శనివారం 11 జూలై 2020
Sports - Jun 07, 2020 , 21:59:01

సచిన్‌ను ఔటిచ్చినందుకు చంపేస్తామన్నారు

సచిన్‌ను ఔటిచ్చినందుకు చంపేస్తామన్నారు

-ఇంగ్లండ్‌ పేసర్‌ టిమ్‌ బ్రెస్నన్‌

లండన్‌: క్రికెట్‌ దేవుడు సచిన్‌ టెండూల్కర్‌ను ఔట్‌ చేసిన సమయంలో చంపేస్తామనే బెదిరింపులు ఎదురయ్యాయని ఇంగ్లండ్‌ పేసర్‌ టిమ్‌ బ్రెస్నన్‌ వెల్లడించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో సచిన్‌ 99 శతకాలు చేసిన అనంతరం ఇంగ్లండ్‌తో టెస్టు మ్యాచ్‌ సందర్భంగా ఈ సంఘటన చోటు చేసుకుందని అతడు పేర్కొన్నాడు. తనతో పాటు తప్పుడు ఎల్బీడబ్లూ్య నిర్ణయం ఇచ్చిన ఆస్ట్రేలియా అంపైర్‌ హిల్‌ టకర్‌కు కూడా ఇలాంటి బెదిరింపులే వచ్చాయని.. దాంతో అతడు సెక్యూరిటీ ఏర్పాటు చేసుకున్నాడని బ్రెస్నన్‌ చెప్పాడు. 2011 వన్డే ప్రపంచకప్‌లో భాగంగా దక్షిణాఫ్రికాపై 99వ శతకాన్ని పూర్తి చేసిన సచిన్‌.. ఆ తర్వాత ఓవల్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 91 పరుగుల మీద బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో బ్రెస్నన్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. అయితే వాస్తవానికి బంతి లెగ్‌స్టంప్‌ను దాటివెళ్తున్నట్లు రిప్లేలో తేలినా.. అప్పటికే బ్రెస్నన్‌ అప్పీల్‌ చేయడం అంపైర్‌ వేలెత్తడం జరిగిపోయాయి. అయితే ఈ సంఘటన తర్వాత కొన్నాళ్లకు తనకు బెదిరింపులు వచ్చాయని బ్రెస్నెన్‌ ఆదివారం ఒక షోలో వివరించాడు. 

‘ఆ మ్యాచ్‌లో సచిన్‌ 91పై బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో నేను వేసిన బంతి ప్యాడ్‌కు తాకింది. అప్పీలు చేయగానే అంపైర్‌ టకర్‌ ఔటిచ్చాడు. ఆ రోజు అలా జరగకపోయి ఉంటే ఇంగ్లండ్‌ గడ్డపైనే సచిన్‌ వంద శతకాలు పూర్తి చేసుకునేవాడు. ఆ తర్వాత సిరీస్‌ చేజిక్కించుకున్న మా జట్టు ప్రపంచ నంబర్‌వన్‌ స్థానానికి చేరింది. అయితే ఆ తర్వాత నాతో పాటు అంపైర్‌కు బెదిరింపులు ఎదురయ్యాయి. చంపేస్తామనే హెచ్చరికలు కూడా వచ్చాయి. ఔటివ్వడానికి ఎంత ధైర్యం. బంతి లెగ్‌స్టంప్‌ను మిస్‌ చేస్తున్నదని స్పష్టమౌతున్నా అలా ఎలా ఔటిస్తారు అని చాలా ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ ఘటన జరిగిన కొన్నాళ్ల తర్వాత నేను ఆ అంపైర్‌తో కలిశాను. ఈ అంశంపై చర్చించగా.. ‘ఆ రోజు నుంచి నేను సెక్యూరిటీ గార్డును నియమించుకున్నా. పోలీసు భద్రత కూడా తీసుకుంటున్నా’ అని చెప్పాడు. దీంతో ఆశ్చర్యపోవడం నా వంతైంది’ అని బ్రెస్నెన్‌ చెప్పుకొచ్చాడు. 

కాగా.. ఇంగ్లండ్‌ పర్యటన అనంతరం 2012 ఆసియా కప్‌లో బంగ్లాదేశ్‌పై శతకంతో వంద సెంచరీలు పూర్తి చేసుకున్న సచిన్‌ 2013 క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. ప్రపంచకప్‌ మ్యాచ్‌లో శతకానికి ముందు సచిన్‌ను ఔట్‌ చేసినా.. అంపైర్‌ భయపడి వేలెత్తలేకపోయాడని ఇటీవల దక్షిణాఫ్రికా పేసర్‌ డెల్‌ స్టెయిన్‌ పేర్కొన్న విషయం తెలిసిందే. అప్పట్లో డెసిషన్‌ రివ్యూ సిస్టం లేకపోవడంతో.. సచిన్‌ తన కెరీర్‌లో 20, 30 సెంచరీలు మిస్‌ అయ్యాడనేది జగమెరిగిన సత్యం. అంపైర్‌ తప్పుడు నిర్ణయం ప్రకటించాడని తెలిసినా సచిన్‌ మారు మాట్లాడకుండా మైదానాన్ని వీడిన సందర్భాలు కోకొల్లలు. 


logo