శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Sports - Jan 20, 2020 , 02:43:23

పీబీఎల్‌కు వేళాయె..

పీబీఎల్‌కు వేళాయె..
  • నేటి నుంచి ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌ ఐదో సీజన్‌

చెన్నై: అంతర్జాతీయ స్టార్లతో పాటు యువ ఆటగాళ్లు తలపడే ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌ (పీబీఎల్‌) ఐదో సీజన్‌కు సర్వం సిద్ధమైంది. సోమవారం లీగ్‌ ప్రారంభం కానుండగా.. తొలి రోజు పోటీల్లో హైదరాబాద్‌ హంటర్స్‌, చెన్నై సూపర్‌ స్టార్స్‌ జట్లు తలపడనున్నాయి. ‘టై’లో భాగంగా ప్రపంచ చాంపియన్‌, హంటర్స్‌ ప్లేయర్‌ పీవీ సింధు.. బ్యాడ్మింటన్‌ జాతీయ కోచ్‌ గోపీచంద్‌ కుమార్తె పుల్లెల గాయత్రి మధ్య ఆసక్తికర మ్యాచ్‌ జరుగనుంది. హైదరాబాద్‌ తరఫున సౌరభ్‌ వర్మ, డారెన్‌ లీ (మలేసియా), భారత వర్ధమాన ఆటగాడు కిరణ్‌ జార్జ్‌ పోటీకి దిగనున్నారు. గతేడాది ఐదు టైటిళ్లతో సత్తాచాటిన భారత యువ ఆటగాడు లక్ష్యసేన్‌తో పాటు పురుషుల డబుల్స్‌ స్టార్‌ జోడీ సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ శెట్టి చెన్నై తరఫున రాకెట్‌ పట్టనుంది. లీగ్‌లో మొత్తం ఏడు జట్లు పోటీ పడుతుండగా.. ప్రపంచ నంబర్‌ వన్‌ తైజూ ఇంగ్‌ (చైనీస్‌ తైపీ) బెంగళూరు రాప్టర్స్‌ తరఫున బరిలో దిగనుంది. సైనా, శ్రీకాంత్‌ ఈ సీజన్‌కు దూరంగా ఉన్నారు.


logo