మంగళవారం 01 డిసెంబర్ 2020
Sports - Oct 19, 2020 , 02:31:55

సూపరో సూపర్‌

సూపరో సూపర్‌

  • డబుల్‌ సూపర్‌ ఓవర్‌లో పంజాబ్‌ పైచేయి..
  • ముంబై జైత్రయాత్రకు బ్రేక్‌

ఆహా.. ఏమా మ్యాచ్‌లు.. ఏమా ఆట.. ఏమా ఉత్కంఠ.. సీజన్‌లో ఒక్క సూపర్‌ ఓవర్‌ చూస్తేనే పండుగ చేసుకునే అభిమానులకు ఆదివారం బిర్యానీ విత్‌ డబుల్‌ కా మీఠా లాగా.. సూపర్‌ మీద సూపర్‌ ఓవర్‌లు కనువిందు చేశాయి. హైదరాబాద్‌ కోల్‌కతాల మధ్య జరిగిన మ్యాచ్‌ సూపర్‌ ఓవర్‌లో ఫలితం తేలితే.. ముంబై, పంజాబ్‌ మధ్య జరిగిన పోరైతే అరాచకానికి అర్థం మార్చింది. తొలుత ఇరు జట్ల స్కోర్లు సమమవడంతో.. సూపర్‌ ఓవర్‌ నిర్వహించగా.. ఊహించని విధంగా అది కూడా టై అయింది. దీంతో మరోసారి నిర్వహించిన సూపర్‌ ఓవర్‌లో క్రిస్‌ గేల్‌, మయాంక్‌ అగర్వాల్‌ రెచ్చిపోవడంతో.. పంజాబ్‌ జయభేరి మోగించింది. మ్యాచ్‌లను చివరి వరకు తెచ్చి ప్రేక్షకులకు హార్ట్‌ ఎటాక్‌ తెప్పించకండని.. కింగ్స్‌ ఎలెవన్‌ యజమాని ప్రీతి జింటా వేడుకుంటుంటే.. పంజాబ్‌ మాత్రం అభిమానుల గుండెలు అరచేతిలోకి తెచ్చి మ్యాచ్‌కు అద్వితీయ ముగింపునిచ్చింది. 13వ సీజన్‌ సాగుతున్న కొద్ది సమీకరణాలు మారిపోతున్న తరుణంలో.. ప్లే ఆఫ్స్‌కు వెళ్లడం ఇక కష్టమే అనుకున్న పంజాబ్‌ వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి చేరితే.. ఐదు వరుస విజయాలతో జెట్‌ స్పీడ్‌తో దూసుకెళ్తున్న ముంబై ఎక్స్‌ప్రెస్‌కు బ్రేకులు పడ్డాయి.

