e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, September 24, 2021
Home Top Slides జయహో.. పీవీ సింధుకు కాంస్యం

జయహో.. పీవీ సింధుకు కాంస్యం

ఒలింపిక్స్‌లో రెండు పతకాలు నెగ్గిన తొలి భారత మహిళగా రికార్డు
బింగ్‌ జియావోపై గెలుపు

స్వర్ణ సౌరభాలకు దూరమైనా.. మొక్కవోని దీక్షతో ముందుకు సాగిన భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు.. కాంస్య కాంతులు విరజిమ్మింది. రియో ఒలింపిక్స్‌లో రజతం నెగ్గిన తెలుగమ్మాయి.. టోక్యోలో కంచు ఖాతాలో వేసుకొని విశ్వక్రీడల్లో రెండు పతకాలు సాధించిన తొలి భారత మహిళగా చరిత్రకెక్కింది. సెమీస్‌లో తడబడిన సింధు..కాంస్య పతక పోరులో పూర్తి ఆధిపత్యం చెలాయించింది. చైనా షట్లర్‌ను కంగు తినిపిస్తూ అలవోక విజయాన్నందుకుంది.

- Advertisement -

శతకోటి భారతావని ఆశల వారధిగా టోక్యో ఒలింపిక్స్‌లో నవ శకానికి నాంది పలికింది. బ్యాడ్మింటన్‌లో సరికొత్త శిఖరాలను అధిరోహిస్తూ తనకు తానే సాటి అని నిరూపించుకుంది. అభిమానుల అంచనాలను వమ్ము చేయకుండా మువ్వన్నెల పతాకాన్ని విశ్వక్రీడా వేదికపై సగర్వంగా రెపరెపలాడించింది. టోక్యోలో మీరాబాయి వెండి వెలుగుల తర్వాత సింధు కంచు మోత మోగించింది. పురుషుల హాకీ జట్టు దాదాపు ఐదు దశాబ్దాల తర్వాత సెమీస్‌ చేరి ముందడుగు వేసింది.

టోక్యో: శతకోటి భారతావని అంచనాల భారాన్ని మోస్తూ టోక్యోలో అడుగుపెట్టిన భారత స్టార్‌ షట్లర్‌ పూసర్ల వెంకట సింధు.. కాంస్య పతకం కైవసం చేసుకుంది. ఆదివారం మూడో స్థానం కోసం జరిగిన పోరులో ప్రపంచ చాంపియన్‌ సింధు 21-13, 21-15తో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్‌ హే బింగ్‌ జియావో (చైనా)పై విజయం సాధించింది. తద్వారా ఒలింపిక్స్‌లో రెండు వ్యక్తిగత పతకాలు సాధించిన తొలి భారత మహిళగా రికార్డుల్లోకెక్కింది. సుశీల్‌ కుమార్‌ (2008లో కాంస్యం, 2012లో రజతం) తర్వాత భారత్‌ తరఫున రెండు పతకాలు నెగ్గిన రెండో అథ్లెట్‌గా నిలిచింది. ఓవరాల్‌గా ఒలింపిక్స్‌ బ్యాడ్మింటన్‌ మహిళల సింగిల్స్‌ చరిత్రలో వరుసగా రెండు పతకాలు సాధించిన నాలుగో షట్లర్‌గా సింధు చరిత్రెకెక్కింది. శనివారం జరిగిన సెమీస్‌ ఆరంభంలో ఆత్మవిశ్వాసంతో కనిపించి ఆ తర్వాత వెనుకబడ్డ సింధు.. మూడో స్థానం కోసం జరిగిన పోరులో ఎలాంటి పొరపాట్లకు తావివ్వలేదు. పదునైన స్మాష్‌లు, చురుకైన నెట్‌గేమ్‌, తిరుగులేని క్రాస్‌కోర్ట్‌ షాట్‌లు, ప్రత్యర్థిని ఒత్తిడిలో పడేసే ర్యాలీలతో విజృంభించిన 26 ఏండ్ల సింధు.. వరుస గేమ్‌లలో గెలిచి టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు రెండో పతకాన్ని అందించింది. పోటీల తొలిరోజే మీరాబాయి చాను రజతం నెగ్గిన విషయం తెలిసిందే.

