మంగళవారం 31 మార్చి 2020
Sports - Jan 24, 2020 , 00:56:23

రఫా దూకుడు

రఫా దూకుడు
  • రెండో రౌండ్లో వరుస సెట్లలో గెలుపు..
  • ప్లిస్కోవా, హలెప్‌ ముందంజ
  • గాయంతో మధ్యలోనే వైదొలిగిన సానియా..
  • ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌

మెల్‌బోర్న్‌: హార్డ్‌కోర్ట్‌ సమరం ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో స్పెయిన్‌ బుల్‌ రఫెల్‌ నాదల్‌ దూసుకెళుతున్నాడు. రెండో రౌండ్‌లోనూ వరుస సెట్లలో గెలిచి.. 20వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ వేటలో ముందంజ వేశాడు. మహిళల సింగిల్స్‌లో కరోలినా ప్లిస్కోవా, సిమోనా హలెప్‌ వరుస సెట్ల విజయాలతో సత్తాచాటారు. గురువారం ఇక్కడ జరిగిన పురుషుల సింగిల్స్‌ రెండో రౌండ్లో ప్రపంచ నంబర్‌వన్‌ నాదల్‌ 6-3, 7-6(7/4), 6-1తేడాతో ఫెడెరికో డెల్బోనిస్‌(అర్జెంటీనా)పై విజయం సాధించాడు. రెండున్నర గంటలపాటు జరిగిన మ్యాచ్‌ తొలి సెట్‌లో నాదల్‌ దూకుడు ప్రదర్శించాడు. ఆసాంతం బ్యాక్‌హ్యాండ్‌ పవర్‌ఫుల్‌ షాట్లతో అలరించాడు. ఆ తర్వాతి సెట్‌లో రఫాకు ప్రతిఘటన ఎదురైంది. డెల్బోనిస్‌ సైతం పోటీపడుతూ సర్వీస్‌లు కాపాడుకుంటూ ముందుకుసాగడంతో ట్రైబ్రేకర్‌ అనివార్యమైంది. ఆ తరుణంలో రెచ్చిపోయిన నాదల్‌ 7/4తో సునాయాసంగా సెట్‌ను దక్కించుకున్నాడు. మూడో సెట్‌లో స్పెయిన్‌ స్టార్‌ జోరుకు అడ్డులేకుండా పోయింది. వేగవంతంగా గేమ్‌లను ముగిస్తూ చివరికి సెట్‌ను 6-1తో గెలిచి, టోర్నీ మూడో రౌండ్లోకి నాదల్‌ ప్రవేశించాడు. 


థీమ్‌ కాస్తలో..

మరో మ్యాచ్‌లో ప్రపంచ ఐదో ర్యాంకు ఆటగాడు డొమినిక్‌ థీమ్‌(ఆస్ట్రియా) పరిస్థితి చావుతప్పి కన్నులొట్టపోయినట్టయింది. 140వ ర్యాంకర్‌ అలెక్స్‌ బోల్ట్‌(ఆస్ట్రేలియా)పై ఐదు సెట్లలో గెలిచి ఊపిరి పీల్చుకున్నాడు. 3గంటల 22 నిమిషాల పాటు పోరాడిన థీమ్‌ చివరికి 6-2, 5-7, 6-7(5/7), 6-1, 6-2తేడాతో బోల్ట్‌పై గెలిచాడు. నాలుగో సీడ్‌ డేనిల్‌ మద్వెదెవ్‌(రష్యా) 7-5, 6-1, 6-3తేడాతో పెడ్రో మార్టినెజ్‌పై విజయం సాధించగా.. ఏడో సీడ్‌ అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌(జర్మనీ) 7-6(7/5), 6-4, 7-5తేడాతో ఇగోర్‌ గెరాసిమోవ్‌(బెలారస్‌)పై గెలిచి మూడో రౌండ్లో ప్రవేశించాడు. మ్యాచ్‌ మధ్యలో ముక్కు నుంచి రక్తస్రావం జరిగినా మెద్వెదెవ్‌ కాసేపటి తర్వాత ఆట కొనసాగించాడు. మ్యాచ్‌ మొత్తం 32 ఏస్‌లు బాదిన 19వ సీడ్‌ జాన్‌ ఇస్నెర్‌ 6-4, 6-3, 6-3తేడాతో అలెజాండ్ర తబిలో(చిలీ)పై గెలిచాడు. 


