గురువారం 26 నవంబర్ 2020
Sports - Oct 04, 2020 , 17:21:50

MI vs SRH: మెరిసిన డికాక్‌..ముంబై స్కోరు 208

MI vs SRH: మెరిసిన డికాక్‌..ముంబై స్కోరు  208

షార్జా: ఐపీఎల్‌-13లో భాగంగా  సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో  మ్యాచ్‌లో  ముంబై ఇండియన్స్‌ బ్యాట్స్‌మెన్‌ అదరగొట్టారు. ఓపెనర్‌ క్వింటన్‌ డికాక్‌(67: 39 బంతుల్లో 4ఫోర్లు, 4సిక్సర్లు) మెరుపు అర్ధశతకంతో రాణించగా, ఆఖర్లో హార్దిక్‌ పాండ్య(28: 19 బంతుల్లో 2ఫోర్లు, 2సిక్సర్లు),  పొలార్డ్‌(25.  నాటౌట్‌:  13 బంతుల్లో 3సిక్సర్లు), కృనాల్‌ పాండ్య(20 నాటౌట్:‌ 4 బంతుల్లో 2ఫోర్లు, 2సిక్సర్లు) మెరుపులతో  ముంబై 20 ఓవర్లలో 5 వికెట్లకు 208 పరుగులు చేసింది.

డెత్‌ ఓవర్లలో సన్‌రైజర్స్‌ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్‌ చేశారు.  ప్రమాదకర పాండ్య, పొలార్డ్‌ జోడీని నిలువరించారు. పేస్‌ బౌలర్‌  సిద్ధార్థ్‌ కౌల్‌ దారుణంగా తేలిపోయాడు. రెండు వికెట్లు తీసినప్పటికీ ధారళంగా పరుగులు సమర్పించుకున్నాడు. ఆఖరి ఓవర్‌లో వికెట్‌ పడగొట్టి 21 పరుగులు ఇవ్వడంతో ముంబై 200 మార్క్‌ దాటింది.   సన్‌రైజర్స్‌ బౌలర్లలో సందీప్‌ శర్మ, సిద్ధార్థ్‌ కౌల్‌ రెండు వికెట్లు తీయగా రషీద్‌ ఖాన్‌  వికెట్‌  పడగొట్టాడు. రషీద్‌ మాత్రం  చక్కటి బౌలింగ్‌తో నాలుగు  ఓవర్లలో  22 పరుగులే ఇచ్చి ప్రత్యర్థిని  కట్టడి చేశాడు. పక్కా వ్యూహం ప్రకారం బంతులు వేసిన   బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లు తీస్తూ  భాగస్వామ్యాలను విడదీశారు.  

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇన్నింగ్స్‌ను పేలవంగా ఆరంభించింది.  కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఇన్నింగ్స్‌ మొదటి ఓవర్‌లోనే వెనుదిరిగాడు. సందీప్‌ శర్మ బౌలింగ్‌లో నాలుగో బంతిని భారీ సిక్సర్‌ బాదిన హిట్‌మ్యాన్‌ తర్వాతి బంతికే వికెట్‌ కీపర్‌ బెయిర్‌స్టోకు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. వన్‌డౌన్‌లో వచ్చిన సూర్యకుమార్‌ యాదవ్‌(27) ఎక్కువసేపు నిలువలేదు. ఈ దశలో ఇషాన్‌ కిషన్‌, డికాక్‌ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. డికాక్‌ చెలరేగుతుండగా ఇషాన్‌ అతనికి మద్దతుగా నిలిచాడు. అబ్దుల్‌ సమద్‌ వేసిన ఏడో ఓవర్లో ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న  డికాక్‌... భారీ షాట్లతో విరుచుకుపడుతూ  ఫోర్లు, సిక్స్‌లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.    32 బంతుల్లో 3ఫోర్లు, 3సిక్సర్లు బాదిన డికాక్‌  సీజన్‌లో మొదటి అర్ధశతకాన్ని నమోదు చేశాడు.