గురువారం 03 డిసెంబర్ 2020
Sports - Oct 31, 2020 , 02:14:51

పంజాబ్‌ వరుస విజయాల జైత్రయాత్రకు బ్రేక్

పంజాబ్‌ వరుస విజయాల జైత్రయాత్రకు బ్రేక్

  • కింగ్స్‌ ఎలెవన్‌పై రాజస్థాన్‌ గెలుపు.. గేల్‌ శ్రమ వృథా
  • టీ20ల్లో వెయ్యి సిక్సర్‌లు బాదిన తొలి ఆటగాడిగా గేల్‌ చరిత్రకెక్కాడు. పొలార్డ్‌ (690) రెండో స్థానంలో ఉన్నాడు.
  • ఐపీఎల్‌లో 99 పరుగుల వద్ద ఔట్‌కావడం గేల్‌కిది రెండోసారి. 

ఆశలు లేని స్థితి నుంచి వరుస విజయాలతో ప్లే ఆఫ్స్‌కు చేరువైన పంజాబ్‌కు రాజస్థాన్‌ చుక్కలు చూపించింది. భారీ లక్ష్యం ముందున్నా ఏమాత్రం వెరవకుండా.. స్టోక్స్‌, శాంసన్‌ వీరబాదుడు బాదడంతో.. స్మిత్‌ సేన సునాయాస విజయాన్నందుకుంది. డబుల్‌ హ్యాట్రిక్‌ నమోదు చేయాలనుకున్న పంజాబ్‌ ఓటమి వైపు నిలిస్తే.. ఈ విజయంతో రాజస్థాన్‌ పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి ఎగబాకింది.

అబుదాబి: పంజాబ్‌ వరుస విజయాల జైత్రయాత్రకు రాజస్థాన్‌ బ్రేక్‌ వేసింది. ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టిన రాజస్థాన్‌ రాయల్స్‌ శుక్రవారం కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌పై 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ నిర్ణీత 20 ఓవర్లలో4 వికెట్లకు 185 పరుగులు చేసింది. యూనివర్సల్‌ బాస్‌ క్రిస్‌ గేల్‌ (63 బంతుల్లో 99; 6 ఫోర్లు, 8 సిక్సర్లు) తృటిలో సెంచరీ కోల్పోగా.. కెప్టెన్‌ లోకేశ్‌ రాహుల్‌ (41 బంతుల్లో 46; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు. రాజస్థాన్‌ బౌలర్లలో ఆర్చర్‌, స్టోక్స్‌ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో రాజస్థాన్‌ 17.3 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌' బెన్‌ స్టోక్స్‌ (26 బంతుల్లో 50; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), సంజూ శాంసన్‌ (25 బంతుల్లో 48; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) విజృంభించారు. 

ఒకరిని మించి ఒకరు..

టార్గెట్‌ ఛేజింగ్‌లో బెన్‌ స్టోక్స్‌ పూనకం వచ్చినట్లు చెలరేగిపోవడంతో రాజ స్థాన్‌కు అద్భుత ఆరంభం లభించింది. స్టోక్స్‌ ధాటికి రాయల్స్‌ 4.2 ఓవర్లలోనే 50 పరుగుల మైలురాయిని దాటింది. ఎడాపెడా బౌండ్రీలు బాదుతూ పంజాబ్‌ను భయపెట్టిన స్టోక్స్‌ 26 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్నాక ఔటయ్యాడు. అప్పటి వరకు ప్రేక్షకపాత్రకు పరిమితమైన ఊతప్ప (30), శాంసన్‌ కూడా ధాటిగా ఆడటంతో 10 ఓవర్లు ముగిసేసరికి రాజస్థాన్‌ 103/1తో నిలిచింది. కాసేపటికి శాంసన్‌ రనౌట్‌ కాగా.. స్మిత్‌ (20 బంతుల్లో 31 నాటౌట్‌; 5 ఫోర్లు), బట్లర్‌ (11 బంతుల్లో 22 నాటౌట్‌; ఒక ఫోర్‌, 2 సిక్సర్లు) భారీ షాట్లతో విజృంభించి మరో 15 బంతులు మిగిలుండగానే మ్యాచ్‌ను ముగించారు.

గేల్‌ సిక్సర్ల షో..

టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌కు మంచి ఆరంభం లభించలేదు. మన్‌దీప్‌ సింగ్‌ (0) గోల్డెన్‌ డకౌటయ్యాడు. ఆర్చర్‌ బౌన్సర్‌ను ఎదుర్కొనేందుకు ఇబ్బందిపడ్డ మన్‌దీప్‌.. స్టోక్స్‌ పట్టిన సూపర్‌ క్యాచ్‌కు డగౌట్‌ బాటపట్టాడు. దీంతో క్రీజులోకి వచ్చిన గేల్‌ ఆరంభం నుంచే దూకుడుగా ఆడాడు. కార్తీక్‌ త్యా గి వేసిన ఐదో ఓవర్‌లో క్రిస్‌ గేల్‌ వరు సగా 4,6,4 కొడితే.. మరుసటి ఓవర్‌లో లోకేశ్‌ రాహుల్‌ 6,4 అరుసుకున్నాడు. ఫలితంగా పవర్‌ప్లే ముగిసేసరికి పంజాబ్‌ 53/1తో నిలిచింది. అరోన్‌ వేసిన నాలుగో ఓవర్‌లో గేల్‌ ఇచ్చిన ఒకింత కష్టతరమైన క్యాచ్‌ను బౌండ్రీ లైన్‌ వద్ద పరాగ్‌ వదిలేశాడు. ఈ దశలో రాజస్థాన్‌ బౌలర్లు చక్కటి బంతులతో ఆకట్టుకున్నా.. గేల్‌ అడపాదడపా భారీ షాట్లు ఆడుతూ రన్‌రేట్‌ పడిపోకుండా చూసుకున్నాడు. రెండో వికెట్‌కు 120 పరుగులు జోడించాక రాహుల్‌ ఔటైనా.. గేల్‌ మాత్రం తన జోరు తగ్గించలేదు. మరో ఎండ్‌లో పూరన్‌ (22) కూడా మూడు సిక్సర్లు కొట్టడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. మ్యాక్స్‌వెల్‌ (6) టచ్‌ దొరక్క ఇబ్బంది పడగా.. భారీ షాట్లతో గేల్‌ సెంచరీకి చేరువయ్యాడు. ఆర్చర్‌ వేసిన చివరి ఓవర్‌ మూడో బంతికి సిక్సర్‌ బాది 99కి చేరుకున్న గేల్‌.. నాలుగో బంతికి ఔటయ్యాడు. దీంతో అసహనంగా బ్యాట్‌ను నేలకేసి కొట్టిన బాస్‌.. ఆ తర్వాత ఆర్చర్‌కు షేక్‌ హ్యాండ్‌ ఇచ్చి బ్యాట్‌ హ్యాండిల్‌పై హెల్మెట్‌ను పెట్టుకొని హుందాగా బయటకు నడిచాడు. 

స్కోరు బోర్డు

పంజాబ్‌: రాహుల్‌ (సి) తెవాటియా (బి) స్టోక్స్‌ 46, మన్‌దీప్‌ (సి) స్టోక్స్‌ (బి) ఆర్చర్‌ 0, గేల్‌ (బ) ఆర్చర్‌ 99, పూరన్‌ (సి) తెవాటియా (బి) స్టోక్స్‌ 22, మ్యాక్స్‌వెల్‌ (నాటౌట్‌) 6, హుడా (నాటౌట్‌) 1, ఎక్స్‌ట్రాలు: 11, మొత్తం: 20 ఓవర్లలో 185/4. వికెట్ల పతనం: 1-1, 2-121, 3-162, 4-184, బౌలింగ్‌: ఆర్చర్‌ 4-0-26-2, అరోన్‌ 4-0-47-0, త్యాగి 4-0-47-0, గోపాల్‌ 1-0-10-0, స్టోక్స్‌ 4-0-32-2, తెవాటియా 3-0-22-0. 

రాజస్థాన్‌: ఊతప్ప (సి) పూరన్‌ (బి) మురుగన్‌ 30, స్టోక్స్‌ (సి) హుడా (బి) జోర్డాన్‌ 50, శాంసన్‌ (రనౌట్‌) 48, స్మిత్‌ (నాటౌట్‌) 31, బట్లర్‌ (నాటౌట్‌) 22, ఎక్స్‌ట్రాలు: 5, మొత్తం: 17.3 ఓవర్లలో 186/3. వికెట్ల పతనం: 1-60, 2-111, 3-145, బౌలింగ్‌: అర్ష్‌దీప్‌ 3-0-34-0, షమీ 3-0-36-0, మురుగన్‌ అశ్విన్‌ 4-0-43-1, జోర్డాన్‌ 3.3-0-44-1, రవి 4-0-27-0.