శనివారం 28 నవంబర్ 2020
Sports - Oct 26, 2020 , 21:19:42

KKR vs KXIP: శుభ్‌మన్‌, మోర్గాన్‌ మెరుపులు

KKR vs KXIP: శుభ్‌మన్‌, మోర్గాన్‌ మెరుపులు

షార్జా: కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌తో మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన  కోల్‌కతా నైట్‌రైడర్స్‌  గౌరవప్రద స్కోరు చేసింది.  పంజాబ్‌ బౌలర్లు మహ్మద్‌ షమీ(3/35), రవి బిష్ణోయ్‌(2/20), క్రిస్‌ జోర్డాన్‌(2/25) దెబ్బకు కోల్‌కతా బ్యాట్స్‌మెన్‌ వరుస విరామాల్లో పెవిలియన్‌ చేరారు.  ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌(57: 45 బంతుల్లో 3ఫోర్లు, 4సిక్సర్లు) అర్ధశతకానికి తోడు కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌(40: 25  బంతుల్లో 5ఫోర్లు, 2సిక్సర్లు ) రాణించడంతో    20 ఓవర్లలో 9 వికెట్లకు 149  పరుగులు  చేసింది. 

నితీశ్‌ రాణా, దినేశ్‌ కార్తీక్‌ డకౌట్‌ కాగా రాహుల్‌ త్రిపాఠి, సునీల్‌ నరైన్‌, కమ్లేశ్‌ నాగర్‌కోటి, పాట్‌ కమిన్స్‌ కనీసం రెండంకెల స్కోరు కూడా చేయలేకపోయారు. ఇన్నింగ్స్‌ ఆఖరి   వరకు క్రీజులో ఉన్న గిల్‌ స్ఫూర్తిదాయక ప్రదర్శన చేయగా..చివర్లో ఫెర్గుసన్‌(23 నాటౌట్‌: 13 బంతుల్లో 3ఫోర్లు, సిక్స్‌) మెరుపులు  మెరిపించడంతో   కోల్‌కతా పోరాడే స్కోరు సాధించింది.   

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతాకు తొలి ఓవర్‌లోనే ఎదురుదెబ్బ తగిలింది. మాక్స్‌వెల్‌ వేసిన ఇన్నింగ్స్‌ రెండో బంతికి నితీశ్‌ రాణా   గోల్డెన్‌ డక్‌గా వెనుదిరిగాడు.  రెండో ఓవర్లో  షమీ రెండు వికెట్లు  పడగొట్టాడు.  నాలుగో బంతికి  రాహుల్‌ త్రిపాఠి (7)   ఔటయ్యాడు.    ఆప్పుడే క్రీజులోకి వచ్చిన దినేశ్‌ కార్తీక్‌(0) ఆరో బంతికి పెవిలియన్‌  చేరడంతో  కోల్‌కతా కష్టాల్లో పడింది.  ఈ దశలో క్రీజులో ఉన్న ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌, కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ ఇన్నింగ్స్‌ను ముందుండి నడిపిస్తున్నారు.

షమీ వేసిన ఆరో ఓవర్లో మోర్గాన్‌ రెండు ఫోర్లు బాదగా..గిల్‌ రెండు  భారీ సిక్సర్లు కొట్టడంతో 21 పరుగులు వచ్చాయి. 10/3తో కష్టాల్లో ఉన్న జట్టును మోర్గాన్‌ ఆదుకున్నాడు. గిల్‌ సహకారం  అందించడంతో బౌండరీలతో చెలరేగాడు. గిల్‌, మోర్గాన్‌ ఎదురుదాడికి దిగడంతో  9 ఓవర్లకు 82/3తో పటిష్ఠస్థితిలో నిలిచింది. బిష్ణోయ్‌ వేసిన 10వ ఓవర్లో మోర్గాన్‌ ఔటవడంతో కోల్‌కతా స్కోరు తగ్గింది.  వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 81 పరుగులు జోడించారు.  పంజాబ్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో బ్యాట్స్‌మెన్‌ ఎక్కువసేపు నిలువలేదు.