150 పరుగుల లక్ష్యఛేదనలో 16 ఓవర్లు పూర్తయ్యేసరికి సన్‌రైజర్స్ హైదరాబాద్ 115/2తో నిలిచింది. విజయానికి 24 బంతుల్లో 35 పరుగులు అవసరం కాగా.. మనీశ్ పాండే, బెయిర్‌స్టో క్రీజులో ఉండటంతో ఆరెంజ్ ఆర్మీ బోణీ కొట్టడం పక్కా అనిపించింది. అయితే అనూహ్యంగా విజృంభించిన బెంగళూరు బౌలర్లు వరుస వికెట్లు పడగొట్టి హైదరాబాద్‌కు నిరాశ మిగిల్చారు. షాబాజ్ అహ్మద్ ఒకే ఓవర్లో మూడు వికెట్లు పడగొట్టగా.. మిడిలార్డర్ ముంచడంతో వార్నర్ సేనకు సీజన్లో వరుసగా రెండో పరాజయం తప్పలేదు.
చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 14వ సీజన్లో వరుసగా రెండో రోజూ బౌలర్ల హవా సాగింది. చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన పోరులో క్రమశిక్షణతో బౌలింగ్ చేసిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు సీజన్లో రెండో విజయాన్ని నమోదు చేసుకోగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు మరోసారి నిరాశ తప్పలేదు. బుధవారం బెంగళూరుతో జరిగిన పోరులో హైదరాబాద్ 6 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. మొదట బ్యాటింగ్ చేసిన కోహ్లీ సేన నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 149 పరుగులు చేసింది. ఆల్‌రౌండర్ మ్యాక్స్‌వెల్ (41 బంతుల్లో 59; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) ఐదేండ్ల తర్వాత ఐపీఎల్లో అర్ధశతకం నమోదు చేయగా.. కెప్టెన్ విరాట్ (33) ఫర్వాలేదనిపించాడు. హైదరాబాద్ బౌలర్లలో హోల్డర్ 3, రషీద్ ఖాన్ రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో సన్‌రైజర్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 143 పరుగులకు పరిమితమైంది. కెప్టెన్ డేవిడ్ వార్నర్ (37 బంతుల్లో 54; 7 ఫోర్లు, ఒక సిక్సర్) హాఫ్‌సెంచరీ సాధించగా.. మనీశ్ పాండే (38) రాణించాడు. బెంగళూరు బౌలర్లలో షాబాజ్ అహ్మద్ 3, మహమ్మద్ సిరాజ్, హర్షల్ పటేల్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. మ్యాక్స్‌వెల్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
కట్టిపడేసిన బౌలర్లు..
టాస్ ఓడి ఇన్నింగ్స్ ఆరంభించిన బెంగళూరుకు శుభారంభం దక్కలేదు. కరోనా నుంచి కోలుకొని జట్టులోకి వచ్చిన యువ ఓపెనర్ దేవదత్ పడిక్కల్ (11) ఆరంభంలోనే ఔట్ కాగా.. పించ్ హిట్టర్‌గా వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన షాబాజ్ అహ్మద్ (14) ఎక్కువసేపు నిలువలేకపోయాడు. ఈ దశలో కెప్టెన్ కోహ్లీకి మ్యాక్స్‌వెల్ తోడవడంతో బెంగళూరు ఇన్నింగ్స్ సజావుగా సాగింది. అయితే హైదరాబాద్ స్పిన్నర్లు విజృంభించడంతో కోహ్లీసేన వేగంగా పరుగులు రాబట్టలేకపోయింది. ఫలితంగా 10 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు 63/2తో నిలిచింది. తదుపరి ఓవర్లో జూలు విదిల్చిన మ్యాక్స్‌వెల్ 6,4,6 అరుసుకోగా.. కోహ్లీ కూడా ఓ ఫోర్ కొట్టడంతో మొత్తం 22 పరుగులు వచ్చాయి. అదే జోరును కొనసాగించడంలో విఫలమైన బెంగళూరు వరుస ఓవర్లలో కోహ్లీ, ఏబీ డివిలియర్స్ (1) వికెట్లు కోల్పోయింది. వాషింగ్టన్ సుందర్ (8), క్రిస్టియన్ (1) ప్రభావం చూపకపోగా.. మ్యాక్స్‌వెల్ కొన్ని చక్కటి షాట్లతో జట్టుకు పోరాడే స్కోరు అందించాడు.
