గురువారం 03 డిసెంబర్ 2020
Sports - Sep 23, 2020 , 03:33:26

రాయల్స్‌ రంబోలా

రాయల్స్‌ రంబోలా

  • చెన్నైపై రాజస్థాన్‌ విజయం
  • శాంసన్‌, స్మిత్‌ విజృంభణ.. 

ఐపీఎల్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌కు అదిరిపోయే ఆరంభం దక్కింది. ఏండ్లుగా ఊరిస్తూ వస్తున్న టైటిల్‌ను ఈసారి ఎలాగైనా ఒడిసిపట్టుకోవాలన్న కసితో కనిపిస్తున్న రాయల్స్‌..మాజీ చాంపియన్‌ చెన్నై సూపర్‌కింగ్స్‌ (సీఎస్‌కే)ను ఆటాడుకుంది. కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ నిలకడైన ఇన్నింగ్స్‌కు తోడు సంజూ శాంసన్‌ నాటు కొట్టుడుతో షార్జా స్టేడియం హోరెత్తిపోయింది. చెన్నై బౌలర్లను ఉతికి ఆరేస్తూ బౌండరీలతో దుమ్మురేపారు. శాంసన్‌ సిక్సర్ల జోరుకు ధోనీసేన దిమ్మతిరిగింది. వరుస విరామాల్లో వికెట్లు పడ్డా..ఆఖర్లో ఎంగ్డీని లక్ష్యంగా చేసుకుంటూ ఆర్చర్‌ భారీ సిక్సర్లతో చెలరేగడంతో రాయల్స్‌ 200 మార్క్‌ అందుకుంది. లక్ష్యఛేదనలో సహచరులు విఫలమైన చోట డుప్లెసిస్‌ ఒంటరి పోరాటం చేసినా తేవటియా స్పిన్‌ మ్యాజిక్‌తో సీఎస్‌కే ఓటమి వైపు నిలిచింది. 

షార్జా: సీజన్‌ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌పై గెలిచి బోణీ కొట్టిన ధోనీ సేనకు రెండో మ్యాచ్‌లో షాక్‌ తగిలింది. బ్యాట్స్‌మెన్‌ సూపర్‌ ఇన్నింగ్స్‌లకు బౌలర్ల కృషి తోడవడంతో మంగళవారం షార్జా క్రికెట్‌ స్టేడియంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. సంజూ శాంసన్‌ (32 బంతుల్లో 74; 1 ఫోర్‌, 9 సిక్సర్లు), స్టీవ్‌ స్మిత్‌ (47 బంతుల్లో 69; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు అర్ధశతకాలకు ఆర్చర్‌ (8 బంతుల్లో 27 నాటౌట్‌; 4 సిక్సర్లు) తుఫాన్‌ ఇన్నింగ్స్‌ తోడవడంతో రాజస్థాన్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 216 పరుగులు చేసింది. చెన్నై బౌలర్లలో సామ్‌  కరన్‌కు 3 వికెట్లు దక్కాయి. అనంతరం లక్ష్యఛేదనలో చెన్నై 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. సీజన్‌ తొలి మ్యాచ్‌లో దంచికొట్టిన తెలుగు ఆటగాడు అంబటి రాయుడు గైర్హాజరీలో సూపర్‌ కింగ్స్‌ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. డుప్లెసిస్‌ (37 బంతుల్లో 72; 1 ఫోర్‌, 7 సిక్సర్లు) ఒక్కడే ధాటిగా ఆడాడు. రాజస్థాన్‌ బౌలర్లలో తేవటియా 3 వికెట్లు పడగొట్టాడు. శాంసన్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌' అవార్డు దక్కింది. 

దంచికొట్టిన శాంసన్‌..

టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌ చేసిన రాజస్థాన్‌కు శుభారంభం దక్కలేదు. ఎన్నో అంచనాల మధ్య ఐపీఎల్‌లో తొలి మ్యాచ్‌ ఆడిన అండర్‌-19 హీరో యశస్వి జైస్వాల్‌ (6) మూడో ఓవర్‌లో వెనుదిరిగాడు. అయితే ఆ ఆనందం చెన్నైకి ఎక్కువసేపు నిలువలేదు. స్మిత్‌తో జత కలిసిన శాంసన్‌ క్రీజులో అడుగుపెట్టడంతోనే దడదడలాడించాడు. ఈ జోడీ ఓవర్‌కు రెండు బౌండ్రీల చొప్పున బాదడంతో రన్‌రెట్‌ బుల్లెట్‌ ట్రైన్‌లా దూసుకెళ్లింది. స్మిత్‌ బౌండ్రీలపై దృష్టిపెడితే.. శాంసన్‌ మాత్రం కేవలం సిక్సర్లే లక్ష్యంగా విరుచుకుపడ్డాడు. చావ్లా వేసిన ఇన్నింగ్స్‌ ఎనిమిదో ఓవర్‌లో శాంసన్‌ మూడు సిక్సర్లు స్మిత్‌ ఓ సిక్సర్‌ అరుసుకోవడంతో 28 పరుగులు వచ్చాయి. 10 ఓవర్లు ముగిసేసరికి రాయల్స్‌ వికెట్‌ నష్టానికి 119 పరుగులు చేయడంతో భారీ స్కోరుకు బాటలు పడ్డాయి. ఈ క్రమంలో శాంసన్‌ 19 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్‌లో అతడికిదే వేగవంతమైన ఫిఫ్టీ. రెండో వికెట్‌కు 121 పరుగుల జోడించాక శాంసన్‌ ఔటయ్యాడు. మిల్లర్‌ (0) అనూహ్యంగా రనౌట్‌ కాగా.. రాయల్స్‌కు ఆడుతున్న తొలి మ్యాచ్‌లో ఊతప్ప (5) నిరాశ పరిచాడు. తేవటియా (10), పరాగ్‌ (6) ఓకే ఓవర్లో ఔట్‌ కావడంతో పాటు స్మిత్‌ కూడా వెనుదిరగడంతో రాయల్స్‌ స్కోరు 200 దాటడం కష్టమే అనిపించింది. అయితే చివరి ఓవర్‌లో ఆర్చర్‌ అదరగొట్టడంతో రాజస్థాన్‌ భారీ స్కోరు చేసింది. ఇన్నింగ్స్‌ ఆఖరి ఓవర్‌లో ఎంగ్డీ రెండు నోబల్స్‌, ఒక వైడ్‌ సహా మొత్తం ఆరు బంతులు విసరగా.. ఆర్చర్‌ నాలుగు సిక్సర్లు బాది 30 పరుగులు పిండుకున్నాడు. 

తిప్పేసిన తేవటియా..

భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు దిగిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ను తేవటియా తిప్పేశాడు. అంతుచిక్కని లెగ్‌స్పిన్‌తో ధోనీ సేనను ముప్పుతిప్పలు పెట్టాడు. సీజన్‌ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌పై విజయం సాధించి బోణీ కొట్టిన చెన్నైకి ఈ మ్యాచ్‌లోనూ శుభారంభం దక్కింది. మురళీ విజయ్‌ (21), వాట్సన్‌ (33) తొలి వికెట్‌కు 56 పరుగులు జతచేసి మంచి పునాది వేశారు. అయితే ఆ తర్వాత వీరిద్దరితో పాటు తేవటియా వేసిన 9 ఓవర్‌లోసామ్‌ కరన్‌ (17), గైక్వాడ్‌ (0) వెంటవెంటనే ఔటయ్యారు.  వరుసగా వికెట్లు కోల్పోతున్నా డుప్లెసిస్‌, ధోనీ (29) క్రీజులో ఉండటంతో ఏ మూలో ఆశలు రేగినా.. సాధించాల్సిన రన్‌రేట్‌ పెరిగిపోవడంతో చెన్నైకి ఓటమి తప్పలేదు. ఆఖరి ఓవర్‌లో ధోనీ హ్యాట్రిక్‌ సిక్సర్లు బాదినా అప్పటికే ఆలస్యమైపోయింది.

