వేలంలో కోట్లు కొల్లగొట్టిన క్రిస్ మోరిస్.. తన ధరకు న్యాయం చేస్తూ భారీ సిక్సర్లతో విజృంభించడంతో రాజస్థాన్ రాయల్స్ బోణీ కొట్టింది. టాపార్డర్ ఘోర వైఫల్యం అనంతరం మిల్లర్ పోరాటంతో కోలుకున్న రాయల్స్.. మోరిస్ మెరుపులతో పాయింట్ల పట్టికలో ఖాతా తెరిచింది. సహచరులు విఫలమైన చోట కెప్టెన్ రిషబ్ పంత్ ఒక్కడు పోరాడినా.. ఓ మోస్తరు స్కోరు చేసిన ఢిల్లీ.. మ్యాచ్‌లో అధికభాగం ఆధిక్యంలో ఉండి కూడాఓటమిని తప్పించుకోలేకపోయింది.
ముంబై: తొలి పోరులో భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చివరి బంతికి ఓటమి పాలైన రాజస్థాన్ రాయల్స్.. ఈ సారి టాపార్డర్ విఫలమైనా మోరిస్ (18 బంతుల్లో 36 నాటౌట్; 4 సిక్సర్లు), మిల్లర్ (43 బంతుల్లో 62; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపులు మెరిపించడంతో తొలి విజయం నమోదు చేసుకుంది. గురువారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 20 ఓవర్లలో 8 వికెట్లకు 147 పరుగులు చేసింది. కెప్టెన్ రిషబ్ పంత్ (32 బంతుల్లో 51; 9 ఫోర్లు) ఒంటరి పోరాటం చేశాడు. రాజస్థాన్ బౌలర్లలో జైదేవ్ ఉనాద్కత్ 3, ముస్తఫిజుర్ రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో రాయల్స్ 19.4 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లలో అవేశ్ ఖాన్ 3, వోక్స్, రబడ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఉనాద్కత్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
పంత్ పోరాటం..
గత మ్యాచ్‌లో దంచికొట్టిన ఓపెనర్లు తాజా పోరులో విఫలమవడంతో ఢిల్లీకి శుభారంభం దక్కలేదు. పృథ్వీ షా (2), శిఖర్ ధవన్ (9), అజింక్యా రహానే (8)లను ఉనాద్కత్ వరుస ఓవర్లలో ఔట్ చేశాడు. కాసేపటికే మార్కస్ స్టొయినిస్ (0) కూడా వెనుదిరగడంతో ఢిల్లీ 37/4తో పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆరంభంలోనే కీలక వికెట్లు కోల్పోయినా ఏ మాత్రం వెనక్కితగ్గని కెప్టెన్ పంత్.. తనదైన శైలిలో రెచ్చిపోయాడు. సాధారణంగా లెగ్‌సైడ్ ఎక్కువ పరుగులు రాబట్టే పంత్.. అందుకు భిన్నంగా ఆఫ్‌స్టంప్‌పై చూడ చక్కని బౌండ్రీలు బాదాడు. తెవాటియా వేసిన 11వ ఓవర్లో నాలుగు ఫోర్లతో పాటు మొత్తం 20 పరుగులు పిండుకున్నాడు. ఈ క్రమంలో మరో చక్కటి బౌండ్రీతో 30 బంతుల్లో హాఫ్‌సెంచరీ పూర్తి చేసుకున్న పంత్.. రియాన్ పరాగ్ విసిరిన సూపర్ త్రోకు రనౌటయ్యాడు. ఇక అక్కడి నుంచి రాయల్స్ బౌలర్లు పట్టుబిగించగా.. లలిత్ యాదవ్ (20), టామ్ కరన్ (21), వోక్స్ (15 నాటౌట్) తలా కొన్ని పరుగులు చేసి ఢిల్లీకి పోరాడే స్కోరు అందించారు. క్యాపిటల్స్ ఇన్నింగ్స్‌లో ఒక్క సిక్సర్ కూడా నమోదు కాకపోవడం కొసమెరుపు.
ఒకరి వెంట ఒకరు..
