గురువారం 26 నవంబర్ 2020
Sports - Nov 22, 2020 , 17:42:04

ఎక్కడైనా బ్యాటింగ్ చేయడానికి సిద్ధం: రోహిత్‌ శర్మ

ఎక్కడైనా బ్యాటింగ్ చేయడానికి సిద్ధం: రోహిత్‌ శర్మ

బెంగళూరు: ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో  టీమ్‌ఇండియా మేనేజ్‌మెంట్‌  ఆదేశిస్తే ఏ స్థానంలోనైనా బ్యాటింగ్‌ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు స్టార్‌ బ్యాట్స్‌మన్‌  రోహిత్‌ శర్మ తెలిపాడు.  టెస్టు సిరీస్‌లో వైస్‌ కెప్టెన్‌ రహానె, టెస్టు స్పెషలిస్ట్‌ బ్యాట్స్‌మన్‌ పుజారాతో కలిసి రోహిత్‌ కీలక పాత్ర పోషించాల్సి ఉంది.   తొలి టెస్టు అనంతరం కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ స్వదేశానికి తిరిగిరానున్న నేపథ్యంలో హిట్‌మ్యాన్‌పై  ఒత్తిడిపెరగనుంది.  పీటీఐకి  ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన రోహిత్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు. 

'గతంలో నేను ఏం చెప్పానో ఇప్పుడు కూడా ఈ సమయంలో మీఅందరికీ అదే చెప్తున్నా.   జట్టు ఏ చోట బ్యాటింగ్‌ చేయాలని కోరినా సంతోషంగా ఆ స్థానంలో బరిలో దిగుతా.  ఓపెనర్‌గా నా స్థానాన్ని మార్చుతారని నేనైతే అనుకోవట్లేదు.  జట్టులో తమ స్థానాలపై ఇప్పటికే  ఆస్ట్రేలియాలో  ఉన్న ఆటగాళ్లకు ఓ అవగాహన ఉంటుంది. విరాట్‌ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారు.  ఎవరెవరు ఇన్నింగ్స్‌ను ఆరంభిస్తారనేదానిపై ఉన్న అవకాశాలపై స్పష్టత వచ్చి ఉంటుందని  అనుకుంటున్నట్లు' రోహిత్‌ వివరించాడు. 

 'నేను అక్కడికి చేరుకున్న తర్వాత ఏం జరగబోతుందనే దానిపై నాకొక స్పష్టమైన ఆలోచన ఉంటుంది. వాళ్లు కోరుకున్న చోట బ్యాటింగ్‌ చేయడానికి నేనైతే సిద్ధంగా ఉన్నట్లు' రోహిత్‌ పేర్కొన్నాడు. ఇప్పటి వరకు 32 టెస్టులాడిన రోహిత్‌ 46 సగటుతో ఉన్నాడు.