శనివారం 04 ఏప్రిల్ 2020
Sports - Jan 25, 2020 , 00:24:46

ఆరంభం అదుర్స్‌

ఆరంభం అదుర్స్‌

వన్డే ప్రపంచకప్‌ సెమీస్‌ ఓటమికి ప్రతీకారం తీర్చుకునే ఉద్దేశం లేదంటూనే.. భారత బ్యాట్స్‌మెన్‌ బౌండ్రీలతో విరుచుకుపడ్డారు. బ్యాటింగ్‌కు స్వర్గధామమైన పిచ్‌పై తొలుత ప్రత్యర్థి భారీ స్కోరు చేసినా.. ఆనక మనవాళ్లు సమిష్టిగా కదం తొక్కి కివీస్‌ గడ్డపై బోణీ కొట్టారు. డెత్‌ ఓవర్స్‌ స్పెషలిస్ట్‌ బుమ్రా ఆఖర్లో బ్లాక్‌క్యాప్స్‌ను కట్టడి చేస్తే.. బ్యాటింగ్‌లో రాహుల్‌, కోహ్లీ, అయ్యర్‌ చెలరేగిపోయారు. ఫలితంగా ఆరు వారాల న్యూజిలాండ్‌ పర్యటనను భారత్‌ విజయంతో ఆరంభించింది. పొట్టి ప్రపంచకప్‌నకు ముందు కుర్రాళ్లను పరీక్షించాలనుకుంటున్న టీమ్‌ఇండియాకు యువ ఆటగాళ్లు అందించిన ఈ విజయం భవిష్యత్తుపై భరోసానిస్తున్నది.

  • తొలి టీ20లో భారత్‌ ఘనవిజయం
  • మెరిసిన అయ్యర్‌, రాహుల్‌, కోహ్లీ
  • 6 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ చిత్తు
  • మున్రో, విలియమ్సన్‌, టేలర్‌ శ్రమ వృథా

ఆక్లాండ్‌: వరుస సిరీస్‌ విజయాలతో ఫుల్‌ జోష్‌లో ఉన్న టీమ్‌ఇండియా న్యూజిలాండ్‌ గడ్డపై అదరగొట్టింది. సుదీర్ఘ పర్యటనలో భాగంగా తొలి మ్యాచ్‌లో ఘనవిజయం సాధించి బోణీ చేసింది. శుక్రవారం ఇక్కడి ఈడెన్‌ పార్క్‌ మైదానంలో జరిగిన తొలి టీ20లో భారత్‌ 6 వికెట్లతో న్యూజిలాండ్‌ను చిత్తుచేసింది. అంతర్జాతీయ స్థాయిలో రెండు పెద్ద జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ జరుగడం ఇదే తొలిసారికాగా.. అందులో భారత్‌ 1-0తో ముందంజ వేసింది. టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 203 పరుగులు చేసింది. మున్రో (42 బంతుల్లో 59; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), కెప్టెన్‌ విలియమ్సన్‌ (26 బంతుల్లో 51; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), రాస్‌ టేలర్‌ (27 బంతుల్లో 54 నాటౌట్‌; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధశతకాలతో మెరిశారు. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన భారత్‌ 19 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 204 పరుగులు చేసింది. లోకేశ్‌ రాహుల్‌ (27 బంతుల్లో 56; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), విరాట్‌ కోహ్లీ (32 బంతుల్లో 45; 3 ఫోర్లు, 1 సిక్స్‌), శ్రేయాస్‌ అయ్యర్‌ (29 బంతుల్లో 58 నాటౌట్‌; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) అదరగొట్టడంతో మరో ఓవర్‌ మిగిలుండగానే టీమ్‌ఇండియా విజయం సాధించింది. మొత్తంగా 407 పరుగులు నమోదైన ఈ మ్యాచ్‌ ఫలితంతో సంబంధం లేకుండా అభిమానులకు మస్తు మజానిచ్చింది. అయ్యర్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌' అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య రెండో టీ20 ఆదివారం జరుగనుంది.


అటు ముగ్గురు..

