గురువారం 03 డిసెంబర్ 2020
Sports - Sep 27, 2020 , 01:10:33

రికార్డు టైటిల్‌ లక్ష్యంగా..

రికార్డు టైటిల్‌ లక్ష్యంగా..

  • బరిలోకి స్పెయిన్‌ స్టార్‌ నాదల్‌   
  • నేటి నుంచి ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ
  • మధ్యాహ్నం 2.30గం. నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌లో

రోమ్‌: స్విట్జర్లాండ్‌ టెన్నిస్‌ దిగ్గజం రోజర్‌ ఫెదరర్‌ పేరిట ఉన్న అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్ల (20) రికార్డును సమం చేయాలనే లక్ష్యంతో స్పెయిన్‌ స్టార్‌, రెండో ర్యాంకర్‌ రఫెల్‌ నాదల్‌ ఫ్రెంచ్‌ ఓపెన్‌ టోర్నీలో అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యాడు. తనకు అచ్చొచ్చిన మట్టికోర్టు సమరంలో 13వ టైటిల్‌ వేటను ప్రారంభించనున్నాడు. పారిస్‌లో ఫ్రెంచ్‌ ఓపెన్‌ (రోలాండ్‌ గారోస్‌)ప్రధాన పోరు ఆదివారం ఆరంభం కానుంది. గాయం కారణంగా ఫెదరర్‌ ఈ టోర్నీకి కూడా దూరమయ్యాడు. ఈ ఏడాది సూపర్‌ ఫామ్‌లో ఉంటూ.. యూఎస్‌ ఓపెన్‌లో లైన్‌అంపైర్‌కు బాల్‌ కొట్టి అనూహ్యంగా అనర్హతకు గురైన ప్రపంచ నంబర్‌వన్‌, సెర్బియా స్టార్‌ నొవాక్‌ జొకోవిచ్‌ మట్టికోర్టులో నాదల్‌కు షాకివ్వాలనే పట్టుదలతో ఉన్నాడు. తొలి రౌండ్‌లో రెండో సీడ్‌  నాదల్‌.. ఇగోర్‌ గెరేసిమోవ్‌ (బెలారస్‌)తో, మైకేల్‌ వైమెర్‌ (స్వీడన్‌)తో జొకో తలపడనున్నారు. ఈ ఏడాది యూఎస్‌ ఓపెన్‌లో అద్భుతంగా ఆడిన విజేత డొమినిక్‌ థీమ్‌, రన్నరప్‌ అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌, డానిల్‌  మెద్వదెవ్‌ కూడా టైటిల్‌పై కన్నేశారు.

హలెప్‌ ఫేవరెట్‌.. సెరెనా మరోసారి 

మహిళల సింగిల్స్‌ డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆష్లే బార్టీ కరోనా కారణంగా ఫ్రెంచ్‌ ఓపెన్‌కు దూరమైంది. యూఎస్‌ ఓపెన్‌ విజేత నవోమీ ఒసాక కూడా పాల్గొనడం లేదు. దీంతో టాప్‌ సీడ్‌గా బరిలోకి దిగుతున్న సిమోనా హలెప్‌ (రొమేనియా) టైటిల్‌ ఫేవరెట్‌గా  ఉంది. ఇక మార్గరెట్‌ కోర్ట్‌ పేరిట ఉన్న మహిళల అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్ల (24) రికార్డును సమం చేసేందుకు మూడేండ్లుగా పోరాడుతున్న అమెరికా స్టార్‌ సెరెనా విలియమ్స్‌ ఈసారైనా సాధించాలని పట్టుదలగా ఉంది. ఇక భారత్‌ నుంచి సింగిల్స్‌ పోరులో ఫ్రెంచ్‌ ఓపెన్‌కు ఎవరూ అర్హత సాధించలేకపోగా.. పురుషుల డబుల్స్‌లో రోహన్‌ బోపన్న, దివిజ్‌ శరణ్‌ వారి భాగస్వాములతో బరిలోకి దిగనున్నారు.