సోమవారం 06 ఏప్రిల్ 2020
Sports - Feb 04, 2020 , 13:01:41

కివీస్‌తో టెస్టు సిరీస్‌కు భారత జట్టిదే..

కివీస్‌తో టెస్టు సిరీస్‌కు భారత జట్టిదే..

న్యూజిలాండ్‌తో రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌కు భారత జట్టును బీసీసీఐ ఇవాళ ప్రకటించింది.

ముంబై:  న్యూజిలాండ్‌తో రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌కు భారత జట్టును బీసీసీఐ ఇవాళ ప్రకటించింది.  గాయంతో వన్డేలు, టెస్టులకు దూరమైన రోహిత్‌ శర్మ స్థానంలో టెస్టు ఓపెనర్‌గా యువ ఆటగాడు శుభ్‌మన్‌ గిల్‌ను ఎంపిక చేశారు. వన్డేల్లో హిట్‌మ్యాన్‌ స్థానాన్ని మయాంక్‌ అగర్వాల్‌తో భర్తీ చేశారు. ముంబై కుర్రాడు పృథ్వీ షా సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి టెస్టు జట్టులోకి రాగా.. పరిమిత ఓవర్ల క్రికెట్లో చెప్పుకోదగ్గ ప్రదర్శన చేస్తున్న యువ పేసర్‌ నవదీప్‌ సైనీకి సుధీర్ఘ ఫార్మాట్‌లో తొలిసారి అవకాశం దక్కింది.  2018లో అఫ్గనిస్థాన్‌తో ఏకైక టెస్టు మ్యాచ్‌కు జట్టుకు ఎంపికైనప్పటికీ అరంగేట్రం చేయలేకపోయాడు. కివీస్‌తో సిరీస్‌లో అరంగేట్రం చేయాలని సైనీ ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. 

షా చివరిసారిగా 2018 అక్టోబర్‌లో భారత్‌ తరఫున ఆడాడు.  చైనామన్‌ బౌలర్‌ కుల్దీప్‌ యాదవ్‌కు నిరాశే ఎదురైంది. గతేడాది జనవరిలో ఆస్ట్రేలియా పర్యటనలో చివరి టెస్ట్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఇటీవల న్యూజిలాండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌కు అతడు బెంచ్‌కే పరిమితమయ్యాడు. స్పెషలిస్ట్‌ స్పిన్నర్లు అశ్విన్‌, జడ్డూల వైపే సెలక్టర్లు మొగ్గు చూపారు. 

న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌ క్లీన్‌స్వీప్‌ చేయడంలో ప్రధాన పాత్ర పోషించిన కేఎల్‌ రాహుల్‌కు సెలక్టర్లు మొండిచేయి చూపారు. అతడిని టెస్టుల్లోకి పరిగణనలోకి తీసుకోలేదు. రంజీ ట్రోఫీలో గాయపడిన సీనియర్‌ పేసర్‌ ఇషాంత్‌ శర్మను టెస్టుల్లోకి తీసుకున్నారు. ఐతే సిరీస్‌ ఆరంభానికి ముందు అతడు పూర్తిగా కోలుకొని ఫిట్‌నెస్‌ సాధిస్తేనే తుది జట్టుకు ఎంపిక చేస్తారని సెలక్టర్లు తెలిపారు.  రెండు టెస్టుల సిరీస్‌ ఫిబ్రవరి 21న వెల్లింగ్టన్‌లో ఆరంభంకానుంది. 


భారత జట్టు: 

విరాట్‌ కోహ్లీ(కెప్టెన్‌), మయాంక్‌ అగర్వాల్‌, పృథ్వీ షా, శుభ్‌మన్‌ గిల్‌, పుజారా, ఆజింక్య రహానె(వైఎస్‌ కెప్టెన్‌), హనుమ విహారి, వృద్ధిమాన్‌ సాహా(వికెట్‌ కీపర్‌), రిషబ్‌ పంత్‌(వికెట్‌ కీపర్‌), అశ్విన్‌, జడేజా, బుమ్రా, ఉమేశ్‌ యాదవ్‌, మహ్మద్‌ షమీ, నవదీప్‌ సైనీ, ఇషాంత్‌ శర్మ


logo