సోమవారం 30 నవంబర్ 2020
Sports - Nov 07, 2020 , 02:29:27

జస్టిస్‌ వర్మ నియామకం తిరస్కరణ

 జస్టిస్‌ వర్మ నియామకం తిరస్కరణ

  • హెచ్‌సీఏ అపెక్స్‌ కౌన్సిల్‌ కీలక నిర్ణయాలు 

హైదరాబాద్‌, ఆట ప్రతినిధి: హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌(హెచ్‌సీఏ)లో ఆధిపత్య పోరు కోసం అధ్యక్షుడు మహమ్మద్‌ అజారుద్దీన్‌, కార్యవర్గ సభ్యుల మధ్య వైరం కొనసాగుతూనే ఉన్నది. ఉప్పల్‌ స్టేడియం వేదికగా శుక్రవారం సమావేశమైన హెచ్‌సీఏ అపెక్స్‌ కౌన్సిల్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అంబుడ్స్‌మన్‌గా జస్టిస్‌ దీపక్‌ వర్మ నియామకాన్ని అపెక్స్‌ కౌన్సిల్‌ తిరస్కరించింది. దీంతో అధ్యక్ష హోదాలో ఉన్న అజర్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఇదిలా ఉంటే ఈనెల 29న జరిగే ఏజీఎమ్‌లో అంబుడ్స్‌మన్‌ అంశాన్ని చర్చిస్తామని హెచ్‌సీఏ కార్యదర్శి విజయానంద్‌ పేర్కొన్నారు. వర్మ నియామకాన్ని అజర్‌ మినహా అపెక్స్‌ కౌన్సిల్‌లో అందరూ వ్యతిరేకించారని ఆయన అన్నారు. మిగతా నిర్ణయాల విషయానికొస్తే మహబూబ్‌నగర్‌ మైదానాన్ని అన్ని సౌకర్యాలతో అందుబాటులో తీసుకురాబోతున్నట్లు హెచ్‌సీఏ పత్రికా ప్రకటనలో పేర్కొంది. కరోనా వైరస్‌ విజృంభణ కారణంగా ఇన్నాళ్లు నిలిచిపోయిన మ్యాచ్‌లను నిబంధనల మధ్య ఈ నెలలోనే మొదలుపెట్టేందుకు హెచ్‌సీఏ సిద్ధమవుతున్నది. టీ స్పోర్ట్స్‌ సహకారంతో తెలంగాణ ప్రీమియర్‌ లీగ్‌ను పునరుద్ధరించబోతున్నారు. మాజీ రంజీ ప్లేయర్ల పెన్షన్‌ డబ్బులు ఇచ్చేందుకు కౌన్సిల్‌ సభ్యులు అంగీకారానికి వచ్చారు.