గురువారం 03 డిసెంబర్ 2020
Sports - Oct 12, 2020 , 02:55:24

నయా చరిత్ర

నయా చరిత్ర

  • 13వ సారి ఫ్రెంచ్‌ ఓపెన్‌ విజేతగా నాదల్‌ 
  • ఫెదరర్‌ గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లను సమం చేసిన స్పెయిన్‌ బుల్‌ 
  • ఫైనల్‌లో జొకోవిచ్‌పై రఫా అలవోక విజయం 

అచ్చొచ్చిన రాజ్యంలో వందో యుద్ధం గెలిచి చరిత్ర లిఖించాడు. 13వ సారి ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిల్‌ ముద్దాడి పారిస్‌ పోరులో తనకు తిరుగేలేదని గర్జించాడు. స్విస్‌ దిగ్గజం రోజర్‌ ఫెదరర్‌ పేరిట ఉన్న అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లను సమం చేశాడు. ఫైనల్‌లో ప్రపంచ నంబర్‌వన్‌ ర్యాంకర్‌ నొవాక్‌ జొకోవిచ్‌ను వరుససెట్లలో మట్టికరిపించి.. క్లే కోర్ట్‌లో తానే అగ్రగణ్యుడినని మరోసారి రుజువు చేశాడు. మునుపెన్నడూ లేని విభిన్న పరిస్థితుల మధ్య కూడా అదే దూకుడును నాదల్‌ ప్రదర్శించాడు. 

నాకు ఈ కోర్టుతో, ఈ నగరం(పారిస్‌)తో ఎప్పటికీ మరిచిపోలేని ప్రేమకథ ఉంది. ఇక్కడ విజయం సాధించడమే నాకు సర్వస్వం. నిజం చెప్పాలంటే 20వ టైటిల్‌, ఫెదరర్‌ రికార్డు సమం చేయడం గురించి నేను ఆలోచించలేదు. ఇది నాకు మరో ఫ్రెంచ్‌ విజయం. కెరీర్‌లో నాకు అత్యంత అమూల్యమైన జ్ఞాపకాలు ఇక్కడే ఉన్నాయి’

- రఫేల్‌ నాదల్‌ 

  • ఫెదరర్‌ గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్ల(20)ను సమం చేయడం రఫాకు ఇదే తొలిసారి.
  • 1972 తర్వాత ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిల్‌ దక్కించుకున్న అత్యధిక వయస్కుడిగా నాదల్‌ రికార్డు సృష్టించాడు. 2005లో తొలి మట్టికోర్టు టైటిల్‌ పట్టిన అతడు 15ఏండ్ల తర్వాత కూడా విజేతగా నిలిచాడు. 
  • నాదల్‌ వరుసగా నాలుగో ఏడాది ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిల్‌ దక్కించుకున్నాడు
  • గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్స్‌లో జొకోపై నాదల్‌కు ఇది ఐదో విజయం. ఇంతకు ముందు వరకు చెరో నాలుగు విజయాలతో ఇద్దరూ సమానంగా ఉండగా ఇప్పుడు రఫా ఆధిక్యంలోకి వెళ్లాడు. 

