గురువారం 03 డిసెంబర్ 2020
Sports - Oct 16, 2020 , 22:56:54

IPL 2020: ముంబై మళ్లీ మురిసె...

IPL 2020: ముంబై మళ్లీ మురిసె...

అబుదాబి: ఐపీఎల్‌-13లో   డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబై ఇండియన్స్‌  జైత్రయాత్ర కొనసాగుతోంది.  అన్ని విభాగాల్లో ఆధిపత్యం ప్రదర్శిస్తూ   వరుస విజయాలతో ప్రత్యర్థులకు సవాలు విసురుతోంది.   లీగ్‌లో  8 మ్యాచ్‌లాడిన రోహిత్‌ సేన ఆరో గెలుపుతో   ‘టాప్‌’లోకి వచ్చింది.  శుక్రవారం  జరిగిన పోరులో  ముంబై ఇండియన్స్‌ 8  వికెట్లతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై   గెలిచింది.

149 పరుగుల లక్ష్యాన్ని ముంబై 16.5 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది.  ఓపెనర్‌ క్వింటన్‌ డికాక్‌(78 నాటౌట్:‌  44 బంతుల్లో 9ఫోర్లు, 3సిక్సర్లు)  ఆకాశమే హద్దుగా చెలరేగి జట్టుకు అద్భుత విజయాన్నందించాడు.  కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(35: 36 బంతుల్లో 5ఫోర్లు, సిక్స్‌), హార్డిక్‌ పాండ్య(21 నాటౌట్:‌ 11బంతుల్లో 3ఫోర్లు, సిక్స్‌) రాణించారు.   బౌలింగ్‌, బ్యాటింగ్‌లో అదిరిపోయే ఆటతీరుతో  ముంబై  దుమ్మురేపింది. తొలుత బ్యాటింగ్‌లో దారుణ ప్రదర్శన చేసిన కోల్‌కతా..ఛేదనలో బౌలర్లు ముంబై జోరును  అడ్డుకోలేకపోయారు. 

అంతకుముందు మొదట బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతా 20 ఓవర్లలో 5 వికెట్లకు 148 పరుగులే చేసింది. పాట్‌ కమిన్స్‌(53 నాటౌట్:‌ 36 బంతుల్లో 5ఫోర్లు, 2సిక్సర్లు) సంచలన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. కమిన్స్‌ మెరుపు అర్ధసెంచరీకి తోడు  కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌(39 నాటౌట్‌: 29 బంతుల్లో 2ఫోర్లు, 2సిక్సర్లు) రాణించడంతో కోల్‌కతా  గౌరవప్రదరమైన స్కోరు  చేసింది.ముఖ్యంగా కమిన్స్‌ వీరవిహారం చేశాడు.   

ఆరో వికెట్‌కు కమిన్స్‌, మోర్గాన్‌ 87(56 బంతుల్లో) పరుగులు జోడించారు. 61/5తో పీకల్లోతు కష్టాల్లో పడిన జట్టుకు  వీరిద్దరూ స్ఫూర్తిదాయక ప్రదర్శన చేసి మెరుగైన స్కోరు అందించారు. రాహుల్‌ త్రిపాఠి(7), శుభ్‌మన్‌ గిల్‌(21), నితీశ్‌ రాణా(5), దినేశ్‌ కార్తీక్‌(4) దారుణంగా విఫలమయ్యారు. ముంబై బౌలర్ల ధాటికి టాప్‌ ఆర్డర్‌ పెవిలియన్‌కు కుప్పకూలింది.