e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, September 21, 2021
Home Top Slides దంగల్‌ కింగ్‌ దహియా

దంగల్‌ కింగ్‌ దహియా

  • రెజ్లింగ్‌ ఫైనల్లో రవికుమార్‌
  • భారత్‌ ఖాతాలో నాలుగో పతకం
  • జావెలిన్‌ త్రో ఫైనల్లో నీరజ్‌ చోప్రా
  • మహిళల హాకీలో అర్జెంటీనాపై పోరాడి ఓడిన రాణిసేన
  • బాక్సింగ్‌లో లవ్లీనాకు కాంస్యం
  • సెమీస్‌లో ఓడిన హాకీ మహిళలు
  • కాంస్య పోరులో దీపక్‌

రాజుల కాలం నాటి కుస్తీ క్రీడలో మన మల్లయోధుడు రాజసం కనబర్చాడు. పట్టిన పట్టు వీడకుండా.. ప్రత్యర్థులను చిత్తుచేస్తూ ఫైనల్‌కు చేరుకున్నాడు. మారుమూల గ్రామంలోని రైతు కుటుంబంలో పుట్టిన రవి దహియా.. విశ్వవేదికపై ఫైనల్‌కు చేరిన రెండో భారత రెజ్లర్‌గా రికార్డుల్లోకెక్కితే.. దీపక్‌ పునియా కాంస్య పతకం కోసం పోటీ పడనున్నాడు.

యుద్ధవిద్యల్లో ఆరితేరిన నేర్పరి.. కిక్‌ బాక్సింగ్‌లో ప్రత్యర్థులను చిత్తు చేసిన గడసరి..రింగ్‌లో ప్రత్యర్థిపై పంచ్‌లతో విరుచుకుపడే పొడగరి.. అస్సాం బాక్సర్‌ లవ్లీనా బొర్గోహై కాంస్య పతకం చేజిక్కించుకుంది. సెమీస్‌ బౌట్‌లో ప్రభావం చూపలేకపోయిన లవ్లీనా.. విజేందర్‌, మేరీకోమ్‌ తర్వాత ఈ ఘనత సాధించిన భారత మూడో బాక్సర్‌గా చరిత్రకెక్కితే.. జావెలిన్‌ త్రోలో నీరజ్‌ చోప్రా అద్భుత ప్రదర్శనతో ఫైనల్‌కు దూసుకెళ్లాడు. మహిళల హాకీ సెమీఫైనల్‌లో రాణి పరివారానికి ఓటమి ఎదురుకాగా.. గోల్ఫ్‌లో అదితి శుభారంభం చేసింది!

- Advertisement -

ఒలింపిక్స్‌ ఫైనల్‌కు చేరిన రెండో భారత రెజ్లర్‌గా రవి దహియా రికార్డు సృష్టించాడు. గతంలో సుశీల్‌ లండన్‌ (2012) ఒలింపిక్స్‌లో ఫైనల్‌ చేరి రజతం సొంతం చేసుకున్నాడు.
టోక్యో: విశ్వక్రీడలు ముగింపు దశకు చేరుకుంటున్న కొద్ది భారత అథ్లెట్ల ప్రదర్శన రాటుదేలుతున్నది. బుధవారం రెజ్లింగ్‌లో రవికుమార్‌ దహియా ఫైనల్‌కు చేరి పతకం ఖాయం చేసుకుంటే.. దీపక్‌ పునియా సెమీస్‌లో ఓడి కాంస్యం కోసం పోటీపడనున్నాడు. బాక్సింగ్‌ సెమీస్‌లో ఓడిన లవ్లీనా బొర్గోహై కాంస్య పతకం చేజిక్కించుకుంటే.. జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా ఫైనల్‌లో అడుగుపెట్టాడు. సెమీస్‌లో అర్జెంటీనా చేతిలో ఓడిన మహిళల జట్టు కాంస్య పతకం కోసం శుక్రవారం గ్రేట్‌బ్రిటన్‌తో అమీతుమీ తేల్చుకోనుంది.

