బుధవారం 25 నవంబర్ 2020
Sports - Oct 02, 2020 , 21:19:17

IPL 2020: చెన్నై బౌలర్లకు చుక్కలు చూపించిన ప్రియం గార్గ్‌

IPL 2020: చెన్నై  బౌలర్లకు చుక్కలు చూపించిన ప్రియం గార్గ్‌

దుబాయ్:  ఐపీఎల్‌-13లో యువ భారత ఆటగాళ్లు అంచనాల్ని మించి రాణిస్తున్నారు.  తాజాగా  చెన్నై సూపర్‌ కింగ్స్‌తో మ్యాచ్‌లో  సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కుర్రాళ్లు  ప్రియం గార్గ్‌(51 నాటౌట్:  26 బంతుల్లో 6ఫోర్లు, సిక్స్‌ ), అభిషేక్‌ శర్మ(31: 24 బంతుల్లో 4ఫోర్లు, సిక్స్‌)  అద్భుత ఆటతీరుతో ఆకట్టుకున్నారు.  19ఏండ్ల గార్గ్‌ మెరుపు అర్ధశతకంతో రాణించడంతో సన్‌రైజర్స్‌ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లకు 164 పరుగులు చేసింది. 

యువ బ్యాట్స్‌మెన్‌  తీవ్ర ఒత్తిడిలోనూ పటిష్ఠ చెన్నై బౌలర్లను ఎదుర్కొంటూ జట్టుకు ఊహించని స్కోరు అందించారు.  నిదానంగా సాగిన  రైజర్స్‌ ఇన్నింగ్స్‌కు గార్గ్‌ అదిరే ముగింపునిచ్చాడు.  చెన్నై బౌలర్లలో దీపక్‌ చాహర్‌(2/31) రెండు వికెట్లు తీయగా శార్దుల్‌ ఠాకూర్‌, పియూశ్‌ చావ్లా  చెరో వికెట్‌ తీశారు.     

 సన్‌రైజర్స్‌కు ఈసారి కూడా శుభారంభం లభించలేదు. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్‌  ఇన్నింగ్స్‌  తడబడుతూ సాగింది. ఇన్నింగ్స్‌ మొదటి ఓవర్‌లోనే ఓపెనర్‌ బెయిర్‌స్టో(0: 3 బంతుల్లో)  వికెట్‌ను కోల్పోయింది. దీపక్‌ చాహర్‌ బౌలింగ్‌లో బెయిర్‌స్టో క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు.  ఈ దశలో క్రీజులోకి వచ్చిన మనీశ్‌ పాండే ఆత్మవిశ్వాసంతో కనిపించాడు. బౌలర్లపై ఎదురుదాడికి దిగుతూ ప్రతీ ఓవర్‌లో ఒక ఫోర్‌ రాబట్టాడు. వార్నర్‌ సహకారం అందిస్తుండటంతో పాండే బౌండరీలపై దృష్టిపెట్టాడు.    వార్నర్‌, పాండే జోడీ రెండో వికెట్‌కు 46(39 బంతుల్లో) పరుగులు జోడించారు. 

పవర్‌ ప్లేలో హైదరాబాద్‌ స్కోరు 42/1.  శార్దుల్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించిన పాండే..శామ్‌ కరన్‌ చేతికి చిక్కాడు.  పియూశ్‌ చావ్లా వేసిన 11వ ఓవర్లో వరుస బంతుల్లో డేవిడ్‌ వార్నర్‌, కేన్‌ విలియమ్సన్‌  పెవిలియన్‌ చేరారు.  ఐదో బంతికి వార్నర్‌ క్యాచ్‌ ఔట్‌ కాగా.. అనవసర పరుగు కోసం ప్రయత్నించిన విలియమ్సన్‌ రనౌటయ్యాడు.  69 రన్స్‌కే నాలుగు వికెట్లు కోల్పోయిన  సన్‌రైజర్స్‌  కనీసం 130 స్కోరైనా చేస్తుందా అని అంతా అనుకున్నారు.  ఆ తర్వాతే కథ మారింది.

ఆ ఇద్దరే ఆడేశారు..!

అభిషేక్‌ శర్మ , ప్రియం గార్గ్‌ క్రీజులో నిలదొక్కుకునేందుకు కాస్త సమయం తీసుకున్నారు.  సన్‌రైజర్స్‌ భారీ స్కోరు ఆశలు వదులుకున్న సమయంలో   జోడీ మెరుపులు మొదలయ్యాయి.  15 ఓవర్లకు 100 పరుగుల మార్క్‌ చేరుకున్న హైదరాబాద్‌కు ఆఖరి 5 ఓవర్లలో 64 రన్స్‌ రాబట్టారు.  కరన్‌ వేసిన 17వ ఓవర్లో గార్గ్‌ మూడు ఫోర్లు, సిక్స్‌ బాది 22 సాధించాడు.  తర్వాతి రెండు ఓవర్లలో ఒక్కో ఫోర్‌ బాది ఐపీఎల్‌ కెరీర్‌లో తొలి అర్ధశతకాన్ని నమోదు చేసుకున్నాడు.  చాహర్‌ వేసిన 18వ ఓవర్‌లో అభిషేక్‌ రెండు సార్లు ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. వరుసగా రెండు భారీ షాట్లు ఆడగా రెండు క్యాచ్‌లను చెన్నై ఫీల్డర్లు వదిలేశారు.  ఆ ఓవర్‌ ఆఖరి బంతికి కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.