శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Sports - Jan 29, 2021 , 02:26:21

కథ ముగిసె..

కథ ముగిసె..

  • సింధు, శ్రీకాంత్‌కు వరుసగా రెండో ఓటమి
  • వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌ నాకౌట్‌ బరి నుంచి ఔట్‌

బ్యాంకాక్‌: భారత స్టార్‌ షట్లర్లు పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్‌ వరుస పరాజయాలతో ప్రతిష్టాత్మక బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌ నాకౌట్‌ రేసు నుంచి తప్పుకున్నారు. గురువారం జరిగిన మహిళల సింగిల్స్‌ పోరులో పీవీ సింధు 18-21, 13-21తో మూడో సీడ్‌ రచనోక్‌ ఇంతనోన్‌ (థాయ్‌లాండ్‌) చేతిలో.. పురుషుల సింగిల్స్‌ విభాగంలో శ్రీకాంత్‌ 21-19, 9-21, 19-21తో వాంగ్‌ జూ వుయ్‌ (చైనీస్‌ తైపీ) చేతిలో ఓటమి పాలయ్యారు. ఈ టోర్నీ తొలి మ్యాచ్‌లో తుదికంటా పోరాడిన సింధు.. రెండో పోరులో ఆ సీన్‌ రిపీట్‌ చేయలేకపోయింది. మొదటి గేమ్‌ నెగ్గి మంచి జోరు మీద కనిపించిన శ్రీకాంత్‌ ఆ తర్వాత వరుసగా రెండు గేమ్‌లు కోల్పోయి నిరాశ పరిచాడు. ‘తొలి గేమ్‌ చేజారడం దెబ్బ కొట్టింది. ఇది నా రోజు కాదు. ఫలితంతో నిరాశ చెందా’అని మ్యాచ్‌ అనంతరం సింధు పేర్కొనగా.. ‘ఏడాది కాలంగా సరైన మ్యాచ్‌ ప్రాక్టీస్‌ లేదు. అగ్రశ్రేణి ఆటగాళ్లతో వరుసగా ఆడితేనే టెక్నిక్‌ మెరుగు పర్చుకోగలం. మూడో గేమ్‌లో అధిక శాతం ప్రత్యర్థిపై పైచేయి కొనసాగించా’అని శ్రీకాంత్‌ అన్నాడు. గ్రూప్‌లో అగ్రస్థానంలో నిలిచిన ఇద్దరు ప్లేయర్లు మాత్రమే సెమీఫైనల్‌కు చేరే అవకాశం ఉండగా.. వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడిన సింధు, శ్రీకాంత్‌కు సెమీస్‌ ద్వారాలు మూసుకుపోయాయి. నామమాత్రమైన చివరి మ్యాచ్‌లో శుక్రవారం చోచువాంగ్‌ (థాయ్‌లాండ్‌)తో సింధు.. లాంగ్‌ అంగుస్‌తో శ్రీకాంత్‌ తలపడనున్నారు. 

శ్రీకాంత్‌ పోరాడినా..

పురుషుల విభాగంలో వాంగ్‌ జూ వుయ్‌, శ్రీకాంత్‌ హోరాహోరీగా తలపడటంతో మ్యాచ్‌ రసవత్తరంగా సాగింది. నువ్వా నేనా అన్నట్లు సాగిన తొలి గేమ్‌లో కిడాంబి పైచేయి సాధించగా.. రెండో గేమ్‌లో చైనీస్‌ తైపీ ఆటగాడు విజృంభించాడు. శ్రీకాంత్‌కు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా ఆరంభం నుంచి ఆధిక్యం ప్రదర్శించాడు. 9-5, 11-5, 16-6తో ముందుకు సాగి మ్యాచ్‌ను 1-1తో సమం చేశాడు. ఇక మూడో గేమ్‌లో ఇరువురు ఆటగాళ్లు పోరాడినా.. కీలక సమయాల్లో ఒత్తిడిని జయించిన వాంగ్‌ జూ వుయ్‌నే విజయం వరించింది.నిరాశపర్చిన సింధు..

వారం రోజుల క్రితం థాయ్‌లాండ్‌ ఓపెన్‌లో రచనోక్‌ చేతిలో పరాజయం పాలైన ప్రపంచ చాంపియన్‌ పీవీ సింధు.. మ్యాచ్‌ ఆరంభంలో దానికి బదులు తీర్చుకునేలా కనిపించింది. ఒక దశలో 11-6తో తొలి గేమ్‌ను సొంతం చేసుకోవడం ఖాయమే అనిపించినా.. థాయ్‌ అమ్మాయి దీటుగా బదులిచ్చింది. వరుసగా నాలుగు పాయింట్లు సాధించి 14-14తో స్కోరు సమం చేసింది. ఆ తర్వాత కూడా అదే జోరు కొనసాగిస్తూ గేమ్‌ను సొంతం చేసుకుంది. ఇక రెండో గేమ్‌ ఆరంభంలో రచనోక్‌కు పోటీనిచ్చిన సింధు.. ఒక్కసారి లయ కోల్పోయాక అప్పనంగా పాయింట్లు ఇచ్చేసింది. 

VIDEOS

logo