మంగళవారం 01 డిసెంబర్ 2020
Sports - Oct 15, 2020 , 16:36:14

IPL 2020: గెలిస్తేనే నిలిచేది.. ఒత్తిడిలో పంజాబ్‌

IPL 2020: గెలిస్తేనే నిలిచేది.. ఒత్తిడిలో  పంజాబ్‌

షార్జా: ఐపీఎల్‌-13లో  కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ జట్టు   కీలక మ్యాచ్‌కు సిద్ధమవుతోంది.   ప్లే ఆఫ్స్‌ అవకాశాలను సంక్లిష్టం చేసుకున్న పంజాబ్‌..వరుస  విజయాలతో జోరుమీదున్న రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమైంది.   బెంగళూరుతో  జరిగే మ్యాచ్‌లో  పంజాబ్‌ కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి నెలకొంది.  ఈ మ్యాచ్‌లో ఓడితే ప్లేఆఫ్స్‌ బెర్తు అవకాశాలను  కోల్పోతుంది. కేఎల్‌ రాహుల్‌ సారథ్యంలోని పంజాబ్‌ జట్టు వరుస ఓటములతో   తీవ్రంగా నిరుత్సాహపరిచింది.  

 ఇవాళ్టి మ్యాచ్‌లో  పంజాబ్‌ విధ్వంసకర ఓపెనర్‌ క్రిస్‌  గేల్‌ బరిలో దిగనున్నాడు. ఈ పోరులో తప్పక గెలవాల్సి  ఉండటంతో గేల్‌ నుంచి భారీ ఇన్నింగ్స్‌ను ఆశిస్తోంది టీమ్‌ మేనేజ్‌మెంట్‌.   షార్జాలో  అతడు బ్యాట్‌ ఝుళిపిస్తే  బెంగళూరు బౌలర్లకు కష్టాలు తప్పవు.  సమిష్టి ప్రదర్శనతో వరుస  విజయాలతో  కోహ్లీసేన జోష్‌లో ఉంది. ఇదే ఆత్మవిశ్వాసంతో  ప్లేఆఫ్స్‌ అవకాశాలను మరింత మెరుగుపరచుకోవాలని కోహ్లీసేన భావిస్తోంది.   వరుస విజయాలతో భీకరంగా కనిపిస్తున్న విరాట్‌ కోహ్లీ కెప్టెన్సీలోని బెంగళూరును పంజాబ్‌ ఎలా అడ్డుకుంటుందో చూడాలి.  

పంజాబ్ సీజన్‌లో ఇప్పటి వరకు ఏడు మ్యాచ్‌లు  ఆడగా ఆరు ఓడిపోయి పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో ఉంది.   సెప్టెంబర్‌ 24న జరిగిన  తమ తొలి పోరులో బెంగళూరుపై పంజాబ్‌  ఘన విజయం సాధించింది. అదే ఆత్మవిశ్వాసంతో ఈ మ్యాచ్‌లో గెలిచి గాడిన పడాలని రాహుల్‌సేన భావిస్తోంది.  పాయింట్ల పట్టికలో బెంగళూరు(5గెలుపు, 2ఓటమి) మూడో స్థానంలో కొనసాగుతోంది.