ఆక్లాండ్‌ పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలిస్తుండటంతో టాస్‌ గెలిచిన భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ.. మరో ఆలోచన లేకుండా లక్ష్యఛేదనకు మొగ్గుచూపాడు. దీంతో మొదట బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌ ఆరంభం నుంచి జోరు కనబర్చింది. తమకు కొట్టిన పిండైన పిచ్‌పై గప్టిల్‌ (19 బంతుల్లో 30; 4 ఫోర్లు, 1 సిక్స్‌), మున్రో పరుగుల వరద పారించారు. ఫలితంగా పవర్‌ ప్లే ముగిసేసరికి న్యూజిలాండ్‌ 68/0తో నిలిచింది. తొలి వికెట్‌కు 80 పరుగులు జోడించాక దూబే ఈ జంటను విడదీశాడు. స్లో డెలివరీని భారీ షాట్‌కు యత్నించిన గప్టిల్‌ మిడ్‌వికెట్‌లో రోహిత్‌ పట్టిన సూపర్‌ క్యాచ్‌కు వెనుదిరిగాడు. దీంతో ఇక స్కోరుకు కళ్లెం పడుతుందనుకుంటే.. విలియమ్సన్‌ తన శైలికి భిన్నంగా వచ్చీరావడంతోనే సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో నాలుగు బంతుల వ్యవధిలో మున్రోతో పాటు గ్రాండ్‌హోమ్‌ (0) ఔటయ్యారు. కేన్‌కు టేలర్‌ జతవడంతో స్కోరు రాకెట్‌ వేగాన్ని అందుకుంది. చాహల్‌ ఓవర్‌లో 4,4,4 బాది అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న విలియమ్సన్‌ కోహ్లీకి క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. కివీస్‌ బ్యాట్స్‌మెన్‌ దూకుడు చూస్తుంటే.. స్కోరు 230 దాటుతుందనిపించినా.. చివర్లో మన బౌలర్లు కివీస్‌ను కట్టడి చేశారు. 


ఇటు ముగ్గురు

భారీ లక్ష్య ఛేదనలో భారత్‌కు శుభారంభం దక్కలేదు. ఓ సిక్సర్‌తో మురిపించిన రోహిత్‌ (7)ను శాంట్నర్‌ ఔట్‌ చేశాడు. ఫామ్‌లో ఉన్న రాహుల్‌కు కెప్టెన్‌ విరాట్‌ జతవడంతో ఇన్నింగ్స్‌ సజావుగా సాగింది. వీరిద్దరూ సంయమనంతో ఆడుతూ చెత్త బంతులను బౌండ్రీలకు తరలించడంతో పవర్‌ ప్లే ముగిసే సరికి టీమ్‌ఇండియా 65/1తో నిలిచింది. కోహ్లీ కాస్త నెమ్మదిగా ఆడినా.. రాహుల్‌ మాత్రం దంచికొట్టాడు. సౌథీ ఓవర్‌లో 4,6 కొట్టిన లోకేశ్‌.. శాంట్నర్‌కు అదే శిక్ష వేశాడు. టిక్నర్‌ ఓవర్‌లో మరో భారీ సిక్సర్‌తో రాహుల్‌ హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రెండో వికెట్‌కు 99 పరుగులు జోడించాక రాహుల్‌ ఔట్‌ కాగా.. కాసేపటికే కోహ్లీ కూడా వెనుదిరిగాడు. ఈ దశలో భారత విజయంపై సందేహాలు రేకెత్తినా.. అయ్యర్‌ వాటిని పటాపంచలు చేశాడు. బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ముందొచ్చిన శివం దూబే (13; 1 ఫోర్‌, 1 సిక్స్‌) కొన్ని చక్కటి షాట్లు ఆడినా ఎక్కువ సేపు నిలువలేకపోయాడు. భారత విజయానికి 5 ఓవర్లలో 53 పరుగులు అవసరమైన దశలో.. మనీశ్‌ పాండే (14 నాటౌట్‌)తో కలిసి అయ్యర్‌ భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. బెన్నెట్‌ ఓవర్‌లో రెండు ఫోర్లు కొట్టిన అయ్యర్‌.. సౌథీ వేసిన 19వ ఓవర్లో 6,4,6తో మ్యాచ్‌ను ముగించాడు.


