బుధవారం 08 ఏప్రిల్ 2020
Sports - Jan 12, 2020 , 02:08:54

రంజీ ఫీజు పెంచాల్సిందే

రంజీ ఫీజు పెంచాల్సిందే

న్యూఢిల్లీ: దేశవాళీ ప్రతిష్ఠాత్మక టోర్నీ రంజీ ట్రోఫీలో పాల్గొనే ఆటగాళ్ల మ్యాచ్‌ ఫీజులు పెంచకపోతే.. ఐపీఎల్‌ వెలుగులో రంజీ ప్రభ మసకబారిపోతుందని క్రికెట్‌ దిగ్గజం సునీల్‌ గవాస్కర్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. సుదీర్ఘ చరిత్ర ఉన్న దేశవాళీ టోర్నీలో పాల్గొనే ప్లేయర్లకు ప్రస్తుతం ఒక్కో మ్యాచ్‌కు రూ. 2.5 లక్షలు అందుతున్నాయి. ఐపీఎల్‌ మ్యాచ్‌లతో పోల్చుకుంటే ఇది చాలా స్వల్పం. అందుకే వీలైనంత త్వరగా దేశవాళీ మ్యాచ్‌ ఫీజు పెంచాల్సిన అవసరం ఉందని.. లేకపోతే రంజీ ట్రోఫీ.. ఐపీఎల్‌కు పేద బంధువులా మిగిలిపోతుందని సన్నీ అభిప్రాయపడ్డాడు. ‘రంజీ ట్రోఫీపై ఐపీఎల్‌ ఆధిపత్యం చెలాయిస్తున్నది. దేశవాళీ ఆటగాళ్ల మ్యాచ్‌ ఫీజులు పెంచకపోతే.. అది భారత క్రికెట్‌ పేద సోదరిగా మిగిలిపోతుంది’ అని గవాస్కర్‌ అన్నాడు.

ఇంతకాలం విశ్రాంతా..

క్రికెట్‌ నుంచి మాజీ కెప్టెన్‌ ధోనీ సుదీర్ఘ విశ్రాంతి తీసుకోవడంపైనా గవాస్కర్‌ మాట్లాడాడు. ఇంత సుదీర్ఘ కాలం స్వయంగా జాతీయ జట్టుకు ఎవరైనా దూరంగా ఉన్నారా అని ప్రశ్నించాడు. ‘ఒకవేళ టీ20 ప్రపంచకప్‌ జట్టులో ఉండాలనుకుంటే అతడి(ధోనీ) ఫిట్‌నెస్‌ గురించి ఎవరేం చెప్పలేరు. ఆ విషయాన్ని ధోనీ తనకు తాను ప్రశ్నించుకోవాలి. గతేడాది జూలై నుంచి అతడు క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. కావాలని జాతీయ జట్టుకు ఇంత కాలం ఎవరైనా దూరమయ్యారా? ఇప్పుడిదే ప్రశ్న ఉత్పన్నమవుతున్నది’ అని గవాస్కర్‌ చెప్పాడు.


logo