ఇక పసిడి పట్టే..
టోక్యో విశ్వక్రీడల్లో రెజ్లర్‌ రవి దహియా భారత్‌కు నాలుగో పతకాన్ని ఖాయం చేశాడు. ఇప్పటికే వెయిట్‌ లిఫ్టింగ్‌లో మీరాబాయి చాను, బ్యాడ్మింటన్‌లో పీవీ సింధు, బాక్సింగ్‌లో లవ్లీనా బొర్గోహై మెడల్స్‌ సాధించగా.. రవి దహియా ఫైనల్‌ చేరడం ద్వారా కనీసం రజత పతకం ఖాయమైంది. బుధవారం జరిగిన పురుషుల 57 కేజీల సెమీఫైనల్‌లో నూర్‌ఇస్లాం (కజకిస్థాన్‌)ను చిత్తు చేసిన రవి తుదిపోరుకు అర్హత సాధించాడు. తద్వారా సుశీల్‌ కుమార్‌ (2012 లండన్‌ ఒలింపిక్స్‌) తర్వాత ఫైనల్‌కు చేరిన భారత రెండో రెజ్లర్‌గా రికార్డుల్లోకెక్కాడు. హర్యానాలోని రైతు కుటుంబంలో జన్మించిన రవి దహియా సెమీస్‌ ఆరంభంలో కాస్త వెనుకబడ్డా.. ‘పిన్‌ డౌన్‌’ద్వారా ప్రత్యర్థిని మట్టికరిపించి విజేతగా నిలిచాడు. నాలుగో సీడ్‌గా బరిలోకి దిగిన రవి 2-9తో వెనుకంజలో ఉన్న దశలో.. ప్రత్యర్థి రెండు కాళ్లు ఒడిసిపట్టాడు. ఈ దశలో నూర్‌ఇస్లాం గాయపడగా.. అదే జోరులో ప్రత్యర్థిని పైకి లేవనివ్వకుండా ఒడిసి పట్టిన రవి దహియా.. ‘విక్టరీ బై ఫాల్‌’పద్ధతిలో విజేతగా నిలిచాడు. ‘ఇంకా నా పని పూర్తి కాలేదు. స్వర్ణం నెగ్గడానికే ఇక్కడికి వచ్చా’అని బౌట్‌ అనంతరం రవి పేర్కొన్నాడు. అంతకుముందు తొలి రౌండ్‌లో రవి దహియా 13-2తో ఉర్బనో (కొలంబియా)పై.. క్వార్టర్స్‌లో 14-4తో వలెంటినోవ్‌పై ‘టెక్నికల్‌ సుపీరియారిటీ’ద్వారా గెలుపొందాడు. గురువారం జరుగనున్న ఫైనల్లో ఉగేవ్‌తో రవి తలపడనున్నాడు.

రవిని కొరికేశాడు..
సెమీఫైనల్‌ బౌట్‌లో రవి దహియా గాయపడ్డాడు. వరుస విజయాలతో బౌట్‌లోకి అడుగుపెట్టిన రవి పుంజుకునే క్రమంలో ప్రత్యర్థి రెజ్లర్‌ నూర్‌ఇస్లాం పంటి గాటుకు గురయ్యాడు. ఉక్కిరిబిక్కిరి చేసే రీతిలో మెలిపెట్టడంతో విడిపించుకునే క్రమంలో నూర్‌ఇస్లాం..రవి భుజాన్ని గాట్లు పడేలా గట్టిగా కొరికాడు. బౌట్‌ ముగిసిన తర్వాత నొప్పితో బాధపడిన దహియా.. రిఫరీకి ఫిర్యాదు చేయకుండానే వెనుదిరిగాడు. ప్రస్తుతం రవి గాయం అందోళనకరంగా లేదని సహాయ బృందం పేర్కొంది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana