శుక్రవారం 04 డిసెంబర్ 2020
Sports - Oct 24, 2020 , 16:26:58

గ్రీన్ క‌ల‌ర్ జెర్సీతో ఆర్‌సీబీ ఆటగాళ్లు.. వీడియో

గ్రీన్ క‌ల‌ర్ జెర్సీతో ఆర్‌సీబీ ఆటగాళ్లు.. వీడియో

దుబాయ్‌: ఐపీఎల్  సీజన్ 13లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జ‌ట్టు సత్తా చాటుతోంది. ప్రతి సీజన్‌లోనూ కలగానే మిగిలిపోతున్న‌ టైటిల్‌ను ఈసారి ఎలాగైనా గెలవాలన్న‌ పట్టుదలతో ఆడుతోంది. బ్యాటింగ్, బౌలింగ్‌లో రాణిస్తూ ప్ర‌స్తుతం పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొన‌సాగుతున్న‌ది. అయితే ప్రతి సీజ‌న్‌లో ఒక మ్యాచ్‌లో ఆర్‌సీబీ జ‌ట్టు ఆట‌గాళ్లు రెగ్యులర్ ఎరుపురంగు జెర్సీకి బ‌దులుగా గ్రీన్‌ రంగు జెర్సీలో క‌నిపిస్తున్నారు. అలా ప్ర‌త్యేక‌మైన జెర్సీ ద్వారా ప్రపంచ స‌మాజానికి త‌మ ఉద్దేశాన్ని చాటి చెబుతున్నారు. 

ఈసారి కూడా ఆర్‌సీబీ జ‌ట్టు ప్లేయ‌ర్స్ ఎప్ప‌టిలాగే ఎరుపు రంగు జెర్సీకి బ‌దులుగా ఆకుప‌చ్చ రంగు జెర్సీని ధ‌రించ‌బోతున్నారు. ఆదివారం మధ్యాహ్నం చెన్నైతో జరగనున్న మ్యాచ్‌లో వారు గ్రీన్ కలర్ జెర్సీల‌తో ద‌ర్శ‌నం ఇవ్వబోతున్నారు. పర్యావరణ పరిరక్షణపై స‌మాజంలో అవగాహన క‌ల్పించే ఉద్దేశంతో ఆర్‌సీబీ జ‌ట్టు గ్రీన్ క‌ల‌ర్‌ను ఎంచుకుంది. చెట్లను పెంచి పర్యావరణాన్ని కాపాడుకుందామని ఆట‌గాళ్లు గ్రీన్ కలర్ జెర్సీల‌తో ప్ర‌పంచానికి చాటి చెప్పనున్నారు. 

ఈ మేరకు ఆర్‌సీబీ తన అధికారిక ట్విటర్ ఖాతాలో ఓ వీడియోను పోస్ట్ చేసింది. లెట్స్‌ గో గ్రీన్ పేరుతో ఈ కార్యక్రమాన్ని ఆర్‌సీబీ ప్రమోట్ చేస్తోంది. సేవ్ వాటర్, సేవ్ ఎలక్ట్రిసిటీ, రెడ్యూస్ ప్లాస్టిక్, గో గ్రీన్ ఈ కార్య‌క్ర‌మం ముఖ్య ఉద్దేశాలు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరం కృషి చేయాలని ఏబీ డెవీలియర్స్ పిలుపునిచ్చాడు. ప్లాస్టిక్ వ్యర్థాలను ఎక్కడంటే అక్కడ పడేయకూడదని, నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించాడు. నీటి ఎద్దడితో దక్షిణాఫ్రికా ఎంతో ఇబ్బందులు పడిందని, మళ్లీ అలాంటి పరిస్థితి ప్రపంచంలో ఎక్కడా రాకూడదని ఆయ‌న‌ అభిప్రాయపడ్డాడు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.