శనివారం 28 మార్చి 2020
Sports - Jan 28, 2020 , 02:58:23

క్వార్టర్స్‌లో నాదల్‌

క్వార్టర్స్‌లో నాదల్‌

ఆస్ట్రేలియన్‌  ఓపెన్‌  క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టేందుకు స్పెయిన్‌ బుల్‌  రఫెల్‌ నాదల్‌ తీవ్రంగా శ్రమించాడు. ప్రిక్వార్టర్స్‌లో కిర్గియోస్‌పై మూడున్నర గంటలకు పైగా పోరాడి చివరికి విజయం సాధించాడు. నాలుగో సీడ్‌ మెద్వదెవ్‌కు షాక్‌ తగలగా.. జ్వెరెవ్‌, థీమ్‌  సునాయాస విజయాలతో క్వార్టర్‌ ఫైనల్స్‌కు చేరుకున్నారు. మహిళల సింగిల్స్‌లో హలెప్‌ ముందడుగు వేసినా.. తొమ్మిదో సీడ్‌ బెర్టెన్స్‌కు నిరాశ ఎదురైంది. 


మెల్‌బోర్న్‌: ప్రపంచ నంబర్‌వన్‌ ర్యాంకర్‌ రఫెల్‌ నాదల్‌ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ క్వార్టర్‌ ఫైనల్లో అడుగుపెట్టాడు. అంచనా వేసినట్టుగానే స్పెయిన్‌  బుల్‌ రఫా -కిర్గియోస్‌ మధ్య పోరు రసవత్తరంగా సాగింది. సోమవారమిక్కడ  జరిగిన పురుషుల సింగిల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో నాదల్‌ 6-3, 3-6, 7-6(8/6), 7-6(7/4)తేడాతో నిక్‌ కిర్గియోస్‌(ఆస్ట్రేలియా)పై 3గంటల 38నిమిషాల పాటు పోరాడి గెలిచాడు. తొలి సెట్‌  మూడో గేమ్‌లో ఇద్దరు ప్లేయర్లు హోరాహోరీగా పోటీపడి పాయింట్లు సాధించగా... నాదల్‌ చివరికి కిర్గియోస్‌ సర్వీస్‌ను బ్రేక్‌ చేసి 3-1తో ముందడుగేశాడు.  తర్వాత అదే జోరు కొనసాగించి 6-3తో తొలిసెట్‌ కైవసం చేసుకున్నాడు. రెండో సెట్‌లో నిక్‌  అనూహ్యంగా పుంజుకున్నాడు. బలమైన షాట్లతో రఫాను ఆత్మరక్షణ ధోరణిలోకి నెట్టి.. ఓసారి సర్వీస్‌ను సైతం బ్రేక్‌  చేశాడు. చివరి వరకు అదే దూకుడుతో 6-3తో సెట్‌ను దక్కించుకున్నాడు. మూడో సెట్‌లో ఇరువురు ప్లేయర్లు సర్వీస్‌లను కాపాడుకుంటూ ముందు కు సాగడంతో టై బ్రేకర్‌  అనివార్యమైంది. అక్కడా ఇద్దరు ప్లేయర్లు నువ్వానేనా అన్నట్టు దూకుడుగా ఆడినా.. ఒత్తిడిని జయించిన నాదల్‌కే సెట్‌ దక్కింది. నాలుగో సెట్‌ ఆదిలోనే కిర్గియోస్‌ సర్వీస్‌ను బ్రేక్‌  చేసిన నాదల్‌... 5-4తో ముందంజలో ఉన్న సమయంలో సర్వీస్‌  కోల్పోయాడు. దీంతో ఫలితం కోసం మళ్లీ టైబ్రేకర్‌కు వెళ్లాల్సి వచ్చింది. అయితే ఈసారి నాదల్‌ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి 7-4తో సెట్‌ సహా, మ్యాచ్‌ను గెలిచి క్వార్టర్స్‌లో అడుగుపెట్టాడు. క్వార్టర్స్‌లో డొమెనిక్‌  థీమ్‌తో నాదల్‌  తలపడనున్నాడు.

మెద్వదెవ్‌ నిష్క్రమణ 

మరో మ్యాచ్‌లో ఆస్ట్రేలియన్‌  ఓపెన్‌  మాజీ చాంపియన్‌, 15వ సీడ్‌  స్టాన్‌ వావ్రింకా(స్విట్జర్లాండ్‌) చేతిలో నాలుగో సీడ్‌ డేనియల్‌ మెద్వదెవ్‌(రష్యా) ఓటమి పాలయ్యాడు. ఐదు సెట్ల పాటు దాదాపు మూడున్నర గంటలు సాగిన మ్యాచ్‌లో మెద్వదెవ్‌ 2-6, 6-2, 6-4, 6-7(2/7), 2-6తేడాతో వావ్రింకా చేతిలో ఓడాడు. అలెగ్జాండర్‌  జ్వెరెవ్‌(జర్మనీ) 6-4, 6-4, 6-4తో అండ్రె రుబ్లేవ్‌(రష్యా)పై గెలిచి క్వార్టర్స్‌లో వావ్రింకాతో తలపడనున్నాడు. ఐదో సీడ్‌  డొమెనిక్‌  థీమ్‌ 6-2, 6-4, 6-4తేడాతో గేల్‌ మోన్‌ఫిల్స్‌(ఫ్రెంచ్‌)పై సునాయాసంగా గెలిచాడు.


బెర్టెన్స్‌కు షాక్‌ 

మహిళల సింగిల్స్‌  ప్రిక్వార్టర్స్‌లో నాలుగో సీడ్‌  సిమోనా హలెప్‌(రొమేనియా) 6-4, 6-4తో 16వ సీడ్‌  ఎలెసే మార్టెన్స్‌(బెల్జియం)పై అలవోకగా గెలిచింది. కాగా, 9వ సీడ్‌ కికి బెర్టెన్స్‌(నెదర్లాండ్స్‌) 3-6, 3-6తో అన్‌సీడెడ్‌ గాబ్రిన్‌ ముగురుజ(స్పెయిన్‌)చేతిలో గంటా 8నిమిషాల్లోనే పరాజయం పాలైంది. 

కిర్గియోస్‌  కంటతడి 

హెలికాప్టర్‌ ప్రమాదంలో అమెరికా బాస్కెట్‌బాల్‌ దిగ్గజం కోబ్‌  బ్రయంట్‌, అతడి కుమార్తె గియానా మృతి చెందడంతో ఆస్ట్రేలియన్‌  ఓపెన్‌  పోటీలు సోమవారం భావోద్వేగాల మధ్య జరిగాయి. నాదల్‌తో పోటీకి దిగే ముందు కోబ్‌కు నివాళిగా లాస్‌ఏంజిల్స్‌ లేకర్స్‌ జెర్సీ వేసుకొని కోర్టులో అడుగు పెట్టిన కిర్గియోస్‌ కన్నీరు పెట్టుకున్నాడు. షాక్‌కు గురయ్యానంటూ నాదల్‌  సైతం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు. మహిళల డబుల్స్‌ మూడో రౌండ్‌లో బరిలోకి దిగిన అమెరికా యువ సంచలనం కోకొ గాఫ్‌.. తన బూట్లపై రిప్‌ కోబ్‌, రిప్‌ గిగి అని రాసుకుంది. 


logo