దుబాయ్‌: సూపర్‌ ఓవర్‌ మీద సూపర్‌ ఓవర్‌ జరిగిన సండే బ్లాక్‌బస్టర్‌ మ్యాచ్‌లో చివరకు పంజాబ్‌దే పైచేయి అయింది. నిర్ణీత ఓవర్లలో ఇరు జట్లు సమాన స్కోర్లు చేయగా.. ఫలితం తేలేందుకు నిర్వహించిన సూపర్‌ ఓవర్‌ కూడా ‘టై’ అయింది. మొదట బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ బుమ్రా ధాటికి కేవలం 5 పరుగులే చేయగలిగితే.. ఆ తర్వాత షమీ ధాటికి ముంబై కూడా సరిగ్గా అన్నే పరుగులు చేసింది. గతేడాది వన్డే ప్రపంచకప్‌ ఫైనల్‌ను తలపించేలా సాగిన పోరులో మరో సూపర్‌ ఓవర్‌ నిర్వహించగా.. ఈ సారి మొదట బ్యాటింగ్‌ చేసిన ముంబై.. పొలార్డ్‌ ధాటిగా ఆడటంతో 11 పరుగులు చేసింది. ఈ సారి పంజాబ్‌ యూనివర్సల్‌ బాస్‌ గేల్‌, మయాంక్‌ను బరిలో దించగా.. వీరిద్దరూ విజృంభించి నాలుగు బంతుల్లోనే మ్యాచ్‌ను ముగించారు. అంతకుముందు మొదట బ్యాటింగ్‌ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 176 పరుగులు చేసింది. క్వింటన్‌ డికాక్‌ (43 బంతుల్లో 53; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధశతకం బాదగా.. పొలార్డ్‌ (12 బంతుల్లో 34 నాటౌట్‌; ఒక ఫోర్‌, 4 సిక్సర్లు), కూల్టర్‌నీల్‌ (12 బంతుల్లో 24 నాటౌట్‌; 4 ఫోర్లు) మెరుపులు మెరిపించారు. పంజాబ్‌ బౌలర్లలో షమీ, అర్శ్‌దీప్‌ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో పంజాబ్‌ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి సరిగ్గా 176 పరుగులే చేసింది. కెప్టెన్‌ లోకేశ్‌ రాహుల్‌ (51 బంతుల్లో 77; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) ఒంటరి పోరాటం చేశాడు. ముంబై బౌలర్లలో బుమ్రా 3, రాహుల్‌ చాహర్‌ 2 వికెట్లు పడగొట్టారు. 

అతనొక్కడే..

ఛేజింగ్‌లో మయాంక్‌ అగర్వాల్‌ (11) త్వరగానే ఔటైనా.. లోకేశ్‌ రాహుల్‌ దంచికొట్టాడు. బౌల్ట్‌ వేసిన మూడో ఓవర్‌లో 4,4,6,4తో విజృంభించిన రాహుల్‌.. ఆరో ఓవర్‌లో 6,4 అరుసుకున్నాడు. ఫలితంగా పవర్‌ప్లే ముగిసే సరికి పంజాబ్‌ 51/1తో నిలిచింది. గేల్‌ (24; ఒక ఫోర్‌, 2 సిక్సర్లు), పూరన్‌ (12 బంతుల్లో 24; 2 ఫోర్లు, 2 సిక్సర్లు)లకు మంచి ఆరంభాలు లభించినా వాటిని భారీ ఇన్నింగ్స్‌లుగా మలచలేకపోయారు. ఒకవైపు వికెట్లు పడుతున్నా.. జోరు సాగించిన రాహుల్‌ 35 బంతుల్లో సీజన్‌లో ఐదో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. మ్యాక్స్‌వెల్‌ (0) మరోసారి నిరాశ పరిచాడు. 16 బంతుల్లో 24 పరుగులు చేయాల్సిన దశలో బుమ్రా 149 కిలోమీటర్ల వేగంతో వేసిన యార్కర్‌కు రాహుల్‌ బౌల్డ్‌ అయ్యాడు. ఆఖర్లో హుడా (23 నాటౌట్‌), జోర్డాన్‌ (13) విలువైన పరుగులతో మ్యాచ్‌ను టై చేశారు. 

చివర్లో వాయువేగం..

టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ ఎంచుకున్న ముంబైకి శుభారంభం దక్కలేదు. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (9) మూడో ఓవర్‌లోనే పెవిలియన్‌ బాటపట్టగా.. సూర్యకుమార్‌ యాదవ్‌ (0) విఫలమయ్యాడు. కాసేపటికే ఇషాన్‌ కిషన్‌ (7) కూడా ఔట్‌ కావడంతో ముంబై 38 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో కృనాల్‌ పాండ్యా (34), డికాక్‌ ఇన్నింగ్స్‌ను నడిపించారు. అడపాదడపా బౌండ్రీలు బాదిన ఈ జంట నాలుగో వికెట్‌కు 58 పరుగులు జోడించింది. అయితే ఆశించినంత వేగంగా పరుగులు చేయలేకపోవడంతో రన్‌రేట్‌ మందగించింది. కృనాల్‌ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన హార్దిక్‌ పాండ్యా (8) ఎక్కువసేపు నిలువలేకపోయాడు. అర్ధశతకం తర్వాత డికాక్‌ కూడా ఔట్‌ కాగా.. ఆఖర్లో పొలార్డ్‌, కూల్టర్‌నీల్‌ స్కోరు బోర్డుకు బుల్లెట్‌ వేగాన్నిచ్చారు. అర్శ్‌దీప్‌ వేసిన 18వ ఓవర్‌లో పొలార్డ్‌ రెండు భారీ సిక్సర్లు బాదితే.. కూల్టర్‌నీల్‌ రెండు ఫోర్లు అరుసుకున్నాడు. షమీ వేసిన మరుసటి ఓవర్‌లో కూల్టర్‌నీల్‌ మరో రెండు ఫోర్లు కొట్టాడు. ఇక చివరి ఓవర్‌లో పొలార్డ్‌ రెండు సిక్సర్లు, ఓ ఫోర్‌ అందుకోవడంతో ముంబై మంచి స్కోరు చేయగలిగింది. వీరిద్దరి ధాటికి చివరి మూడు ఓవర్లలో ముంబై 54 పరుగులు పిండుకుంది.

 క్రికెట్‌ చరిత్రలో ఒక్క మ్యాచ్‌లో రెండు సూపర్‌ ఓవర్లు జరుగడం ఇదే తొలిసారి.

స్కోరు బోర్డు

ముంబై: రోహిత్‌ (బి) అర్శ్‌దీప్‌ 9, డికాక్‌ (సి) మయాంక్‌ (బి) జోర్డాన్‌ 53, సూర్యకుమార్‌ (సి) మురుగన్‌ (బి) షమీ 7, ఇషాన్‌ (సి) మురుగన్‌ (బి) అర్శ్‌దీప్‌ 7, కృనాల్‌ (సి) హుడా (బి) రవి 34, హార్దిక్‌ (సి) పూరన్‌ (బి) షమీ 8, పొలార్డ్‌ (నాటౌట్‌) 34, కూల్టర్‌నీల్‌ (నాటౌట్‌) 24, ఎక్స్‌ట్రాలు: 7, మొత్తం: 20 ఓవర్లలో 176/6. వికెట్ల పతనం: 1-23, 2-24, 3-38, 4-96, 5-116, 6-119, బౌలింగ్‌: మ్యాక్స్‌వెల్‌ 4-0-24-0, షమీ 4-0-30-2, అర్శ్‌దీప్‌ 3-0-35-2, జోర్డాన్‌ 3-0-32-1, మురుగన్‌ అశ్విన్‌ 3-0-28-0, హుడా 1-0-9-0, రవి 2-0-12-1.

పంజాబ్‌: రాహుల్‌ (బి) బుమ్రా 77, మయాంక్‌ (బి) బుమ్రా 11, గేల్‌ (సి) బౌల్ట్‌ (బి) రాహుల్‌ చాహర్‌ 24, పూరన్‌ (సి) కూల్టర్‌నీల్‌ (బి) బుమ్రా 24, మ్యాక్స్‌వెల్‌ (సి) రోహిత్‌ (బి) రాహుల్‌ చాహర్‌ 0, హుడా (నాటౌట్‌) 23, జోర్డాన్‌ (రనౌట్‌) 13, ఎక్స్‌ట్రాలు: 0, మొత్తం: 00 ఓవర్లలో 000/0. వికెట్ల పతనం: 1-33, 2-75, 3-108, 4-115, 5-153, 6-176, బౌలింగ్‌: బౌల్ట్‌ 4-0-48-0, కృనాల్‌ 2-0-12-0, బుమ్రా 4-0-24-3, కూల్టర్‌నీల్‌ 4-0-33-0, పొలార్డ్‌ 2-0-26-0, రాహుల్‌ చాహర్‌ 4-0-33-2.