మూడో రౌండ్లోకి ప్లిస్కోవా, హలెప్‌ 

మహిళల సింగిల్స్‌ రెండో రౌండ్లో రెండో సీడ్‌ కరోలినా ప్లిస్కోవా(చెక్‌రిపబ్లిక్‌) 6-3, 6-3తో లారా సెగెముండ్‌(జర్మనీ)పై గెలిచింది. మరో మ్యాచ్‌ లో వింబుల్డన్‌ చాంపియన్‌, నాలుగో సీడ్‌ సిమోనా హలెప్‌(రొమేనియా) 6-2, 6-4తేడాతో వరుస సెట్లలో హారియట్‌ డార్ట్‌(బ్రిటన్‌) విజయం సాధించి మూడో రౌండ్‌కు దూసుకెళ్లింది. స్వితోలినా, తొమ్మిదో సీడ్‌ కికి బెర్టెన్స్‌  (నెదర్లాండ్స్‌), 17వ సీడ్‌ కెర్బెర్‌ సైతం ముందడుగేశారు. 


మనసులు గెలిచిన రఫా 


స్పెయిన్‌ స్టార్‌ రఫెల్‌ నాదల్‌ ప్రేక్షకుల మనసులను గెలుచుకున్నాడు. తాను కొట్టిన షాట్‌ వల్ల బంతి దెబ్బకు గురైన ఓ బాల్‌గర్ల్‌కు కోర్టులోనే క్షమాపణ చెప్పి ఓదార్చాడు. బుగ్గపై ముద్దు పెట్టి.. తన హెడ్‌బ్యాండ్‌ను బహుమతిగా ఇచ్చాడు. ఫెడెరికోతో జరిగిన రెండో రౌండ్‌ మ్యాచ్‌లో రఫా బలమైన షాట్‌ కొట్టగా అనుకోకుండా ఓ బాల్‌గర్ల్‌ అడ్డం వచ్చింది. దీంతో ఆమెకు బంతి బలంగా తాకింది. వెంటనే బాలిక వద్దకు వెళ్లిన నాదల్‌ ఆమెను ఓదార్చాడు. ‘బాలికకు బంతి తగిలిన సమయంలో చాలా భయపడ్డా. నా కెరీర్‌లో అత్యంత భయానక సందర్భాల్లో ఇదీ ఒకటి’ అని మ్యాచ్‌ తర్వాత నాదల్‌ చెప్పాడు. 


సానియా నిష్క్రమణ


తల్లి అయ్యాక తొలిసారి గ్రాండ్‌స్లామ్‌ బరిలో నిలిచిన భారత స్టార్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి సానియా మీర్జాకు గాయం నిరాశమిగిల్చింది. గురువారం మహిళల డబుల్స్‌ తొలి రౌండ్లో తన భాగస్వామి నాడియా కిచనోవ్‌(ఉక్రెయిన్‌)తో కలిసి చైనా జోడీపై పోటీకి దిగిన సానియా పిక్క కండరాల గాయంతో పూర్తి మ్యాచ్‌ ఆడలేకపోయింది. 2-6, 0-1తో వెనుకబడిన సమయంలో గాయం తీవ్రమవడంతో ఆమె పోటీ నుంచి వైదొలిగింది. ఇప్పటికే గాయం కారణంగా మిక్స్‌డ్‌ డబుల్స్‌ నుంచి తప్పుకోవడంతో ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో సాని యా పోరు ముగిసింది. రెండేండ్ల విరామం అనంతరం రాకెట్‌ పట్టిన సానియా ఇటీవలే హోబర్ట్‌ ఇంటర్నేషన్‌ టోర్నీలో కిచనోవ్‌తో కలిసి విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. 


logo
>>>>>>