బుధవారం 08 జూలై 2020
Sports - May 18, 2020 , 17:59:55

పాంటింగ్ అత్యుత్త‌మ కోచ్‌: ఇషాంత్ శ‌ర్మ‌

పాంటింగ్ అత్యుత్త‌మ కోచ్‌: ఇషాంత్ శ‌ర్మ‌

న్యూఢిల్లీ:  తానిప్ప‌టి వ‌ర‌కు చూసిన వారిలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగే అత్యుత్త‌మ కోచ్ అని టీమ్ఇండియా వెట‌ర‌న్ పేస‌ర్ ఇషాంత్ శ‌ర్మ పేర్కొన్నాడు. ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌)లో ఢిల్లీ క్యాపిట‌ల్స్‌కు ప్రాత‌నిధ్యం వ‌హిస్తున్న ఇషాంత్ సోమ‌వారం.. ఢిల్లీ ఫ్రాంచైజీ యాజమాన్యంతో ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో మాట్లాడాడు. ఆట‌గాళ్ల‌కు మ‌ద్ద‌తుగా నిలువ‌డంలో పాంటింగ్ త‌ర్వాతే మ‌రెవ‌రైనా అని పంట‌ర్‌పై ప్ర‌శంస‌లు కురిపించాడు. ప్ర‌స్తుతం పాంటింగ్ ఢిల్లీ క్యాపిట‌ల్స్‌కు ప్ర‌ధాన కోచ్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న విష‌యం తెలిసిందే.

`ఢిల్లీ క్యాపిట‌ల్స్ డ్రెస్సింగ్ రూమ్‌లో ప్ర‌వేశించిన‌ప్పుడు అంతా కొత్త‌గా అనిపించింది. అప్పుడే కెరీర్ ఆరంభించిన కొత్త కుర్రాడిలా బిత్త‌ర చూపులు చూస్తున్న నాకు రికీ అండ‌గా నిలిచాడు. అత‌డితో మాట్లాడిన అనంత‌రం నా ఆత్మ‌విశ్వాసం వెయ్యిరెట్లు పెరిగింది. `నా మొద‌టి చాయిస్ ఎప్పుడూ నువ్వే.. సీనియ‌ర్‌వి కాబ‌ట్టి కొత్త కుర్రాళ్ల‌కు దారి చూపించు` అని పాంటింగ్ అన‌డంతో ఫుల్ జోష్ వ‌చ్చింది. ఇక పాంటింగ్ అంత‌ర్జాతీయ క్రికెట్‌లో కొన‌సాగుతున్న‌ప్పుడు ఎక్కువ సార్లు అత‌డిని ఔట్ చేయ‌డాన్ని ఎప్ప‌టికీ మ‌రువ‌లేను. పెర్త్ టెస్టులో అత‌డికి బౌలింగ్ చేసిన విధానం, ఆ త‌ర్వాత భార‌త ప‌ర్య‌ట‌న‌లో పంట‌ర్ ఇబ్బంది పెట్టిన తీరు నా కెరీర్‌లోనే చాలా గొప్ప‌వి` అని లంబూ అన్నాడు.


logo