శనివారం 04 ఏప్రిల్ 2020
Sports - Mar 01, 2020 , 00:23:16

అజేయంగా..

అజేయంగా..

పొట్టి ప్రపంచకప్‌లో ఎదురులేకుండా దూసుకెళ్తున్న భారత అమ్మాయిల జట్టు అజేయంగా సెమీఫైనల్లో అడుగుపెట్టింది. హ్యాట్రిక్‌ విజయాలతో ఇప్పటికే సెమీస్‌ బెర్త్‌ ఖరారు చేసుకున్న టీమ్‌ఇండియా.. ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో ప్రియమైన ప్రత్యర్థి శ్రీలంకను చిత్తుచేసింది. గత మూడు మ్యాచ్‌ల్లోనూ మొదట బ్యాటింగే చేసిన భారత్‌కు ఈసారి ఛేజింగ్‌ చాన్స్‌ దక్కింది. సెన్సేషనల్‌ స్పిన్నర్‌ పూనమ్‌ యాదవ్‌ పెద్దగా ప్రభావం చూపకున్నా.. ఈసారి రాధా యాదవ్‌ బాధ్యత తీసుకొని ప్రత్యర్థిని కట్టడి చేసింది. యంగ్‌గన్‌ షఫాలీ వర్మ మరోసారి రెచ్చిపోవడంతో ఛేదనలోనూ టీమ్‌ఇండియా అదుర్స్‌ అనిపించుకుంది.

  • లీగ్‌ దశను ఘనంగా ముగించిన భారత్‌
  • శ్రీలంకపై జయభేరి
  • బ్యాట్‌తో షఫాలి, బంతితో రాధ విజృంభణ
  • మహిళల టీ20 ప్రపంచకప్‌

మెల్‌బోర్న్‌: మహిళల టీ20 ప్రపంచకప్‌లో దుమ్మురేపుతున్న భారత అమ్మాయిలు.. లీగ్‌ దశలో ఆడిన ఆన్నిమ్యాచ్‌ల్లోనూ జయకేతనం ఎగురవేశారు. ఇప్పటికే హ్యాట్రిక్‌ విజయాలతో సెమీఫైనల్‌ బెర్త్‌ ఖరారు చేసుకున్న టీమ్‌ఇండియా ఆఖరి పోరులో ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టింది. తొలుత బౌలింగ్‌లో రాధా యాదవ్‌ (4/23) తన మాయాజాలంతో లంకను కట్టడి చేస్తే.. అనక బ్యాటింగ్‌లో ‘లేడీ సెహ్వాగ్‌' షఫాలీ వర్మ (34 బంతుల్లో 47; 7 ఫోర్లు, ఒక సిక్సర్‌) ఆకాశమే హద్దుగా రెచ్చిపోవడంతో భారత్‌ సునాయాస విజయం సొంతం చేసుకుంది. శనివారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్‌ బృందం 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఫలితంగా 8 పాయింట్లతో గ్రూప్‌-ఏలో అగ్రస్థానంలో నిలిచింది. చెరో మూడు మ్యాచ్‌లాడిన ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ నాలుగేసి పాయింట్లతో వరుసగా ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నా యి. 


టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక మహిళల జట్టు నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లకు 113 పరుగులు చేసింది. కెప్టెన్‌ జయంగని (33) టాప్‌ స్కోరర్‌. భారత స్పిన్నర్లు రాధా యాదవ్‌, రాజేశ్వరి గైక్వాడ్‌ (2/18), పూనమ్‌ యాదవ్‌ (1/20) ధాటికి వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయిన లంక తక్కువ స్కోరుకే పరిమితమైంది. అనంతరం లక్ష్యఛేదనకు బరిలో దిగిన టీమ్‌ఇండియా 14.4 ఓవర్లలో 3 వికెట్లకు 116 పరుగులు చేసింది. యంగ్‌గన్‌ షఫాలీ వర్మ మరోసారి విజృంభించడంతో 32 బంతులు మిగిలుండగానే భారత్‌ టార్గెట్‌ ఛేజ్‌ చేసింది. కెరీర్‌ బెస్ట్‌ గణాంకాలు నమోదు చేసిన రాధకు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌' అవార్డు దక్కింది. గ్రూప్‌-బిలో రెండో స్థానంలో నిలిచిన జట్టుతో టీమ్‌ఇండియా సెమీఫైనల్లో తలపడనుంది. గ్రూప్‌-ఏలో భాగంగా శనివారం జరిగిన మరోమ్యాచ్‌లో న్యూజిలాండ్‌ 17 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌పై గెలుపొందింది.


