కోల్‌కతాపై కోహ్లీసేన ఘన విజయం..
డివిలియర్స్, మ్యాక్స్‌వెల్ మెరుపులు
చెన్నై: తొలి టైటిల్ వేటలో ఉన్న ఆర్సీబీ.. ఈ ఐపీఎల్ సీజన్లో వరుసగా మూడో విజయం సాధించింది. ఆదివారం ఇక్కడ జరిగిన తొలి డబుల్ హెడర్ మ్యాచ్‌లో బెంగళూరు 38 పరుగుల తేడాతో కోల్‌కతాను చిత్తుచేసింది. మ్యాక్స్‌వెల్ (78), డివిలియర్స్ (76 నాటౌట్) మెరుపులతో తొలుత బెంగళూరు 20 ఓవర్లలో 204/4 స్కోరు చేసింది. కోల్‌కతా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి రెండు, కమిన్స్, ప్రసిద్ధ్ కృష్ణ చెరో వికెట్ తీశారు. భారీ లక్ష్యఛేదనలో తడబడిన కోల్‌కతా 166/8 స్కోరుకే పరిమితమైంది. రసెల్ (31) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. బెంగళూరు బౌలర్లలో జెమీసన్ మూడు, చాహల్, హర్షల్ పటేల్ చెరో రెండు వికెట్లు తీశారు. డివిలియర్స్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ దక్కింది.
మ్యాక్సీ, ఏబీ విధ్వంసం
కేకేఆర్ స్పిన్నర్ వరుణ్ వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్లో కెప్టెన్ కోహ్లీ (5), పటిదార్ (1) ఔట్ కావడంతో బెంగళూరు 9 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. అయితే ఆ తర్వాత ఎలాంటి తడబాటు లేకుండా మ్యాక్స్‌వెల్ దూకుడుగా ఆడడంతో ఆరు ఓవర్లలోనే ఆర్సీబీ 45 పరుగులు చేసింది. మ్యాక్సీ బౌండరీలతో రెచ్చిపోగా.. మరో ఎండ్‌లో పడిక్కల్ (25) అతడికి తోడుగా నిలిచాడు. ఈ క్రమంలో 28 బంతుల్లో మ్యాక్సీ అర్ధశతకాన్ని చేరుకున్నాడు. పడిక్కల్ ఔటైనా డివిలియర్స్ క్రీజులోకి రావడంతో బెంగళూరు స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. ఇద్దరూ పోటీ పడి మరీ బాదేయడంతో ఆర్సీబీ 15 ఓవర్లకే 134 పరుగులకు చేరింది. ఈ క్రమంలోఎడాపెడా సిక్సర్లు, ఫోర్లు బాదేసిన ఏబీ 27 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. బెంగళూరుకు చివరి 3 ఓవర్లలో 56 పరుగులు వచ్చాయి.
ఆసాంతం తడబాటే
బెంగళూరు బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఏ దశలోనూ కోల్‌కతా లక్ష్యాన్ని చేరేలా కనిపించలేదు. ఆరంభంలో ఓపెనర్ గిల్ (21) కాసేపు మెరిపించినా.. ఆ తర్వాత ఎవరూ ధాటిగా ఆడలేకపోయారు. గెలువాలంటే 4 ఓవర్లకు 79 పరుగులు చేయాల్సిన సమయంలో ఆండ్రీ రసెల్ రెండు సిక్సర్లతో ఉత్కంఠ రేపినా.. 19వ ఓవర్ వేసిన హైదరాబాదీ పేసర్ సిరాజ్ యార్కర్లతో అతడిని కట్టిపడేసి కేవలం ఒక్క పరుగే ఇవ్వడంతో కోల్‌కతా పరాజయం ఖరారైంది.
స్కోరు బోర్డు
బెంగళూరు: కోహ్లీ (సి) త్రిపాఠి (బి) చక్రవర్తి 5, పడిక్కల్ (సి) త్రిపాఠి (బి) ప్రసిద్ధ్ 25, పటిదార్ (బౌల్డ్) చక్రవర్తి 1, మ్యాక్స్‌వెల్ (సి) హర్భజన్ (బి) కమిన్స్ 78, డివిలియర్స్ (నాటౌట్) 76, జెమీసన్ (నాటౌట్) 11; ఎక్స్‌ట్రాలు: 8, మొత్తం: 20 ఓవర్లలో 204/4. వికెట్ల పతనం: 1-6, 2-9, 3-95, 4-148. బౌలింగ్: హర్భజన్ 4-0-38-0, చక్రవర్తి 4-0-39-2, షకీబ్ 2-0-24-0, కమిన్స్ 4-0-34-1, ప్రసిద్ధ్ కృష్ణ 4-0-31-1, రసెల్ 2-0-38-0.
కోల్‌కతా: నితీశ్ రాణా (సి) పడిక్కల్ (బి) చాహల్ 18, గిల్ (సి) క్రిస్టియన్ (బి) జెమీసన్ 21, త్రిపాఠి (సి) సిరాజ్ (బి) సుందర్ 25, మోర్గాన్ (సి) కోహ్లీ (బి) హర్షల్ 29, దినేశ్ కార్తీక్ (ఎల్బీడబ్ల్యూ) చాహల్ 2, షకీబ్ (బౌల్డ్) జెమీసన్ 26, ఆండ్రీ రసెల్ (బౌల్డ్) హర్షల్ 31, కమిన్స్ (సి) డివిలియర్స్ (బి) జెమీసన్ 6, హర్భజన్ (నాటౌట్) 2, చక్రవర్తి (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు:4, మొత్తం: 20 ఓవర్లలో 166/8. వికెట్ల పతనం: 1-23, 2-57, 3-66, 4-47, 5-114, 6-155, 7-161, 8-162, బౌలింగ్: సిరాజ్ 3-0-17-0, జెమీసన్ 3-0-41-3, చాహల్ 4-0-34-2, సుందర్ 4-0-33-1, మ్యాక్స్‌వెల్ 2-0-24-0, హర్షల్ 4-0-17-2.