మంగళవారం 31 మార్చి 2020
Sports - Jan 30, 2020 , 00:19:00

నాదల్‌కు షాక్‌

నాదల్‌కు షాక్‌

హార్డ్‌కోర్ట్‌లో స్పెయిన్‌ స్టార్‌ రఫెల్‌ నాదల్‌కు మరోసారి నిరాశే మిగిలింది. 2009 తర్వాత మళ్లీ ఆస్ట్రేలియా గడ్డపై టైటిల్‌ ముద్దాడాలన్న అతడి కోరిక తీరలేదు. క్వార్టర్స్‌ ఫైనల్లోనే టాప్‌ సీడ్‌ నాదల్‌కు ఆస్ట్రియా ఆటగాడు డొమెనిక్‌ థీమ్‌ చేతిలో పరాజయం ఎదురైంది. మూడు సెట్లను టైబ్రేకర్లలోనే కైవసం చేసుకున్న థీమ్‌.. తనను గత రెండేండ్లు ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఫైనల్లో ఓడించిన నాదల్‌పై కాస్త ప్రతీకారం తీర్చుకున్నాడు. సెమీస్‌లో జ్వెరెవ్‌తో అతడు తలపడనున్నాడు. మహిళల సింగిల్స్‌ క్వార్టర్స్‌లో నాలుగో సీడ్‌ హలెప్‌, ముగురుజ అలవోక విజయాలతో చివరి నాలుగుకు దూసుకెళ్లారు.

  • క్వార్టర్స్‌లో థీమ్‌ చేతిలో అనూహ్య ఓటమి ..
  • సెమీస్‌ చేరిన జ్వెరెవ్‌..

మెల్‌బోర్న్‌: అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్ల రికార్డు(20)ను ఆస్ట్రేలియా గడ్డపైనే సమం చేయాలనుకున్న స్పెయిన్‌ బుల్‌, ప్రపంచ నంబర్‌ వన్‌ ర్యాంకర్‌ రఫెల్‌ నాదల్‌కు చుక్కెదురైంది. తొలి టైటిల్‌ కోసం తహతహలాడుతున్న ఐదో ర్యాం కు ఆటగాడు డొమెనిక్‌ థీమ్‌ చేతిలో క్వార్టర్స్‌లోనే రఫాకు ఓటమి ఎదురైంది. బుధవారం ఇక్కడ జరిగిన ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో నాదల్‌ 6-7(3/7), 6-7(4/7), 6-4, 6-7(6/8)తేడాతో ఐదో సీడ్‌ డొమెనిక్‌ థీమ్‌(ఆస్ట్రియా) చేతిలో ఓడిపోయాడు. మ్యాచ్‌ 4గంటల 10నిమిషాల పాటు  జరుగగా... మూడు సెట్లను థీమ్‌ టైబ్రేకర్లలోనే చేజిక్కుంచుకున్నాడు. తొలి సెట్‌లో ఇరువురు ప్లేయర్లు హోరాహోరీగా తలపడ్డారు. దీంతో టై బ్రేకర్‌ అనివార్యం కాగా  అక్కడ విజృంభించిన థీమ్‌.. నాదల్‌కు ఏ మాత్రం అవకాశమివ్వకుండా సెట్‌ను చేజిక్కించుకున్నాడు. రెండో సెట్‌ సైతం దాదాపుగా ఇలాగే సాగి టైబ్రేకర్‌కు దారితీసింది. ఈసారి థీమ్‌ 7-4తో సెట్‌ను గెలుచుకున్నాడు. 


ఆ తర్వాత పుంజుకున్న నాదల్‌ మూడో సెట్‌ను 6-4తో గెలిచి గాడిలో పడ్డట్టు కనిపించాడు. ఆ తర్వాతి సెట్‌ సైతం 6-6తో సమం కావడంతో  ఫలితం టైబ్రేకర్‌కు చేరింది. కీలకమైన ఈ బ్రేకర్‌లోనూ 5-3తో ముందంజ వేసిన థీమ్‌ కాసేపు ఒత్తిడికి లోనయ్యాడు. దాన్ని ఆసరాగా చేసుకున్న నాదల్‌ ఓ మ్యాచ్‌  పాయింట్‌ను కాచుకోవడంతో సహా 6-6తో సమం చేసి ఫెదరర్‌లా మ్యాచ్‌ను కాపాడుకుంటాడేమో అనిపించింది. అయితే ఆ తర్వాత పుంజుకున్న థీమ్‌ వరుసగా రెండు పాయింట్లతో గెలిచాడు. మరో క్వార్టర్స్‌లో ఏడో సీడ్‌ అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ 1-6, 6-3, 6-4, 6-2తేడాతో  15వ సీడ్‌ స్టాన్‌ వావ్రింక(స్విట్జర్లాండ్‌)పై విజయం సాధించాడు. 


సెమీస్‌లో హలెప్‌, ముగురుజ 

మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్స్‌లో నాలుగో సీడ్‌ సిమోనా హలెప్‌(రొమేనియా) 6-1,6-1తేడాతో అనెట్‌ కొంటావెట్‌పై  అలవోక విజయం సాధించింది. మరో మ్యాచ్‌లో గాబ్రిన్‌ ముగురుజ(స్పెయిన్‌) 7-5, 6-3తేడాతో అనస్టాసియా పావ్లుచెన్కోవా(రష్యా)పై గెలిచి సెమీస్‌లో అడుగుపెట్టింది. 


పురుషుల సింగిల్స్‌ 

జొకోవిచ్‌ X ఫెదరర్‌ (మధ్యాహ్నం 3గంటలకు)

మహిళల సింగిల్స్‌

బార్టీ(ఆస్ట్రేలియా) X సోఫియా కెనిన్‌(అమెరికా)

హలెప్‌ X ముగురుజ 

మ్యాచ్‌లు ఉదయం 8.30 నుంచి సోనీ సిక్స్‌లో ప్రత్యక్షప్రసారం 


logo
>>>>>>