ఆదివారం 29 నవంబర్ 2020
Sports - Nov 03, 2020 , 02:21:55

రిటైరవుతున్నా.. ఆట నుంచి కాదు

 రిటైరవుతున్నా..  ఆట నుంచి కాదు

  • ప్రతికూలత, భయానికి గుడ్‌బై చెబుతున్నా .. పీవీ సింధు 

న్యూఢిల్లీ: తాను రిటైరవుతున్నానంటూ భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌, ప్రపంచ చాంపియన్‌ పీవీ సింధు సోషల్‌ మీడియాలో చిన్నపాటి షాకిచ్చింది. అయితే తాను ఆట నుంచి వైదొలగడం లేదని, కరోనా మహమ్మారి వల్ల ఏర్పడిన ప్రతికూల దృక్పథం, భయాల నుంచి రిటైరవుతున్నానని సోమవారం సోషల్‌ మీడియాలో సుదీర్ఘ సందేశాన్ని పోస్ట్‌ చేసింది. ‘నేను వదిలేసిన చివరి టోర్నీ డెన్మార్క్‌ ఓపెన్‌. నేను రిటైరవుతున్నా’నంటూ పరోక్షంగా తదుపరి టోర్నీలో బరిలోకి దిగుతానని సింధు స్పష్టం చేసింది. న్యూట్రిషన్‌, రికవరీ కోసం ప్రస్తుతం లండన్‌లోని గాటరోడ్‌ సైన్స్‌ ఇన్‌స్టిట్యూట్‌లో సింధు శిక్షణ పొందుతున్నది. ‘భారత్‌ తరఫున నేను ప్రాతినిధ్యం వహించలేకపోయిన చివరి టోర్నీ డెన్మార్క్‌ ఓపెన్‌. ప్రస్తుతం ఉన్న అనిశ్చితి నుంచి నేను రిటైరవ్వాలని నిర్ణయించుకున్నా. నెగెటివిటీ, భయం నుంచి రిటైరవుతున్నా. ముఖ్యంగా ప్రామాణికం లేని ఆహార అలవాట్లను త్యజిస్తున్నా’ అని సింధు పేర్కొంది. ఒలింపిక్స్‌ రజత పతక విజేత సింధు చివరగా ఈ ఏడాది మార్చిలో ఆల్‌ఇంగ్లండ్‌ టోర్నీ ఆడగా.. సుదీర్ఘ విరామం తర్వాత తదుపరి ఆసియా ఓపెన్‌లో బరిలోకి దిగనున్నట్టు తెలిపింది.కాగా సింధు ట్వీట్‌కు కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు స్పందించారు. చిన్నపాటి షాకిచ్చావంటూ రిైప్లె ఇచ్చారు. ‘సింధు నువ్వు చిన్నపాటి షాకిచ్చావ్‌.  భారత్‌కు మరిన్ని కీర్తి ప్రతిష్టలు తెచ్చే అంకితభావం, శక్తి నీకు ఉన్నాయని కచ్చితంగా చెప్పగలను’ అని రిజిజు పేర్కొన్నారు.