శనివారం 28 నవంబర్ 2020
Sports - Oct 15, 2020 , 21:17:15

పోరాడిన విరాట్‌ కోహ్లీ.. బెంగళూరు స్కోరు 171

  పోరాడిన విరాట్‌ కోహ్లీ.. బెంగళూరు స్కోరు  171

షార్జా:  కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌తో మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు 20 ఓవర్లలో 6 వికెట్లకు 171 పరుగులు చేసింది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ(48: 39 బంతుల్లో 3ఫోర్లు) ఒక్కడే ఒంటరి పోరాటం చేయడంతో  పోరాడే స్కోరు సాధించింది.   ఆఖర్లో క్రిస్‌ మోరీస్‌(25 నాటౌట్‌: 8బంతుల్లో ఫోర్ 3సిక్సర్లు) ధనాధన్‌  బ్యాటింగ్‌తో జట్టు స్కోరును 170 దాటించాడు.  అరోన్‌ ఫించ్‌(20), శివమ్‌ దూబే(23) ఫర్వాలేదనిపించారు.  పంజాబ్‌ బౌలర్లలో మహ్మద్‌ షమి(2/45), మురుగన్‌ అశ్విన్‌(2/23) బెంగళూరును కట్టడి చేశారు. 

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరుకు ఓపెనర్లు ఫించ్‌, దేవదత్‌ పడిక్కల్‌ శుభారంభం అందించారు.  పంజాబ్‌ బౌలర్లను ధాటిగా ఎదుర్కొంటూ స్వేచ్చగా పరుగులు సాధించారు. వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ రన్స్‌ రాబట్టారు. 4 ఓవర్లకు ఆర్‌సీబీ 38/0తో నిలిచింది.   తొలి వికెట్‌కు 38 పరుగులు జోడించి జోరుమీదున్న వీరి భాగస్వామ్యాన్ని అర్షదీప్‌ సింగ్‌  విడదీశాడు.

అర్షదీప్‌ వేసిన ఐదో ఓవర్‌ మొదటి బంతికే పడిక్కల్(18)‌..పూరన్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన   కోహ్లీ రెండు ఫోర్లు బాది 11 పరుగులు సాధించాడు.  పవర్‌ప్లేలో  బెంగళూరు వికెట్ నష్టానికి 57 పరుగులు చేసింది.    మురుగన్‌ అశ్విన్‌ వేసిన ఏడో ఓవర్‌ రెండో బంతికి బౌండరీ బాదిన  ఫించ్‌  తర్వాతి బంతికే బౌల్డయ్యాడు. దీంతో బెంగళూరు 62 పరుగుల వద్ద రెండో వికెట్‌ కోల్పోయింది. 

బ్యాటింగ్‌ ఆర్డర్‌లో డివిలియర్స్‌ను ఆఖర్లో పంపిన బెంగళూరు మూల్యం చెల్లించుకుంది.   ఏబీడీ కన్నా ముందు బ్యాటింగ్‌కు వచ్చిన వాషింగ్టన్‌ సుందర్‌, శివమ్‌ దూబే చెప్పుకోదగ్గస్థాయిలో రాణించలేకపోయారు. మధ్య ఓవర్లలో పంజాబ్‌ బౌలర్లు బ్యాట్స్‌మెన్‌కు చుక్కలు చూపించారు. దీంతో విరాట్‌ కూడా వికెట్‌ కాపాడుకుంటూ జాగ్రత్తగా ఆడారు. చివర్లో డివిలియర్స్‌ విజృంభించి స్కోరు బోర్డు పరుగులు పెట్టిస్తాడని బెంగళూరు భావించింది. 

మహ్మద్‌ షమి వేసిన 18వ ఓవర్‌లో డివిలియర్స్‌(2), విరాట్‌ కోహ్లీ  ఔటయ్యారు. మూడో బంతికి డివిలియర్స్‌.. దీపక్‌ హూడా చేతికి చిక్కగా, ఐదో బంతికి కోహ్లీ వికెట్‌ కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చి   పెవిలియన్‌ చేరాడు.  దీంతో  బెంగళూరు  137/6తో కష్టాల్లో పడింది.   షమి వేసిన  20వ ఓవర్‌లో   మోరీస్‌  రెండు సిక్సులు, ఒక ఫోర్‌ కొట్టగా.. ఇసురు ఉడాన(10) ఒక సిక్సర్‌ బాదడంతో    24 పరుగులు వచ్చాయి.