మిస్టర్‌ కూల్‌ ఫైరైన వేళ..

చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ మరోసారి ఆగ్రహించాడు. గతేడాది రాజస్థాన్‌తో మ్యాచ్‌లో ఔటైన అనంతరం తిరిగి గ్రౌండ్‌లోకి వచ్చి అంపైర్‌తో వాదించిన మహీ.. తాజా మ్యాచ్‌లో అంపైర్‌ తన నిర్ణయాన్ని మార్చుకోవడాన్ని తప్పుబట్టాడు. రాజస్థాన్‌ ఇన్నింగ్స్‌ 18వ ఓవర్‌లో దీపక్‌ చాహర్‌ వేసిన బంతికి టామ్‌ కరన్‌ ఔటయ్యాడు. అయితే బంతి బ్యాట్‌కు తగలకపోవడంతో పాటు ధోనీ కూడా ఆ బంతిని నేలకు తాకిన తర్వాతే అందుకున్నాడు. ఇది గమనించని అంపైర్‌ శంషొద్దీన్‌ ముందు ఔట్‌ అని ప్రకటించాడు. ఆ తర్వాత స్కేర్‌ లెగ్‌ అంపైర్‌ వినీత్‌ కులకర్ణితో చర్చించి టీవీ అంపైర్‌ సాయంతో నాటౌట్‌ అని తేల్చాడు. దీంతో ధోనీ గుస్సా అయ్యాడు. నిర్ణయాన్ని మార్చుకోవడంతో కాస్త అసహనానికి గురైన మహీ.. అంపైర్‌తో ఈ అంశంపై చర్చిస్తూ కనిపించాడు. 

రాజస్థాన్‌: జైస్వాల్‌ (సి అండ్‌ బి) చాహర్‌ 6, స్మిత్‌ (సి) జాదవ్‌ (బి) కరన్‌ 69, శాంసన్‌ (సి) చాహర్‌ (బి) ఎంగ్డీ 74, మిల్లర్‌ (రనౌట్‌) 0, ఊతప్ప (సి) డుప్లెసిస్‌ (బి) చావ్లా 5, తేవటియా (ఎల్బీ) కరన్‌ 10, పరాగ్‌ (సి) ధోనీ (బి) కరన్‌ 6, టామ్‌ కరన్‌ (నాటౌట్‌) 10, ఆర్చర్‌ (నాటౌట్‌) 27, ఎక్స్‌ట్రాలు: 9, మొత్తం: 20 ఓవర్లలో 216/7. వికెట్ల పతనం: 1-11, 2-132, 3-134, 4-149, 5-167, 6-173, 7-178, బౌలింగ్‌: చాహర్‌ 4-0-31-1, కరన్‌ 4-0-33-3, ఎంగ్డీ 4-0-56-1, జడేజా 4-0-40-0, చావ్లా 4-0-55-1.

చెన్నై: విజయ్‌ (సి) టామ్‌ కరన్‌ (బి) గోపాల్‌ 21, వాట్సన్‌ (బి) తేవటియా 33, డుప్లెసిస్‌ (సి) శాంసన్‌ (బి) ఆర్చర్‌ 72, కరన్‌ (స్టంప్డ్‌) శాంసన్‌ (బి) తేవటియా 17, గైక్వాడ్‌ (స్టంప్డ్‌) శాంసన్‌ (బి) తేవటియా 0, జాదవ్‌ (సి) శాంసన్‌ (బి) టామ్‌ కరన్‌ 22, ధోనీ (నాటౌట్‌) 29, జడేజా (నాటౌట్‌) 1, ఎక్స్‌ట్రాలు: 5, మొత్తం: 20 ఓవర్లలో 200/6. వికెట్ల పతనం: 1-56, 2-58, 3-77, 4-77, 5-114, 6-179, బౌలింగ్‌: ఉనాద్కట్‌ 4-0-44-0, ఆర్చర్‌ 4-0-26-1, గోపాల్‌ 4-0-38-1, టామ్‌ కరన్‌ 4-0-54-1, తేవటియా 4-0-37-3.