సోమవారం 06 జూలై 2020
Sports - Jun 30, 2020 , 00:34:51

టీ20లకు ఆ ముగ్గురు ఎందుకు దూరమయ్యారంటే..

టీ20లకు ఆ ముగ్గురు ఎందుకు దూరమయ్యారంటే..

  • పొట్టి ఫార్మాట్‌ నుంచి సచిన్‌, ద్రవిడ్‌, గంగూలీ తప్పుకోవడంపై రాజ్‌పుత్‌ 

న్యూఢిల్లీ: మిస్టర్‌ డిపెండబుల్‌ రాహుల్‌ ద్రవిడ్‌ అడగడం వల్లే సచిన్‌ టెండూల్కర్‌, సౌరవ్‌ గంగూలీ 2007 టీ20 ప్రపంచకప్‌ నుంచి తప్పుకున్నారని అప్పటి టీమ్‌ఇండియా మేనేజర్‌ లాల్‌చంద్‌ రాజ్‌పుత్‌ వెల్లడించాడు. సోమవారం రాజ్‌పుత్‌ ఓ టీవీ షోలో మాట్లాడుతూ.. ‘తొలి టీ20 ప్రపంచకప్‌నకు ముందు ద్రవిడ్‌ సారథ్యంలోని టీమ్‌ఇండియా ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్నది. కొందరు ఆటగాళ్లు నేరుగా అక్కడి నుంచే దక్షిణాఫ్రికా బయలుదేరారు. ఆ సమయంలో సచిన్‌, గంగూలీలతో ద్రవిడ్‌ ఈ విషయంపై మాట్లాడాడు. యువ ఆటగాళ్లకు అవకాశమివ్వాల్సిన తరుణమిదని, అందుకే మనం ఈ ఫార్మాట్‌కు దూరంగా ఉందామని చెప్పాడు. దీనికి వాళ్లు అంగీకరించారు. అయితే ధోనీ నాయకత్వంలోని భారత జట్టు ఆడిన తొలి మెగాటోర్నీలోనే విజేతగా నిలువడంతో.. ఈ ముగ్గురు కాస్త ఫీలై ఉంటారు. ఎందుకంటే అప్పటివరకు ప్రపంచ చాంపియన్‌ అనే బిరుదు వీరిలో ఎవరికీ లేదు. ఎట్టకేలకు సచిన్‌ 2011లో తన కల నెరవేర్చుకున్నాడు’ అని రాజ్‌పుత్‌ చెప్పాడు.  

టెన్షన్‌ పడొద్దు.. పెట్టాలి

ధోనీ నాయకత్వంపై రాజ్‌పుత్‌ స్పందిస్తూ.. ‘ధోనీ జట్టు పగ్గాలు అందుకున్న సమయంలో డ్రెస్సింగ్‌ రూమ్‌  ప్రశాంతంగా ఉండేది. దాదా, ద్రవిడ్‌ల మిశ్రమంలా మహీ కనిపించేవాడు. ఎప్పుడు చూసినా ఆట గురించే ఆలోచిస్తుండేవాడు. గంగూలీ, ద్రవిడ్‌ నుంచి అతడు నాయకత్వ పాఠాలు బాగా వంటబట్టించుకున్నాడు. ఆ టోర్నీ సమయంలో మా మనసులో మెదిలిన విషయం ఒక్కటే. టెన్షన్‌ పడొద్దు.. ప్రత్యర్థిని టెన్షన్‌ పెట్టాలి. అదే విధంగా ముందుకు సాగిన జట్టు చివరికు ఫైనల్లో పాకిస్థాన్‌ను మట్టికరిపించి జగజ్జేతగా నిలిచింది’ అని రాజ్‌పుత్‌ చెప్పుకొచ్చాడు. ధోనీ నాయకత్వంలో వన్డే, టీ20 ప్రపంచకప్‌లతో పాటు చాంపియన్స్‌ ట్రోఫీని భారత జట్టు చేజిక్కించుకుంది.  


logo