న్యూఢిల్లీ: 2011 ప్రపంచకప్ క్వార్టర్ఫైనల్లో ఓటమి చెందాక తనను, తన భార్యను చంపేస్తామని కొందరు బెదిరించారని దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ వెల్లడించాడు. న్యూజిలాండ్‌తో జరిగిన క్వార్టర్స్‌లో డుప్లెసిస్‌తో కలిసి రన్ తీసే సమయంలో సమన్వయలోపంతో డివిలియర్స్ రనౌట్ కాగా.. సఫారీ జట్టు 49 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. దీంతో ఆ మ్యాచ్ తర్వాత సోషల్ మీడియాలో భయానక పరిస్థితులు ఎదుర్కొన్నామని మంగళవారం ఓ ఇంటర్వ్యూలో ఫాఫ్ చెప్పాడు. ఆ మ్యాచ్ తర్వాత నేను హత్యా బెదిరింపులు ఎదుర్కొన్నా. నా భార్యకు కూడా బెదిరింపులు వచ్చాయి. ఆ తర్వాతి నుంచి సోషల్ మీడియాకు కాస్త దూరంగా ఉన్నా అని డుప్లెసిస్ అన్నాడు.