బుధవారం 28 అక్టోబర్ 2020
Sports - Sep 22, 2020 , 03:02:22

‘షార్ట్‌ రన్‌'పై పంజాబ్‌ ఫిర్యాదు

 ‘షార్ట్‌ రన్‌'పై పంజాబ్‌ ఫిర్యాదు

దుబాయ్‌: టెక్నాలజీ పెరిగినా..క్రికెట్‌లో తప్పులు దొర్లుతూనే ఉన్నాయి. నువ్వానేనా అన్నట్లు ఆఖరి వరకు హోరాహోరీగా సాగిన ఢిల్లీ, పంజాబ్‌ మ్యాచ్‌లో అంపైర్‌ నితిన్‌ మీనన్‌ నిర్ణయమే దీనికి ఉదాహరణ. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో రబాడ వేసిన 19వ ఓవర్‌ మూడో బంతికి పంజాబ్‌ బ్యాట్స్‌మన్‌ జోర్డాన్‌ బ్యాట్‌..క్రీజును తాకలేదన్న ఉద్దేశంతో పరుగును అంపైర్‌ మీనన్‌ పరిగణనలోకి తీసుకోలేదు. ఆఖరి ఓవర్లో విజయానికి 13 పరుగులు అవసరమైన దశలో పంజాబ్‌ 12 పరుగులకే పరిమితం కావడంతో మ్యాచ్‌ సూపర్‌ ఓవర్‌కు దారితీసింది. గెలిచే మ్యాచ్‌ను పంజాబ్‌ చేజార్చుకుంది. దీంతో అంపైర్‌ మీనన్‌ తప్పుడు నిర్ణయాన్ని మ్యాచ్‌ రిఫరీకి ఫిర్యాదు చేసేందుకు పంజాబ్‌ సిద్ధమైంది.

 ‘అంపైర్‌ నిర్ణయాన్ని మ్యాచ్‌ రిఫరీ దృష్టికి తీసుకెళుతాం. మానవ తప్పిదాలు జరుగవచ్చు. కానీ ప్రపంచ స్థాయి టోర్నీ అయిన ఐపీఎల్‌లో ఇలాంటి వాటికి ఆస్కారం లేదు. ఒక్క పరుగు మా ప్లేఆఫ్స్‌ అవకాశాలపై ప్రభావం చూపించవచ్చు’అని జట్టు సీఈవో సతీశ్‌ మీనన్‌ అన్నారు. ఇదిలా ఉంటే..అంపైర్‌ నిర్ణయాన్ని మాజీ క్రికెటర్లు సెహ్వాగ్‌, మంజ్రేకర్‌, ఆకాశ్‌ చోప్రా, టామ్‌ మూడీ తప్పుబడుతూ ట్వీట్లు చేశారు. 


logo