ఈసారి రాధ..

గత మూడు మ్యాచ్‌ల్లో మొదట బ్యాటింగ్‌ చేసిన టీమ్‌ఇండియాకు ఈ మ్యాచ్‌లో లక్ష్యాన్ని ఛేదించే అవకాశం దక్కింది. టాస్‌ నెగ్గిన లంక కెప్టెన్‌ జయంగని  బ్యాటిం గ్‌ ఎంచుకున్నా ఆ జట్టుకు శుభారంభం దక్కలేదు.  తిమాషిని (2)ని మూడో ఓవర్‌లోనే ఔట్‌ చేసిన దీప్తి శర్మ భారత శిబిరంలో ఆనందం నింపింది. కాసేపటికే మాధవి (12) కూడా వెనుదిరిగింది. జోరు మీదున్న జయంగని, హాసిని (7)లను వరుస ఓవర్లలో ఔట్‌ చేసి న రాధ.. ప్రత్యర్థిని పూర్తిగా ఒత్తిడిలోకి నెట్టేసింది. మన బౌలర్ల ధాటికి.. హన్సీమ (7), శశికళ (13), సంజీవని (1), నీలాక్షి (8), సందీపని (0) ఒకరి వెంట ఒకరు పెవిలియన్‌కు క్యూ కట్టారు. దిల్హారి (25 నాటౌట్‌) కాస్త పోరాడటంతో లంక సెంచరీ మార్క్‌ దాటింది.


షఫాలీతో పాటు తలా కొన్ని..

స్వల్ప లక్ష్యఛేదనలో భారత్‌కు అదిరే ఆరంభం లభించింది. టోర్నీ ఆసాంతం నిలకడగా రాణిస్తున్న యువ ఓపెనర్‌ షఫాలి మరోసారి రెచ్చిపోయింది. ఆమెతో పాటు స్మృతి మంధాన (17; 3 ఫోర్లు) కూడా ఆకట్టుకోవడంతో టీమ్‌ఇండియా దూసుకెళ్లింది. శశికళ వేసిన ఆరో ఓవర్‌లో షఫాలి 4,6,4 అరుసుకొని అభిమానులను ఉర్రూతలూగించింది. మరోవైపు మెగాటోర్నీలో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ (15; 2 ఫోర్లు, ఒక సిక్సర్‌).. జయంగని ఓవర్‌లో వరుసగా 4,6,4 బాది దూకుడు కనబర్చింది. 


స్కోరు బోర్డు

శ్రీలంక: తిమాషిని (సి) రాజేశ్వరి (బి) దీప్తి 2, జయంగని (సి) శిఖ (బి) రాధ 33, మాధవి (బి) రాజేశ్వరి 12, హన్సీమ (సి) వేద (బి) రాధ 7, హాసిని (సి) తానియా (బి) రాధ 7, శశికళ (సి) వేద (బి) రాజేశ్వరి 13, నీలాక్షి (సి) హర్మన్‌ (బి) పూనమ్‌ 8, సంజీవని (ఎల్బీ) రాధ 1, దిల్హారి (నాటౌట్‌) 25, సందీపని (బి) శిఖ 0, ప్రబోధని (నాటౌట్‌) 2, ఎక్స్‌ట్రాలు: 3, మొత్తం: 20 ఓవర్లలో 113/9. వికెట్ల పతనం: 1-12, 2-42, 3-48, 4-58, 5-75, 6-78, 7-80, 8-104, 9-104, బౌలింగ్‌: దీప్తి శర్మ 4-0- 16-1, శిఖా పాండే 4-0-35-1, రాజేశ్వరి గైక్వాడ్‌ 4-1-18-2, పూనమ్‌ యాదవ్‌ 4-0-20-1, రాధ యాదవ్‌ 4-0-23-4.


భారత్‌: షఫాలీ వర్మ (రనౌట్‌) 47, స్మృతి మంధాన (సి) దిల్హారీ (బి) ప్రబోధని 17, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (సి) హన్సీమ (బి) శశికళ 15, జెమీమా రోడ్రిగ్స్‌ (నాటౌట్‌) 15, దీప్తి శర్మ (నాటౌట్‌) 15, ఎక్స్‌ట్రాలు: 14.4 ఓవర్లలో 116/3. వికెట్ల పతనం: 1-34, 2-81, 3-88, బౌలింగ్‌: ప్రబోధని 4-0-13-1, శశికళ 4-0-42-1, సందీపని 1-0-11-0, జయంగని 2-0-21-0, దిల్హారి 3-0-18-0, తిమాన్షి 0.4-0-7-0.


logo