ఛేదనలో రాజస్థాన్ ఆరంభం నుంచే తడబడింది. టాపార్డర్‌లో ఒక్కరు కూడా రెండంకెల స్కోరు చేయలేకపోవడంతో రాయల్స్‌కు మంచి ఆరంభం దక్కలేదు. మనన్ వోహ్రా (9)తో ప్రారంభమైన వికెట్ల పతనం ఆఖరి వరకు అలాగే కొనసాగింది. బట్లర్ (2) ఏమాత్రం ప్రభావం చూపలేకపోగా.. గత మ్యాచ్‌లో సూపర్ సెంచరీతో అదరగొట్టిన కెప్టెన్ శాంసన్ (4) ఫామ్ కొనసాగించలేకపోయాడు. శివం దూబే (2), రియాన్ పరాగ్ (2) ఇలా వచ్చి అలా వెళ్లారు. గాయం కారణంగా ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ ఈ సీజన్‌కు దూరమవడంతో రాయల్స్ అవకాశాలను దెబ్బతీసింది. స్టొయినిస్ ఓవర్లో హ్యాట్రిక్ ఫోర్లు కొట్టిన డేవిడ్ మిల్లర్ అర్ధశతకం అనంతరం రెండు భారీ సిక్సర్లు బాది ఔట్ కాగా.. రాహుల్ తెవాటియా (19) భారీ షాట్లు ఆడలేకపోయాడు.
మోరిస్ మెరుపులు
16 ఓవర్లు ముగిసే సరికి రాజస్థాన్ 105/7తో నిలిచింది. రాయల్స్ విజయానికి 24 బంతుల్లో 43 పరుగులు అవసరమవగా.. వోక్స్ బౌలింగ్‌లో ఉనాద్కత్ (11 నాటౌట్) సిక్సర్ కొట్టాడు. 18వ ఓవర్లో టామ్ కరన్ 7 పరుగులే ఇవ్వడంతో సమీకరణం 12 బంతుల్లో 27కు చేరింది. తదుపరి ఓవర్ మొత్తం స్ట్రయిక్ తనవద్దే ఉంచుకున్న మోరిస్ రెండు భారీ సిక్సర్లు సహా 15 పరుగులు రాబట్టగా.. ఆఖరి ఓవర్లో మరో రెండు సిక్సర్లు అరుసుకొని.. రెండు బంతులు మిగిలుండగానే జట్టుకు విజయాన్నందించాడు.
స్కోరు బోర్డు
ఢిల్లీ: పృథ్వీ షా (సి) మిల్లర్ (బి) ఉనాద్కట్ 2, ధవన్ (సి) శాంసన్ (బి) ఉనాద్కట్ 9, రహానే (సి అండ్ బి) ఉనాద్కట్ 8, పంత్ (రనౌట్/పరాగ్) 51, స్టొయినిస్ (సి) బట్లర్ (బి) ముస్తఫిజుర్ 0, లలిత్ (సి) తెవాటియా (బి) మోరిస్ 20, టామ్ కరన్ (బి) ముస్తఫిజుర్ 21, వోక్స్ (నాటౌట్) 15, అశ్విన్ (రనౌట్) 7, రబడ (నాటౌట్) 9, ఎక్స్‌ట్రాలు: 5, మొత్తం: 147/8. వికెట్ల పతనం: 1-5, 2-16, 3-36, 4-37, 5-88, 6-100, 7-128, 8-136, బౌలింగ్: చేతన్ 4-0-33-0, ఉనాద్కట్ 4-0-15-3, మోరిస్ 3-0-27-1, ముస్తఫిజుర్ 4-0-29-2, పరాగ్ 2-0-16-0, తెవాటియా 3-0-27-0.
రాజస్థాన్: బట్లర్ (సి) పంత్ (బి) వోక్స్ 2, వోహ్రా (సి) రబడ (బి) వోక్స్ 9, శాంసన్ (సి) ధవన్ (బి) రబడ 4, దూబే (సి) ధవన్ (బి) అవేశ్ 2, మిల్లర్ (సి) లలిత్ (బి) అవేశ్ 62, పరాగ్ (సి) ధవన్ (బి) అవేశ్ 2, తెవాటియా (సి) లలిత్ (బి) రబడ 19, మోరిస్ (నాటౌట్) 36, ఉనాద్కట్ (నాటౌట్) 11, ఎక్స్‌ట్రాలు: 3, మొత్తం: 19.4 ఓవర్లలో 150/7. వికెట్ల పతనం: 1-13, 2-13, 3-17, 4-36, 5-42, 6-90, 7- 104, బౌలింగ్: వోక్స్ 4-0-22-2, అవేశ్ 4-0-32-3, రబడ 4-0-30-2, అశ్విన్ 3-0-14-0, టామ్ కరన్ 3.4-0-35-0, స్టొయినిస్ 1-0-15-0.