శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Sports - Feb 23, 2020 , 12:53:14

భారత్‌ 144/4..39 పరుగుల వెనుకంజలో కోహ్లీసేన

భారత్‌ 144/4..39 పరుగుల వెనుకంజలో కోహ్లీసేన

రహానె(25 బ్యాటింగ్‌), హనుమ విహారి(15) క్రీజులో ఉన్నారు


వెల్లింగ్టన్‌: భారత్‌, న్యూజిలాండ్‌ మధ్య జరుగుతున్న తొలి టెస్టు మూడోరోజు ఆట ముగిసింది. ఆదివారం ఆట ఆఖరుకు టీమ్‌ఇండియా రెండో ఇన్నింగ్స్‌లో 65 ఓవర్లు ఆడి 4 వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసింది.  రహానె(25 బ్యాటింగ్‌), హనుమ విహారి(15 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు. కివీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 348 పరుగులు చేయడంతో.. భారత్‌ 39 పరుగుల వెనుకంజలో నిలిచింది.  భారత ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌(58) అర్ధశతకంతో రాణించాడు. జట్టు స్కోరు 27 వద్ద పృథ్వీ షా(14) ఆరంభంలోనే వెనుదిరిగినా, కొత్త బంతితో కివీస్‌ పేసర్లు ఇబ్బందిపెట్టినా ఒంటరి పోరాటం చేశాడు.  ఆ తర్వాత వచ్చిన టెస్టు స్పెషలిస్ట్‌ పుజారా(11), కెప్లెన్‌ విరాట్‌ కోహ్లీ(19) క్రీజులో పాతుకుపోయే ప్రయత్నం చేసినా ఎంతోసేపు నిలవలేదు. 

బౌలింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై ఆతిథ్య బ్యాట్స్‌మెన్‌ రాణించగా.. భారత బ్యాట్స్‌మెన్‌ మాత్రం ఏమాత్రం పోటీనివ్వలేకపోయారు. కివీస్‌ స్పీడ్‌స్టర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌ కళ్లుచెదిరే బంతులతో భారత్‌ను భారీ దెబ్బకొట్టాడు.  రెండో ఇన్నింగ్స్‌లో బౌల్ట్‌ ధాటికి భారత్‌ 113 పరుగులకే నాలుగు వికెట్లు చేజార్చుకుంది. యువ ఆటగాడు మయాంక్‌ అగర్వాల్‌(58) మాత్రం అర్ధశతకంతో ఆకట్టుకోవడంతో భారత్‌ ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది.  విరాట్‌ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన విహారి సంయమనంతో బ్యాటింగ్‌ చేశాడు. రహానె, విహారి జోడీ మరో వికెట్‌ పడకుండా జాగ్రత్తగా ఆడారు. 

అంతకుముందు కివీస్‌ టెయిలెండర్లు కీలక భాగస్వామ్యాలు నెలకొల్పడంతో తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు చేసింది. ఇషాంత్‌ ఐదు వికెట్లతో విజృంభించడంతో కివీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 348 పరుగులకు ఆలౌటైంది.   జేమీసన్(44)‌, గ్రాండ్‌హోం(43) 71 పరుగుల విలువైన భాగస్వామ్యంతో మెరిశారు. ఆఖర్లో ట్రెంట్‌ బౌల్ట్‌(38: 24 బంతుల్లో 5ఫోర్లు, సిక్స్‌) ధనాధన్‌ బ్యాటింగ్‌తో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. భారత సీనియర్‌ పేసర్‌ ఇషాంత్‌ శర్మ, స్పిన్నర్‌ అశ్విన్‌(3/ 99) కివీస్‌ను ఆలౌట్‌ చేయడంలో ముఖ్యపాత్ర పోషించారు. సహచర పేసర్లు తేలిపోయిన పిచ్‌పై ఇషాంత్‌(5/68) అద్భుత ప్రదర్శన చేశాడు. టెస్టుల్లో 11వ సారి ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు.  టెయిలెండర్లను త్వరగా ఔట్‌ చేయడంలో విఫలమవడంతో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యాన్ని కోల్పోయింది. logo