శనివారం 04 ఏప్రిల్ 2020
Sports - Mar 08, 2020 , 00:33:20

అలసిన పరుగుల శిఖరం

అలసిన పరుగుల శిఖరం
  • క్రికెట్‌కు వసీం జాఫర్‌ వీడ్కోలు

ముంబై: రంజీ రారాజు, దేశవాళీ దిగ్గజం వసీం జాఫర్‌ ఆటకు వీడ్కోలు పలికాడు. దాదాపు 25 ఏండ్ల క్రికెట్‌ కెరీర్‌లో 26 వేలకు పైగా పరుగులతో ఎన్నో రికార్డులు నెలకొల్పాక 42 ఏండ్ల వయసులో విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. క్రికెట్‌లో అన్ని ఫార్మాట్ల నుంచి రిటైరవుతున్నట్టు జాఫర్‌ శనివారం ప్రకటించాడు. 1996/97 రంజీ సీజన్‌తో అరంగేట్రం చేసిన జాఫర్‌.. రంజీట్రోఫీ చరిత్రలో 12 వేల పరుగుల మైలురాయిని దాటిన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించడంతో పాటు ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో అత్యధిక పరుగుల ఘనతను సొంతం చేసుకున్నాడు.  రంజీట్రోఫీ, ఇరానీ ట్రోఫీ చరిత్రలో అత్యధిక పరుగులు, ఫస్ట్‌క్లాస్‌లో అత్యధిక సెంచరీల రికార్డు ఈ ముంబైకర్‌ పేరిటే ఉంది. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో ఆడిన రెండో మ్యాచ్‌లోనే జాఫర్‌ త్రిశతకాన్ని నమో దు చేయడం విశేషం.  


అంతర్జాతీయ స్థాయి లో 31 టెస్టులు ఆడి రెండు ద్విశతకాలు (వెస్టిండీస్‌. పాకిస్థాన్‌పై) సహా 1,994 పరుగులు చేశాడు. 2000 సంవత్సరం ఫిబ్రవరి 24న దక్షిణాఫ్రికాతో ముంబై టెస్టుతో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన జాఫర్‌.. 2008లో సఫారీలతోనే కాన్పూర్‌లో చివరగా టెస్టు ఆడాడు.  ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో 19 ఏండ్ల పాటు ముంబై తరఫున ఆడాడు. 2015లో విదర్భకు మారిన జాఫర్‌.. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆడిన చివరి మ్యాచ్‌లోనూ అర్ధశతకంతో రాణించాడు. 


logo