గురువారం 21 జనవరి 2021
Sports - Dec 27, 2020 , 12:43:55

ర‌హానే సూప‌ర్ సెంచ‌రీ.. టీమిండియాదే పైచేయి

ర‌హానే సూప‌ర్ సెంచ‌రీ.. టీమిండియాదే పైచేయి

మెల్‌బోర్న్‌:  తొలి టెస్ట్‌లో ఘోర ప‌రాభవం త‌ర్వాత బాక్సింగ్ డే టెస్ట్‌లో అద్భుతంగా పుంజుకుంది టీమిండియా. అజింక్య ర‌హానే కెప్టెన్ ఇన్నింగ్స్‌తో టెస్టుల్లో 12వ సెంచ‌రీ చేయ‌గా.. అత‌నికి ఆల్‌రౌండ‌ర్ జ‌డేజా చ‌క్క‌ని స‌హ‌కారం అందించ‌డంతో క్ర‌మంగా మ్యాచ్‌పై ప‌ట్టు బిగిస్తోంది. రెండో రోజు ఆట ముగిసే స‌మ‌యానికి తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల‌కు 277 ప‌రుగులు చేసి 82 ప‌రుగుల ఆధిక్యంలో నిలిచింది. ర‌హానే 104, జ‌డేజా 40 ప‌రుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. ఈ ఇద్ద‌రూ ఇప్ప‌టికే ఆరో వికెట్‌కు అజేయంగా 104 ప‌రుగులు జోడించారు. 

వికెట్ న‌ష్టానికి 36 ప‌రుగుల‌తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొన‌సాగించిన టీమిండియా.. వ‌రుస‌గా వికెట్లు కోల్పోయింది. తొలి టెస్ట్ ఆడుతున్న శుభ్‌మ‌న్ గిల్ 45 ప‌రుగులు చేసి ఔట‌వ‌గా.. పుజారా 17 ప‌రుగుల‌కే పెవిలియ‌న్‌కు చేరాడు. దీంతో టీమిండియా 64 ప‌రుగుల‌కే 3 వికెట్లు కోల్పోయింది. ఈ ద‌శలో ర‌హానే అద్భుతంగా పోరాడాడు. మొద‌ట విహారీ(21)తో క‌లిసి నాలుగో వికెట్‌కు 52 ప‌రుగులు.. త‌ర్వాత వికెట్ కీప‌ర్ రిష‌బ్ పంత్ (29)తో క‌లిసి ఐదో వికెట్‌కు 57 ప‌రుగులు జోడించాడు. 173 ప‌రుగుల ద‌గ్గ‌ర ఐదో వికెట్‌గా పంత్ ఔట‌వ‌డంతో.. టీమిండియాకు తొలి ఇన్నింగ్స్‌లో మంచి ఆధిక్యం ల‌భిస్తుందా అన్న అనుమానం క‌లిగింది.

ఈ స‌మ‌యంలో ర‌హానేతో జ‌త క‌ట్టిన జ‌డేజా త‌న అద్భుత‌మైన ఫామ్ కొన‌సాగించాడు. టీ20 మ్యాచ్‌లో గాయం కార‌ణంగా రెండు టీ20లు, తొలి టెస్ట్‌కు దూర‌మైన జ‌డేజా.. ఆసీస్ బౌల‌ర్ల‌ను  దీటుగా ఎదుర్కొన్నాడు. అస‌లుసిస‌లు టెస్ట్ ఇన్నింగ్స్ ఆడుతూ.. ర‌హానేకు చ‌క్క‌ని స‌హ‌కారం అందించాడు. దీంతో ఇండియ‌న్ టీమ్‌కు తొలి ఇన్నింగ్స్‌లో కీల‌క‌మైన ఆధిక్యం ల‌భించింది. రెండో రోజు ఆట ముగిసే స‌మయానికి జ‌డేజా 104 బంతుల్లో 40 ప‌రుగులు చేసి క్రీజులో ఉన్నాడు. 


logo