అదిరే ఆటతో..
సెమీస్‌లో తైజూ యింగ్‌ చేతిలో పరాజయం నుంచి త్వరగానే తేరుకున్న సింధు.. మూడో ప్లేస్‌ కోసం జరిగిన పోరులో పూర్తి ఆధిపత్యం కనబర్చింది. తొలి గేమ్‌ ప్రారంభంలో 4-0తో ఆధిక్యంలోకి వెళ్లిన సింధు.. 11-8తో ముందంజలో నిలిచి.. అదే జోరులో గేమ్‌ సొంతం చేసుకుంది. ఇక రెండో గేమ్‌లోనూ 4-1తో ముందడుగేసిన తెలుగమ్మాయి అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకోకుండా వరుస పాయింట్లతో గేమ్‌ను చేజిక్కించుకుంది. మహిళల సింగిల్స్‌లో చెన్‌ యూ ఫీ స్వర్ణం, తైజూ యింగ్‌ రజతం గెలుచుకున్నారు.

ఆటే ప్రాణంగా..

బ్యాడ్మింటన్‌ ప్రపంచ చాంపియన్‌గా అవతరించిన భారత తొలి ప్లేయర్‌.. ఒలింపిక్స్‌లో రజతం సాధించిన మొదటి ఇండియన్‌ షట్లర్‌.. ఇలా మన తెలుగు తేజం పూసర్ల వెంకట సింధు సాధించిన ఘనతలు ఎన్నో.. మరెన్నో. టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యంతో ఆమె రికార్డుల కిరీటంలో మరో కలికితురాయి చేరింది. విశ్వక్రీడల్లో రెండు పతకాలు సాధించిన భారత తొలి మహిళా అథ్లెట్‌గా సింధు మరోసారి తన పేరిట చరిత్ర లిఖించుకుంది. క్రీడా కుటుంబం నుంచి వచ్చిన సింధు బాల్యం నుంచే బ్యాడ్మింటనే శ్వాసగా ఎదిగింది. ఆ ప్రయాణంలో ఎంతో కష్టపడింది.. పలు సవాళ్లను అధిగమించింది. ఎన్నో మైలురాళ్లను అందుకుంది..

పీవీ సింధు.. భారత అత్యంత విజయవంతమైన బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ అనడంలో అతిశయోక్తి లేదు. ఆమె సాధించిన పతకాలు, రికార్డులే దాన్ని రుజువు చేస్తున్నాయి. తెలుగమ్మాయి సింధు విజయాల వెనుక అపార శ్రమ ఉంది. ఎనిమిదేండ్ల వయసులోనే బ్యాడ్మింటన్‌ రాకెట్‌ను చేతబూనిన సింధు ఆటే ప్రాణంగా కష్టపడింది.. ఎదిగింది.. ప్రపంచాన్ని గెలిచింది. జాతీయ వాలీబాల్‌ ప్లేయర్లు పూసర్ల వెంకట రమణ, విజయ దంపతులకు 1995, జూలై 5న సింధు జన్మించింది. తల్లిదండ్రులు వాలీబాల్‌ ప్లేయర్లు అయినా బ్యాడ్మింటన్‌పై సింధు మనసు పడింది. ప్రపంచ చాంపియన్‌ అవ్వాలని చిన్నప్పటి నుంచే అప్పటి నుంచే కలలు కంటూ.. వాటిని సాకారం చేసుకునే ప్రయాణాన్ని ప్రారంభించింది. తొలుత మహబూబ్‌ అలీ వద్ద బ్యాడ్మింటన్‌లో ఓనమాలు దిద్దిన సింధు.. ఆ తర్వాత పుల్లెల గోపీచంద్‌ అకాడమీలో చేరింది. 2016 చైనా ఓపెన్‌లో గెలిచి తొలి సూపర్‌ సిరీస్‌ టైటిల్‌ దక్కించుకున్న సింధు.. ఆ తర్వాత చాలా టోర్నీల్లో విజేతగా నిలిచింది. ఓ దశలో మహిళల సింగిల్స్‌ ప్రపంచ రెండో ర్యాంకర్‌గా అవతరించింది. ముఖ్యంగా 2015 మినహా ప్రతిష్ఠాత్మక ప్రపంచ చాంపియన్‌షిప్‌ టోర్నీల్లో అడుగుపెట్టిన ప్రతీసారి సింధు పతకం పట్టింది. 2016 రియో ఒలింపిక్స్‌లో సింధు అద్భుతమే చేసింది. తుదిపోరు వరకు చేరి రజతం కైవసం చేసుకొని.. యావత్‌ భారతావని సంబురాల్లో మునిగేలా చేసింది. విశ్వక్రీడల్లో వెండిని సొంతం చేసుకున్న తొలి భారత షట్లర్‌గా చరిత్ర సృష్టించింది. ఇక 2018 కామన్వెల్త్‌ గేమ్స్‌ వ్యక్తిగత విభాగంలో అదరగొట్టిన సింధు రజతం దక్కించుకోగా.. మిక్స్‌డ్‌ విభాగంలో స్వర్ణాన్ని పట్టింది. ఇక స్విట్జర్లాండ్‌ వేదికగా 2019లో జరిగిన ప్రపంచ టోర్నీలో అమోఘమైన ఆటతో సింధు స్వర్ణం దక్కించుకుంది. సిల్వర్‌ సింధు అన్న పేరును చెరిపేసింది. జగజ్జేత హోదాలో టోక్యో ఒలింపిక్స్‌లో అడుగుపెట్టిన సింధు అదే రీతిలో ఆడింది. ఒక్క గేమ్‌ కూడా కోల్పోకుండా సెమీస్‌ వరకు చేరింది. అయితే స్టార్‌ ప్లేయర్‌ తై జూయింగ్‌ చేతిలో పరాజయం ఎదురైనా.. కాంస్య పతక పోరులో సింధు గర్జించింది. దెబ్బతిన్న పులిలా పంజా విసిరి ప్రత్యర్థి హే బింగ్‌జియావోను అలవోకగా చిత్తుచేసింది.

ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన తొలి భారత మహిళగా సింధు చరిత్రకెక్కింది. తాజా క్రీడల్లో కాంస్యం నెగ్గిన తెలుగు తేజం.. రియో (2016) ఒలింపిక్స్‌లో రజతం గెలిచింది.

టోక్యో విశ్వక్రీడల్లో ఇప్పటి వరకు భారత్‌కు మూడు పతకాలు ఖాయం కాగా.. ఆ మూడూ మహిళలు సాధించినవే కావడం విశేషం. వెయిట్‌ లిఫ్టింగ్‌లో మీరాబాయి చాను రజతం నెగ్గగా.. బ్యాడ్మింటన్‌లో సింధు కాంస్యం చేజిక్కించుకుంది. బాక్సింగ్‌లో పతకం ఖాయం చేసుకున్న లవ్లీనా బుధవారం సెమీస్‌ బరిలో దిగనుంది.

ఒలింపిక్స్‌ బ్యాడ్మింటన్‌ మహిళల సింగిల్స్‌ చరిత్రలో వరుసగా రెండు పతకాలు సాధించిన నాలుగో షట్లర్‌గా సింధు నిలిచింది

విశ్వక్రీడల్లో రెండు పతకాలు గెలిచిన తొలి భారత మహిళగా పీవీ సింధు అరుదైన ఘనత సొంతం చేసుకుంది. నిలకడ,అంకితభావం, సమర్థత విషయంలో కొత్త లక్ష్యాలను నెలకొల్పింది. భారత్‌కు ఎనలేని కీర్తి, ప్రతిష్టలు తీసుకొచ్చిన సింధుకు హృదయపూర్వక అభినందనలు.

  • రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌

టోక్యో ఒలింపిక్స్‌లో సింధు నీ అద్భుత ప్రదర్శన పట్ల మేము ఎంతో సంతోషంగా ఉన్నాం. కాంస్య పతకం గెలిచినందుకు నీకు ప్రత్యేక అభినందనలు. భారత కీర్తిపతాక సింధు. అతి కొద్ది మంది విశిష్ట ఒలింపియన్లలో ఆమెది ఒక స్థానం.

  • ప్రధాని నరేంద్ర మోదీ

విశ్వక్రీడల మహిళల బ్యాడ్మింటన్‌ సింగిల్స్‌లో కాంస్య పతకంతో మెరిసిన పీవీ సింధుకు అభినందనలు. వరుసగా రెండు ఒలింపిక్స్‌ల్లో పతకాలు సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా సింధు చరిత్ర సృష్టించడం హర్షణీయం.

  • సీఎం కేసీఆర్‌

ఒలింపిక్స్‌లో కాంస్య మెరుపులు మెరిపించిన సింధుకు శుభాకాంక్షలు. వరుసగా రెండు ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన తొలి భారత మహిళ అథ్లెట్‌గా చరిత్ర సృష్టించిన సింధు భారత్‌కు గర్వకారణం. నీ విజయాలు ఎందరికో స్ఫూర్తిదాయకం.

  • గవర్నర్‌ తమిళిసై

సింధుకు ప్రముఖుల అభినందనలు
హైదరాబాద్‌, ఆగస్ట్‌1(నమస్తే తెలంగాణ): స్టార్‌ షట్లర్‌ పీవీ సింధుకు రాష్ట్ర క్రీడా, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఒలింపిక్స్‌లో వరుసగా రెండోసారి పతకం గెలిచిన భారత తొలి మహిళగా రికార్డు సృష్టించడంపై హర్షం వ్యక్తం చేశారు. అదేవిధంగా ఎంపీ రంజిత్‌రెడ్డి, సాట్స్‌ చైర్మన్‌ వెంకటేశ్వర్‌రెడ్డి సింధుకు శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana