మంగళవారం 24 నవంబర్ 2020
Sports - Oct 17, 2020 , 21:14:08

IPL 2020: చెలరేగిన డుప్లెసిస్‌‌, రాయుడు

IPL 2020: చెలరేగిన డుప్లెసిస్‌‌, రాయుడు

షార్జా:  ఐపీఎల్‌-13లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో  మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన చెన్నై  సూపర్‌ కింగ్స్‌ 20 ఓవర్లలో  4 వికెట్లకు 179  పరుగులు సాధించింది. షార్జా మైదానంలో  బ్యాట్స్‌మెన్‌ సమష్టిగా రాణించడంతో చెన్నై  మంచి స్కోరు   చేసింది.   డుప్లెసిస్‌(58: 47 బంతుల్లో 6ఫోర్లు, 2సిక్సర్లు) అర్ధశతకానికి తోడు షేన్‌ వాట్సన్‌(36: 28 బంతుల్లో 6ఫోర్లు) రాణించారు.  ఆఖర్లో అంబటి  రాయుడు(45 నాటౌట్‌: 25 బంతుల్లో 1ఫోర్‌, 4సిక్సర్లు ),  రవీంద్ర జడేజా(33 నాటౌట్‌: 13 బంతుల్లో 4సిక్సర్లు ) దుమ్ము రేపారు.  ఢిల్లీ బౌలర్లలో నోర్ట్జే రెండు వికెట్లు తీయగా రబాడ, తుషార్‌ దేశ్‌పాండే చెరో వికెట్‌ పడగొట్టారు. 

చెన్నైకి శుభారంభం లభించలేదు.  ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌లోనే  శామ్‌ కరన్‌(0) వికెట్‌  కోల్పోయింది.  గత మ్యాచ్‌లో ఓపెనర్‌గా ఫర్వాలేదనిపించిన కరన్‌ ఈ మ్యాచ్‌లో డకౌటయ్యాడు.     ఈ దశలో క్రీజులో ఉన్న వాట్సన్‌, డుప్లెసిస్‌  ఆదుకున్నారు.  పవర్‌ప్లే ఆఖరికి  39/1తో నిలిచింది.   తుషార్‌ దేశ్‌పాండే వేసిన మూడో ఓవర్‌లో వాట్సన్‌ రెండు ఫోర్లు కొట్టి 10  రన్స్‌ రాబట్టాడు.  నోర్ట్జే వేసిన ఐదో ఓవర్లో డుప్లెసిస్‌ ఒక సిక్స్‌, రెండు ఫోర్లు బాది 14 పరుగులు సాధించాడు.  ముఖ్యంగా డుప్లెసిస్‌ సూపర్‌ షాట్లతో చెలరేగాడు. 

వాట్సన్‌ సహకారం అందిస్తుండటంతో మరో ఎండ్‌లో డుప్లెసిస్‌ రెచ్చిపోయాడు.  నోర్ట్జే వేసిన 12వ ఓవర్‌లో డుప్లెసిస్‌ అర్థసెంచరీ పూర్తి  చేసుకోగా అదే ఓవర్‌లో వాట్సన్‌  క్లీన్‌ బౌల్డయ్యాడు. దీంతో 87 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.  ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రాయుడుతో   కలసి డుప్లెసిస్‌  స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.  అర్ధశతకంతో ఊపుమీదున్న డుప్లెసిస్‌ను ఔట్‌ చేసిన రబాడ ఈ జోడీని విడదీశాడు.   డుప్లెసిస్‌ బాదిన బంతిని   లాంగాన్‌ నుంచి పరుగెత్తుకుంటూ వచ్చిన శిఖర్‌ ధావన్‌ సూపర్బ్‌ క్యాచ్‌ అందుకున్నాడు. 

ఆఖరి ఓవర్లలో రాయుడు స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.  బౌండరీలు బాదడమే లక్ష్యంగా బాదేశాడు. స్టాయినీస్‌  ఓవర్‌లో   రాయుడు కళ్లు చెదిరే సిక్సర్‌తో ఆకట్టుకున్నాడు.  రాయుడుకు సహకరించాల్సిన ధోనీ(3) మరోసారి నిరాశపరిచాడు. నోర్ట్జే బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. డెత్‌ ఓవర్లలో చెన్నై విజృంభించింది. 21 బంతుల్లోనే  రాయుడు, జడేజా జోడీ 50 పరుగులు జోడించడంతో స్కోరు 170 దాటింది.