బుధవారం 30 సెప్టెంబర్ 2020
Sports - Sep 16, 2020 , 00:08:29

ఆర్‌సీబీ కల తీరేనా!

ఆర్‌సీబీ కల తీరేనా!

బంతికే భయం పుట్టేలా బాదగల విరాట్‌..     సిక్సర్లకు కొత్త అర్థం చెప్పిన డివిలియర్స్‌..  విధ్వంసానికి కేరాఫ్‌ అడ్రస్‌ అయిన ఫించ్‌..  పిట్టకొంచెం కూత ఘనంలా చెలరేగే పార్థివ్‌..  నిఖార్సైన ఆల్‌రౌండర్స్‌ మొయిన్‌ అలీ, మోరిస్‌..  పేస్‌ గన్స్‌ స్టెయిన్‌, ఉమేశ్‌, సిరాజ్‌..  స్పిన్‌ మాంత్రికులు జంపా, చాహల్‌..   ఇలా కాగితం మీద చూసుకుంటే.. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్‌సీబీ)ను మించిన జట్టు మరొకటి కనిపించదు. అయినా పుష్కర కాలంగా ఐపీఎల్‌ టైటిల్‌ కోసం తండ్లాడుతున్న విరాట్‌ సేన.. ఈ సారైనా తమ కల నెరవేర్చుకుంటుందేమో చూడాలి!

నమస్తే తెలంగాణ క్రీడావిభాగం :  ఐపీఎల్‌ సీజన్‌ మొదలవుతుందంటే చాలు బెంగళూరు అభిమానుల హడావుడి మామూలుగా ఉండదు. ‘ఈ సలా కప్పు నమదే’ (ఈ సారి కప్పు మనదే) అంటూ నానా హంగామా చేస్తారు. ప్రతిసారి లాగే ఈ ఏడాది కూడా బెంగళూరు బలమైన జట్టుతో లీగ్‌కు సిద్ధమైంది. బ్యాటింగ్‌తో పోల్చుకుంటే బౌలింగ్‌ కాస్త బలహీనంగా ఉండటంతో పది కోట్లు పెట్టి దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్‌ క్రిస్‌ మోరిస్‌ను కొనుగోలు చేసింది. పన్నెండేండ్లుగా పోరాడుతున్నా.. ఒకటికి మూడుసార్లు (2009, 2011, 2016) ఫైనల్‌ చేరినా.. టైటిల్‌ మాత్రం కొట్టలేకపోయిన రాయల్‌ చాలెంజర్స్‌.. ఈ సారి మరింత జోరు పెంచేందుకు రెడీ అయింది. 2016 సీజన్‌లాగే ఇప్పుడు కూడా జట్టు చాలా సమతూకంగా ఉందని విరాట్‌ సంతృప్తి వ్యక్తం చేస్తుంటే.. డివిలియర్స్‌ కూడా ఫుల్‌ జోష్‌లో కెప్టెన్‌కు అండగా నిలుస్తున్నాడు. భీకర బ్యాటింగ్‌ లైనప్‌ ఉన్న బెంగళూరు నిలకడగా ఆడితే ప్రత్యర్థులకు ఇబ్బందులు తప్పవు. 

అన్నీ తానై..

 ఐపీఎల్‌ చర్రితలో ఇప్పటి వరకు ఒకే ఫ్రాంచైజీకి ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక ఆటగాడు విరాట్‌ కోహ్లీనే. బెంగళూరు అభిమానులు అతడిని ఆదరించే తీరు చూసి.. ఎప్పటికీ తాను చాలెంజర్స్‌ను వీడకపోవచ్చని విరాట్‌ ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. అలా  తనపై నమ్మకం పెట్టుకున్న అభిమానుల కోసం శాయశక్తుల కష్టపడుతున్న కోహ్లీ.. ఈ సారి టైటిల్‌ లోటు భర్తీ చేయాలని తహతహలాడుతున్నాడు. ‘మిస్టర్‌ 360’ డివిలియర్స్‌ బెంగళూరు అమ్ములపొదిలోని ప్రధాన అస్త్రం. ఆసీస్‌ పరిమిత ఓవర్ల కెప్టెన్‌ ఫించ్‌, ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ మొయిన్‌ అలీ, దక్షిణాఫ్రికా ఆటగాడు క్రిస్‌ మోరిస్‌ బ్యాటింగ్‌ సామర్థ్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే టాపార్డర్‌ బలంగా ఉన్నా మిడిలార్డర్‌లో నిలకడగా ఆడగలిగే ఆటగాడి లోటు కనిపిస్తున్నది.  

మోరిస్‌ రాకతో..

డెత్‌ ఓవర్స్‌లో పరుగులు సమర్పించుకునే అలవాటు మానుకుంటే బెంగళూరుకు తిరుగుండదు. స్టెయిన్‌తో పాటు మోరిస్‌, ఉమేశ్‌ యాదవ్‌, హైదరాబాదీ మహమ్మద్‌ సిరాజ్‌, నవదీప్‌ సైనీ పేస్‌ బాధ్యత మోయనున్నారు. స్పిన్‌ విభాగంలో చాహల్‌తో పాటు ఆడమ్‌ జంపా, సుందర్‌, మొయిన్‌ అలీ అందుబాటులో ఉన్నారు.    

లీగ్‌లో ఇలా..  

మొత్తం ఆడిన మ్యాచ్‌లు 181

గెలిచినవి 84

ఓడినవి 98

టై 00

ఫలితం తేలనివి 04

అత్యుత్తమ ప్రదర్శన    2009, 2011,   రన్నరప్‌


logo