వార్నర్ ఒక్కడే..
ఓ మాదిరి లక్ష్యఛేదనలో ఆరంభంలోనే ఓపెనర్ వృద్ధిమాన్ సాహా (1) వికెట్ కోల్పోయినా.. డేవిడ్ వార్నర్, మనీశ్ పాండే నిలకడగా ఆడటంతో పవర్‌ప్లే ముగిసేసరికి సన్‌రైజర్స్ 50/1తో నిలిచింది. హైదరాబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్ తొలి రెండు ఓవర్లలో 2 పరుగులే ఇచ్చి ఓ వికెట్ పడగొట్టగా.. ఆ తర్వాత వార్నర్, మనీశ్ ధాటిగా బ్యాటింగ్ చేశారు. ఈ క్రమంలో 31 బంతుల్లో అర్ధశతకం పూర్తిచేసుకున్న వార్నర్ కాసేపటికే ఔట్ కాగా.. బెంగళూరు బౌలర్లు కట్టదిట్టమైన బం తులు వేయడంతో పరుగుల రాక గగనమైంది. 24 బంతుల్లో 35 పరుగులు చేయాల్సిన దశలో.. షాబాజ్ అహ్మ ద్ ఒకే ఓవర్లో మూడు వికెట్లు పడగొట్టడంతో హైదరాబాద్ ఓటమి ఖాయమైంది. బెయిర్‌స్టో (12), సమద్ (0), శంకర్ (3), హోల్డర్ (4) విఫలం కాగా.. చివర్లో రషీద్ ఖాన్ మెరుపులు (17) జట్టును గెలిపించలేకపోయాయి.
స్కోరు బోర్డు
బెంగళూరు: కోహ్లీ (సి) శంకర్ (బి) హోల్డర్ 33, పడిక్కల్ (సి) నదీమ్ (బి) భువనేశ్వర్ 11, షాబాజ్ అహ్మద్ (సి) రషీద్ (బి) నదీమ్ 14, మ్యాక్స్‌వెల్ (సి) సాహా (బి) హోల్డర్ 59, డివిలియర్స్ (సి) వార్నర్ (బి) రషీద్ 1, సుందర్ (సి) పాండే (బి) రషీద్ 8, క్రిస్టియన్ (సి) సాహా (బి) నటరాజన్ 1, జెమీసన్ (సి) పాండే (బి) హోల్డర్ 12, హర్షల్ (నాటౌట్) 0, ఎక్స్‌ట్రాలు: 10, మొత్తం: 149/8. వికెట్ల పతనం: 1-19, 2-47, 3-91, 4-95, 5-105, 6-109, 7-136, 8-149, బౌలింగ్: భువనేశ్వర్ 4-0-30-1, హోల్డర్ 4-0-30-3, నదీమ్ 4-0-36-1, నటరాజన్ 4-0-32-1, రషీద్ 4-0-18-2.
హైదరాబాద్: సాహా (సి) మ్యాక్స్‌వెల్ (బి) సిరాజ్ 1, వార్నర్ (సి) క్రిస్టియన్ (బి) జెమీసన్ 54, పాండే (సి) హర్షల్ (బి) షాబాజ్ అహ్మద్ 38, బెయిర్‌స్టో (సి) డివిలియర్స్ (బి) షాబాజ్ అహ్మద్ 12, సమద్ (సి అండ్ బి) సమద్ 0, శంకర్ (సి) కోహ్లీ (బి) హర్షల్ 3, హోల్డర్ (సి) క్రిస్టియన్ (బి) సిరాజ్ 4, రషీద్ (రనౌట్) 17, భువనేశ్వర్ (నాటౌట్) 2, నదీమ్ (సి) షాబాజ్ అహ్మద్ (బి) హర్షల్ 0, నటరాజన్ (నాటౌట్) 0, ఎక్స్‌ట్రాలు:12, మొత్తం: 20 ఓవర్లలో 143/9. వికెట్ల పతనం: 1-3, 2-96, 3-115, 4-115, 5-116, 6-123, 7-130, 8-143, 9-142, బౌలింగ్: సిరాజ్ 4-1-25-2, జెమీసన్ ,3-0-30-1 సుందర్ 2-0-14-0, చాహల్ 4-0-29-0, హర్షల్ 4-0-25-2, క్రిస్టియన్ 1-0-7-0, షాబాజ్ అహ్మద్ 2-0-7-3.