సోమవారం 28 సెప్టెంబర్ 2020
Sports - Jul 28, 2020 , 16:01:33

‘ఫ్రీ బాల్’ నిబంధన తీసుకురావాలి: అశ్విన్​

‘ఫ్రీ బాల్’ నిబంధన తీసుకురావాలి: అశ్విన్​

న్యూఢిల్లీ: క్రికెట్​లో కొత్త నిబంధన తేవాలని టీమ్​ఇండియా స్టార్ స్పిన్నర్​ రవిచంద్రన్ అశ్విన్ ఓ ప్రతిపాదన తెరపైకి తెచ్చాడు. బౌలర్ బంతిని వదిలే లోపలే నాన్ స్ట్రయికర్​ క్రీజును వదిలి ముందుకు వెళితే..  పరుగులు పూర్తి చేసేందుకు అనుమతించకూడదని సూచించాడు.  అలా కాకుంటే తర్వాతి బంతిని ఫ్రీబాల్​గా ప్రకటించేలా నిబంధన తేవాలని సూచించాడు. అంటే ఫ్రీబాల్​కు పరుగులు చేసినా లెక్కలేనట్టు. 2023 వన్డే ప్రపంచకప్ కోసం నిర్వహించే సూపల్ లీగ్​లో ఫ్రంట్ ఫుట్​ నోబాల్​ నిర్ణయాన్ని టీవీ అంపైర్​కు ఐసీసీ అప్పగించిన నేపథ్యంలో… అశ్విన్ కొత్త ప్రదిపాదనలు ముందుకు తెచ్చాడు.

"ఒకవేళ బౌలర్ బంతి వేసే ముందే నాన్​స్ట్రయికర్​ క్రీజు దాటితే.. టెక్నాలజీ గమనించి.. పరుగులను అనుమతించని పరిస్థితి వస్తుందని ఆశిస్తున్నా. బ్యాట్స్​మన్ ఇలా చేసిన ప్రతీసారి ఇలాగే జరుగాలి.  ఎందుకో వివరిస్తా. ఒకవేళ బంతి వేయకముందే నాన్ స్ట్రయికర్ రెండు అడుగులు ముందుకు వెళ్లి.. దానివల్లే రెండు పరుగులు పూర్తి చేయగలిగితే మళ్లీ అదే బ్యాట్స్​మన్ స్ట్రయికింగ్​కు వస్తాడు. ఆ తర్వాతి బంతికి అతడు ఫోర్ లేదా సిక్సర్ కొడితే ఐదు లేదా ఏడు పరుగులు సమర్పించుకున్నట్టే. ఒకవేళ ఒక పరుగే వస్తే.. కొత్త బ్యాట్స్​మన్ స్ట్రయిక్​లోకి వచ్చి డాట్ బాల్ ఆడే అవకాశం ఉంటుంది”అని అశ్విన్ ట్వీట్ చేశాడు. అయితే నాన్ స్ట్రయికర్ ముందుకు వెళితే రనౌట్(మన్కడింగ్) చేసే అవకాశం ఉంటుంది కదా అని యూజర్ ఇచ్చిన రిప్లైకి అశ్విన్ స్పందించాడు. “ముందుకు వెళ్లడాన్ని అనుమతించకపోయే బదులు.. ఆ తర్వాతి బంతిని బౌలర్​కు ఫ్రీబాల్​గా ఇవ్వాలి. ఇదే కాస్త న్యాయంగా ఉంటుంది” అని అశ్విన్ సమాధానమిచ్చాడు. కాగా గతంలో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ తరఫున ఆడిన అశ్విన్.. మన్కడింగ్ చేయగా కొందరు విమర్శించిన సంగతి తెలిసిందే. 


logo