సూపర్‌ మ్యాన్‌ 


ఈ మ్యాచ్‌లో బ్యాట్‌తో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన రోహిత్‌ శర్మ తన సూపర్‌ ఫీల్డింగ్‌తో అదరగొట్టాడు. ఎనిమిదో ఓవర్‌లో దూబే వేసిన బంతిని గప్టిల్‌ సిక్సర్‌గా మలిచేందుకు ప్రయత్నించగా.. మిడ్‌వికెట్‌లో రోహిత్‌ కండ్లు చెదిరే క్యాచ్‌తో అతడిని ఔట్‌ చేశాడు. బౌండ్రీ దాటి వెళ్తున్న బంతిని చురుగ్గా అందుకున్న హిట్‌మ్యాన్‌ అదే సమయంలో తనను తాను నియంత్రించుకునేందుకు బంతిని మరోసారి గాల్లోకి విసిరి ఆ తర్వాత నింపాదిగా ఒడిసిపట్టాడు. ఆఖర్లో భారత బౌలర్లు చక్కటి బౌలింగ్‌ ప్రదర్శన కనబర్చారు. దీంతో మాకు మరింత భారీ స్కోరు చేసే అవకాశం చిక్కలేదు. భారత బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి పెంచడంలోనూ మేము విఫలమయ్యాం. ఈడెన్‌ పార్క్‌లో ఎంత స్కోరు చేసినా తక్కువే.. మరో 20 పరుగులు అదనంగా చేసుంటే ఫలితం వేరేలా ఉండేదేమో. తదుపరి మ్యాచ్‌లో తప్పులు దిద్దుకొని సత్తాచాటుతాం.

- రాస్‌ టేలర్‌, న్యూజిలాండ్‌ బ్యాట్స్‌మన్‌


ఈ గెలుపును ఆస్వాదిస్తున్నాం. రెండు రోజుల ముందే ఇక్కడ అడుగుపెట్టి ఇలాంటి ప్రదర్శన చేశామంటే బాగా ఆడినట్లే. ఈ విజయం మొత్తం సిరీస్‌ను నిర్దేశిస్తున్నది. ప్రేక్షకుల్లో 80 శాతం మంది మాకే మద్దతిచ్చినట్లు అనిపించింది. 200 పైచిలుకు లక్ష్యాన్ని ఛేదించేటప్పుడు ఇలాంటి మద్దతు కచ్చితంగా అవసరమే.

 - కోహ్లీ, భారత కెప్టెన్‌


స్కోరు బోర్డు

న్యూజిలాండ్‌: గప్టిల్‌ (సి) రోహిత్‌ (బి) దూబే 30, మున్రో (సి) చాహర్‌ (బి) శార్దూల్‌ 59, విలియమ్సన్‌ (సి) కోహ్లీ (బి) చాహల్‌ 51, గ్రాండ్‌హోమ్‌ (సి) దూబే (బి) జడేజా 0, టేలర్‌ (నాటౌట్‌) 54; సైఫెర్ట్‌ (సి) అయ్యర్‌ (బి) బుమ్రా 1, శాంట్నర్‌ (నాటౌట్‌) 2, ఎక్స్‌ట్రాలు: 6, మొత్తం: 20 ఓవర్లలో 203/5. వికెట్ల పతనం: 1-80, 2-116, 3-117, 4-178, 5-181, బౌలింగ్‌: బుమ్రా4-0-31-1, శార్దూల్‌ 3-0-44-1, షమీ 4-0-53-0, చాహల్‌ 4-0-32-1, దూబే 3-0-24-1, జడేజా 2-0-18-1.

భారత్‌: రోహిత్‌ (సి) టేలర్‌ (బి) శాంట్నర్‌ 7, రాహుల్‌ (సి) సౌథీ (బి) సోధి 56, కోహ్లీ (సి) గప్టిల్‌ (బి) టిక్నర్‌ 45, అయ్యర్‌ (నాటౌట్‌) 58, దూబే (సి) సౌథీ (బి) సోధి 13, పాండే (నాటౌట్‌) 14, ఎక్స్‌ట్రాలు: 11, మొత్తం: 19 ఓవర్లలో 204/4. వికెట్ల పతనం: 1-16, 2-115, 3-121, 4-142, బౌలింగ్‌: సౌథీ 4-0-48-0, శాంట్నర్‌ 4-0-50-1, బెనెట్‌ 4-0-36-0, టిక్నర్‌ 3-0-34-1, సోధి 4-0-36-2.


logo