గురువారం 02 ఏప్రిల్ 2020
Sports - Feb 13, 2020 , 00:33:19

నిలిచిన ప్రతీక్‌

నిలిచిన ప్రతీక్‌
  • హైదరాబాద్‌ 239/7 - రంజీ ట్రోఫీ

హైదరాబాద్‌: రంజీ అరంగేట్ర మ్యాచ్‌లోనే హైదరాబాద్‌ యువ కెరటం ప్రతీక్‌ రెడ్డి(156బంతుల్లో 76నాటౌట్‌) అజేయ అర్ధశతకంతో అదరగొట్టాడు. దీంతో రంజీట్రోఫీ ఎలైట్‌ గ్రూప్‌-ఏలో భాగంగా బుధవారం ఇక్కడి ఉప్పల్‌ స్టేడియంలో విదర్భతో ప్రారంభమైన మ్యాచ్‌లో హైదరాబాద్‌ మంచి స్కోరు సాధించింది. ప్రతీక్‌ సహా రాహుల్‌ బుద్ధి(52) కూడా అర్ధశతకంతో రాణించడంతో ఏడు వికెట్లకు 239 స్కోరు వద్ద హైదరాబాద్‌ తొలిరోజు ఆటను ముగించింది. క్రీజులో ప్రతీక్‌తో పాటు మెహదీ హసన్‌(115బంతుల్లో 27నాటౌట్‌) ఉన్నాడు. టాస్‌ ఓడి బ్యాటింగ్‌ దిగిన హైదరాబాద్‌కు శుభారంభం దక్కలేదు. కెప్టెన్‌ తన్మయ్‌ అగర్వాల్‌(5), అక్షత్‌ రెడ్డి(6) త్వరగా ఔటయ్యారు. ఆ తర్వాత రాహుల్‌ బుద్ధి, టి రవితేజ(44) నిలకడగా ఆడి 80పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. రవితేజ ఔటైనా అరంగేట్ర ఆటగాడు ప్రతీక్‌ అదరగొట్టాడు. అర్ధ శతకం తర్వాత రాహుల్‌ బుద్ధి ఔట్‌ కాగా..  సుమంత్‌(1), మిలింద్‌(4), అనికేత్‌ రెడ్డి(4) విఫలమవడంతో 151 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి హైదరాబాద్‌ కష్టాల్లో పడింది. మరో ఎండ్‌లో ఒంటరి పోరాటం చేస్తున్న ప్రతీక్‌కు మెహదీ హసన్‌ తోడుగా నిలిచాడు. విదర్భ బౌలర్లలో యశ్‌ ఠాకూర్‌ నాలుగు, గుర్బానీ మూడు వికెట్లతో రాణించారు. 


మరో ద్విశతకం దిశగా సర్ఫరాజ్‌..  

ఈ రంజీ సీజన్‌లో ముంబై ఆటగాడు సర్ఫరాజ్‌ ఖాన్‌ భీకర ఫామ్‌లో కొనసాగుతున్నాడు. ఇప్పటికే ఓ త్రిశకతం, ద్విశతకం బాదిన అతడు మరో భారీ శతకంతో అజేయంగా నిలిచాడు. మధ్యప్రదేశ్‌తో బుధవారం ప్రారంభమైన మ్యాచ్‌లో ముంబై ప్లేయర్‌ సర్ఫరాజ్‌(204 బంతుల్లో 169నాటౌట్‌) దూకుడుగా ఆడి మరో ద్విశతకం దిశగా దూసుకెళుతున్నాడు. దీంతో  తొలి రోజే ముంబై 4వికెట్లకు 352పరుగుల భారీ స్కోరు సాధించింది. 
logo