టమైన బంతులు వేయడంతో పరుగుల రాక గగనమైంది. వీరిద్దరూ స్వల్ప వ్యవధిలో వెనుదిరగగా.. ఆ తర్వాత మిగిలిన వారు పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. ఆఖర్లో వాషింగ్టన్‌ సుందర్‌ (21), గుర్‌కీరత్‌ సింగ్‌ (15 నాటౌట్‌) కొన్ని పరుగులు చేసి జట్టు స్కోరును వంద దాటించారు. 

ఎలా.. ఎలా..

ఐపీఎల్‌ 13వ సీజన్‌ చివరికొచ్చేసింది. లీగ్‌దశలో అన్ని జట్లు 13 మ్యాచ్‌లు ఆడేశాయి. ఇక అందరికీ మిగిలింది ఒక్క మ్యాచే. ప్రస్తుతం ఆరు జట్లు మూడు బెర్తుల కోసం పోటీ పడుతున్నాయి. ఈ దశలో ఎవరి అవకాశాలు ఎలా ఉన్నాయనే దాన్ని ఓ సారి పరిశీలిస్తే..

  • హైదరాబాద్‌: ముంబైతో జరుగనున్న చివరి మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ (12 పాయింట్లు) నెగ్గితే మెరుగైన రన్‌రేట్‌ కారణంగా ప్లే ఆఫ్స్‌కు చేరొచ్చు. 
  • బెంగళూరు: ప్రస్తుతం 14 పాయింట్లతో ఉన్న బెంగళూరు ఆఖరి మ్యాచ్‌లో ఢిల్లీపై నెగ్గితే బెర్తు ఖరారు చేసుకుంటుంది. 
  • ఢిల్లీ: బెంగళూరుపై నెగ్గితే ఢిల్లీ (14 పాయింట్లు) నేరుగా ప్లే ఆఫ్స్‌ చేరుతుంది. ఒకవేళ ఓడితే నెట్న్‌ర్రేట్‌ దెబ్బ పడొచ్చు.
  • పంజాబ్‌: ప్రస్తుతం 12 పాయింట్లతో ఉన్న పంజాబ్‌ చివరి మ్యాచ్‌లో చెన్నైపై నెగ్గితే మెరుగైన రన్‌రేట్‌తో ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టొచ్చు.
  • రాజస్థాన్‌: కోల్‌కతాతో జరుగనున్న చివరి మ్యాచ్‌లో రాజస్థాన్‌ గెలిస్తే.. వారికీ అవకాశం ఉంటుంది. అయితే రన్‌రేట్‌ తక్కువగా ఉండటం ఆ జట్టును దెబ్బకొట్టొచ్చు.
  • కోల్‌కతా: రాజస్థాన్‌పై నెగ్గితే చాన్స్‌ ఉంటుంది. కానీ రన్‌రేట్‌ తక్కువగా ఉండటం కోల్‌కతా ప్రతిబంధకం.

స్కోరు బోర్డు

బెంగళూరు:  ఫిలిప్‌ (సి) పాండే (బి) రషీద్‌ 32, పడిక్కల్‌ (బి) సందీప్‌ 5, కోహ్లీ (సి) విలియమ్సన్‌ (బి) సందీప్‌ 7, డివిలియర్స్‌ (సి) అభిషేక్‌ (బి) నదీమ్‌ 24, సుందర్‌ (సి అండ్‌ బి) నటరాజన్‌ 21, గుర్‌కీరత్‌ (నాటౌట్‌) 15, మోరిస్‌ (సి) వార్నర్‌ (బి) హోల్డర్‌ 3, ఉడాన (సి) విలియమ్సన్‌ (బి) హోల్డర్‌ 0, సిరాజ్‌ (నాటౌట్‌) 2, ఎక్స్‌ట్రాలు: 11, మొత్తం: 20 ఓవర్లలో 120/7. వికెట్ల పతనం: 1-13, 2-28, 3-71, 4-76, 5-106, 6-113, 7-114, బౌలింగ్‌: సందీప్‌ 4-0-20-2, హోల్డర్‌ 4-0-27-2, నటరాజన్‌ 4-0-11-1, నదీమ్‌ 4-0-35-1, రషీద్‌ 4-0-24-1. 

 హైదరాబాద్‌: వార్నర్‌ (సి) ఉడాన (బి) సుందర్‌ 8, సాహా (స్టంప్డ్‌) డివిలియర్స్‌ (బి) చాహల్‌ 39, పాండే (సి) మోరిస్‌ (బి) చాహల్‌ 26, విలియమ్సన్‌ (సి) కోహ్లీ (బి) ఉడాన 8, అభిషేక్‌ (సి) గుర్‌కీరత్‌ (బి) సైనీ 8, హోల్డర్‌ (నాటౌట్‌) 26, సమద్‌ (నాటౌట్‌) 0, ఎక్స్‌ట్రాలు: 6, మొత్తం: 14.1 ఓవర్లలో 121/5. వికెట్ల పతనం: 1-10, 2-60, 3-82, 4-87, 5-114, బౌలింగ్‌: మోరిస్‌ 2-0-19-0, సుందర్‌ 3-0-21-1, సైనీ 2-0-30-1, సిరాజ్‌ 1-0-12-0, చాహల్‌ 3.1-0-19-2, ఉడాన 3-0-20-1.