బుధవారం 25 నవంబర్ 2020
Sports - Nov 03, 2020 , 18:21:30

బెంగళూరు ఓపెనర్‌ పడిక్కల్‌ సరికొత్త రికార్డ్

బెంగళూరు ఓపెనర్‌ పడిక్కల్‌ సరికొత్త రికార్డ్

దుబాయ్: ఈ ఏడాది ఐపీఎల్‌లో  కొందరు యువ, వర్ధమాన ఆటగాళ్లు అంచనాల్ని మించి రాణించారు.  అద్భుత ఆటతీరుతో అందరి దృష్టిని తమవైపు తిప్పుకున్నారు.   రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఓపెనర్‌, కర్ణాటక కుర్రాడు దేవదత్‌ పడిక్కల్‌ సీజన్‌లో బాగా పాపులర్‌ అయ్యాడు. ఆరెంజ్‌ క్యాప్‌ లిస్టులో కేఎల్‌ రాహుల్‌ తర్వాత పడిక్కల్‌ ఉన్నాడు. 

తొలి ఐపీఎల్‌ సీజన్‌లోనే  ఎక్కువ అర్ధసెంచరీ(5)లు,  అత్యధిక పరుగులు(472) సాధించిన భారత అన్‌క్యాప్‌డ్‌ బ్యాట్స్‌మన్‌గా అరుదైన ఘనత అందుకున్నాడు. ఐపీఎల్ అన్‌క్యాప్‌డ్‌ ఆటగాళ్ల జాబితాలో ఈ రికార్డు నెలకొల్పిన మూడో ఆటగాడు  పడిక్కల్‌.  2008లో శిఖర్‌ ధావన్‌, 2015లో శ్రేయస్‌ అయ్యర్‌ తమ అరంగేట్ర సీజన్‌లోనే 4 అర్ధసెంచరీలు బాదారు. 

తన తొలి  ఐపీఎల్‌ సీజన్‌లో ఇప్పటి వరకు 472 పరుగులతో  అత్యధిక రన్స్‌  సాధించిన భారత ఆటగాడిగా నిలిచాడు.   2015లో అప్పటి ఢిల్లీ  డేర్‌డెవిల్స్‌  తరఫున తొలి సీజన్ ఆడిన  అయ్యర్  439  పరుగులు  చేశాడు.  ఆడిన తొలి ఐపీఎల్  సీజన్‌లోనే  400కిపైగా రన్స్ చేసిన 8వ భారత  బ్యాట్స్‌మన్‌గా పడిక్కల్  నిలిచాడు.