గురువారం 01 అక్టోబర్ 2020
Sports - Aug 26, 2020 , 00:11:07

టిక్‌టాకర్లే ముఖ్యమా..!

టిక్‌టాకర్లే ముఖ్యమా..!

  • వారికి డబ్బు ఇచ్చి.. మమ్మల్ని మరిచారు.. పంజాబ్‌ ప్రభుత్వంపై సిమ్రన్‌ అసంతృప్తి 

న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన స్టార్‌ బాక్సర్‌ సిమ్రన్‌జిత్‌ కౌర్‌ పంజాబ్‌ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆర్థిక కష్టాల్లో ఉన్న తనకు సీఎం అమరీందర్‌ సింగ్‌ ఐదు నెలల క్రితం ఇచ్చిన హామీలు ఏవీ నెరవేరలేదని తెలిపింది. టిక్‌టాక్‌ స్టార్లకు సమయానికి డబ్బు ఇచ్చిన ప్రభుత్వం.. తనకు ఇచ్చిన మాటను మాత్రం నెరవేర్చలేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఒలింపిక్స్‌కు జనవరిలో సిమ్రన్‌ అర్హత సాధించగా.. ఆమె ఆర్థిక పరిస్థితిని మీడియా ద్వారా తెలుసుకున్న సీఎం.. అన్ని విధాలా సాయం అందించాలని అధికారులను ట్విట్టర్‌ వేదికగా ఆదేశించారు.

 ఐదు నెలలు గడిచినా ఎలాంటి సాయం అందకపోవడంతో మంగళవారం ఓ ఇంటర్వ్యూలో సిమ్రన్‌జిత్‌ ఆవేదన వ్యక్తం చేసింది. ‘పంజాబ్‌ ప్రభుత్వం ఎలాంటి విషయాలను పరిగణనలోకి తీసుకుంటున్నదో నాకు తెలియదు. నాకు రూ.5 లక్షల సాయం చేస్తామన్నారు. కానీ ఇంతవరకు జరుగలేదు. టిక్‌టాక్‌ స్టార్లకు మాత్రం ప్రభుత్వం సమయానికి డబ్బులు ఇచ్చింది. మార్చిలో ముఖ్యమంత్రిని కలిసినప్పుడు ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ ఎవరు పట్టించుకున్నారు? నాకు ఇంతవరకు ఎలాంటి రాతపూర్వక హామీ లభించలేదు. ఒక్క పత్రం కూడా అందలేదు. లాక్‌డౌన్‌ వల్ల అంతా స్తంభించిపోయింది. నాకు ఉద్యోగం అత్యవసరం. వాళ్లు అర్థం చేసుకోవాలి’ అని సిమ్రన్‌జిత్‌ కౌర్‌ చెప్పింది. 


logo