పారిస్‌: స్పెయిన్‌ వీరుడు రఫేల్‌ నాదల్‌ 13వ సారి ఫ్రెంచ్‌ ఓపెన్‌ విజేతగా నిలిచి.. కెరీర్‌లో 20వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లలో స్విస్‌ దిగ్గజం ఫెదరర్‌ను చేరుకోవాలని ఎంతో కాలంగా చేస్తున్న ప్రయత్నంలో సఫలీకృతుడై చరిత్ర సృష్టించాడు. ఆదివారం ఇక్కడి ఫిలిప్‌ కాట్రియెర్‌ కోర్టులో జరిగిన పురుషుల సింగిల్స్‌ ఫైనల్‌లో రెండో సీడ్‌ నాదల్‌  6-0, 6-2, 7-5 తేడాతో ప్రపంచ నంబర్‌వన్‌ ర్యాంకర్‌, సెర్బియా స్టార్‌ నొవాక్‌ జొకోవిచ్‌పై సునాయాసంగా గెలిచాడు. 2గంటల 41నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో ఆసాంతం జొకోపై నాదల్‌ పైచేయి సాధించాడు. ప్రారంభంలోనే నొవాక్‌ సర్వీస్‌ను బ్రేక్‌ చేసిన రఫా ఎక్కడా తిరిగిచూసుకోలేదు. ఏకంగా తొలి సెట్‌ను 6-0,   6-2తో తర్వాతి సెట్‌ను కైవసం చేసుకున్నాడు. మూడో సెట్లో జొకో కాస్త ప్రతిఘటించినా నాదల్‌ చివరి వరకు దూకుడు ప్రదర్శించి టైటిల్‌ ఎగరేసుకుపోయాడు. బ్యాక్‌ హ్యాండ్‌ బలమైన షాట్లతో నాదల్‌ విరుచుకుపడడంతో జొకోవిచ్‌ ఏకంగా 52 తప్పిదాలు చేశాడు. రఫా నాలుగు ఏస్‌లు కొడితే.. జొకో ఒకటికే పరిమితమ్యాడు. ఈ మ్యాచ్‌ గెలిచి 1969 తర్వాత నాలుగు ప్రధాన గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లను రెండుసార్లు దక్కించుకున్న తొలి ఆటగాడిగా నిలువాలన్న జొకో ఆశలలను రఫా నీరుగార్చాడు. 

 టైటిల్‌ నిలబెట్టుకున్న బాబోస్‌ ద్వయం  

ఫ్రెంచ్‌ ఓపెన్‌ మహిళల డబుల్స్‌ టైటిల్‌ను టిమియా బాబోస్‌(హంగేరీ), క్రిస్టియనా మ్లాదనోవిచ్‌(ఫ్రాన్స్‌) నిలబెట్టుకున్నారు. ఆదివారం జరిగిన ఫైనల్‌లో బాబోస్‌ ద్వయం 6-4, 7-5 తేడాతో డిసైర్‌ క్లావ్‌కిక్‌, అలెక్సా గురాచిపై విజయం సాధించింది.  

 విభిన్న పరిస్థితులు.. కొత్త బంతి.. అయినా అదే దూకుడు.. 

ప్రతి ఏడాది సాధారణంగా మే - జూన్‌ మధ్య వేసవిలో పారిస్‌ వేదికగా ఫ్రెంచ్‌ ఓపెన్‌ జరిగేది. అయితే కరోనా వైరస్‌ కారణంగా ఈ ఏడాది సెప్టెంబర్‌ - అక్టోబర్‌కు వాయిదా పడింది. దీంతో మునుపెన్నడూ లేని విధంగా శీతల వాతావరణ పరిస్థితుల మధ్య టోర్నీ జరిగింది. అలాగే ఇంతకాలం మట్టికోర్టు కోసం సమరంలో వినియోగించిన బాంబోలట్‌ బంతులు కాకుండా ఈ ఏడాది బరువుగా ఉంటే విల్సన్‌ బాల్స్‌ను నిర్వాహకులు ప్రవేశపెట్టారు. ఇలా ఎన్నో మార్పులు జరిగినా ఫ్రెంచ్‌ ఓపెన్‌లో రఫేల్‌ నాదల్‌ దూకుడు మాత్రం మారలేదు. సవాళ్లను సునాయాసంగా అధిగమిస్తూ.. తాను ప్రేమించే కోర్టుపై గెలుపు యాత్రను కొనసాగించాడు. పరిమిత ప్రేక్షకుల మధ్యే జరిగినా ఎనలేని స్ఫూర్తితో కోట్లాది మంది టెన్నిస్‌ అభిమానులను అలరించాడు. ఒక్క సెట్‌ కూడా కోల్పోకుండా టైటిల్‌ను ఒడిసిపట్టాడు.