మంగళవారం 31 మార్చి 2020
Sports - Feb 20, 2020 , 00:32:24

కొత్త చరిత్ర కోసం

కొత్త చరిత్ర కోసం

చరిత్ర సృష్టించేందుకు భారత మహిళా క్రికెటర్లకు మరో అవకాశం వచ్చింది. తొలి ప్రపంచకప్‌ను కైవసం చేసుకొని మహిళల ఆటకు కొత్త ప్రాభవం తెచ్చే చాన్స్‌ ముగింట ఉంది. ఈ తరుణంలో అన్ని విభాగాల్లో సత్తాచాటి టీ20 విశ్వకప్‌ను ముద్దాడాలని మన జట్టు తహతహలాడుతున్నది. టాపార్డర్‌ రాణిస్తున్నా.. మిడిలార్డర్‌లో లోపాలు జట్టును కలవరపెడుతున్నాయి. పొట్టి ఫార్మాట్‌లో నిలకడలేమి సైతం వెంటాడుతున్నది. సీనియర్‌ ప్లేయర్లు మిథాలీ రాజ్‌, జులన్‌ గోస్వామి లేకుండానే చాలా ఏండ్ల తర్వాత ఓ ప్రధాన టోర్నీలో అడుగుపెడుతున్నది. ప్రపంచకప్‌ సమరాన్ని టీమ్‌ఇండియా శుక్రవారం ప్రారంభించనున్న నేపథ్యంలో జట్టు బలాబలాలపై ప్రత్యేక కథనం...

  • టీ20 ప్రపంచకప్‌నకు సిద్ధమైన భారత మహిళల జట్టు.. ఫేవరెట్‌గా బరిలోకి..
  • మిడిలార్డర్‌ సమస్యపై ప్రత్యేక దృష్టి.. ఆసీస్‌తో శుక్రవారం తొలి పోరు

నమస్తేతెలంగాణక్రీడావిభాగం : మూడుసార్లు టీ20 ప్రపంచకప్‌ టోర్నీ సెమీఫైనల్స్‌(2009,10,18)లో నిరాశకు గురైన భారత మహిళల జట్టు ఈసారి ఆ దశను అధిగమించి టైటిల్‌ను దక్కించుకోవాలని పట్టుదలగా ఉంది. 2017 వన్డే విశ్వకప్‌ తుదిపోరులో ఓడినా.. పొట్టిఫార్మాట్‌లో టైటిల్‌ను కైవసం చేసుకొని తొలిసారి జగజ్జేతగా నిలవాలని ఆకాంక్షిస్తున్నది. ఆస్ట్రేలియా గడ్డపై శుక్రవారం టీ20 ప్రపంచకప్‌ టోర్నీ ఆరంభం కానుండగా తొలి మ్యాచ్‌లో టీమ్‌ఇండియా... ఆతిథ్య ఆసీస్‌తో పోరాటాన్ని ప్రారంభించనుంది. ప్రతిభావంతులతో కూడిన భారత జట్టు టైటిల్‌ ఫేవరెట్లలో ఒకటి అనడంలో సందేహమే లేదు. అయితే, జట్టుగా రాణించడంలో మాత్రం ఎక్కువసార్లు విఫలమవుతున్నది. ముఖ్యంగా టాపార్డర్‌ అదరగొడుతున్నా... చాలా సందర్భాల్లో మిడిలార్డర్‌ చేతులెత్తేస్తుండడం ప్రతికూలంగా మారుతున్నది. ఇటీవలి సిరీస్‌ల్లో బౌలర్లు రాణిస్తుండడం జట్టుకు కాస్త ఊరట కలిగించే అంశం. 2018 ప్రపంచకప్‌ తర్వాత రెండు టీ20 సిరీస్‌ల్లో గెలిచిన భారత మహిళల జట్టు, రెండింట ఓటమిని చవిచూసింది. ఇటీవల జరిగిన ముక్కోణపు టీ20సిరీస్‌లో మోస్తరుగా రాణించి ఫైనల్‌ చేరినా.. ఆసీస్‌తో ఓడి నిరాశపరిచింది.  


మందన, షెఫాలీ మెరిస్తే.. 

టీమ్‌ఇండియా ఓపెనర్‌ స్మృతి మంధాన అద్భుతమైన ఫామ్‌లో ఉంది. భారత క్రికెట్‌లో తనదైన ముద్రను వేస్తూ ముందుకు సాగుతున్నది. దూకుడైన ఆటతో జట్టుకు శుభారంభాలు ఇస్తున్నది. ఇటీవల ఆసీస్‌లో జరిగిన ముక్కోణపు సిరీస్‌లో 135కు పైగా స్ట్రయిక్‌ రేట్‌తో టాప్‌స్కోరర్‌గా నిలిచి రాణించింది. మహిళల బిగ్‌బాష్‌ లీగ్‌ ఆడిన అనుభవమూ ఆమెకు ఉంది. మహిళా గంగూలీగా పిలుచుకునే లెఫ్ట్‌హ్యాండర్‌ స్మృతి ప్రపంచకప్‌లోనూ రాణిస్తే భారత్‌ పరుగుల వరద పారించేందుకు మార్గం సుగమమవుతుంది. 16ఏండ్ల షెఫాలీ వర్మ దూకుడుకు మారుపేరుగా మారింది. తొలి బంతి నుంచే బౌండ్రీ బాదాలనే కసితో బ్యాటింగ్‌ చేస్తూ వీరేందర్‌ సెహ్వాగ్‌ను గుర్తు చేస్తున్నది. వన్‌డౌన్‌ బ్యాటర్‌ జెమీమా రోడ్రిగ్స్‌ నిలకడ లేమితో  భారీ స్కోర్లు చేయడంలో విఫలమవుతున్నది. 


మిడిలార్డర్‌ చింత

టీమ్‌ఇండియా మిడిలార్డర్‌లో నిలకడ కొరవడింది. పురుషుల జట్టులానే ఎక్కువగా మహిళల జట్టు కూడా టాపార్డర్‌పైనే ఆధారపడుతున్నది.  కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌ అడపాదడపా రాణిస్తున్నా.. భారీ ఇన్నింగ్స్‌లు ఆడలేకుంది. మిగిలిన వారు సైతం సరిగా ఆకట్టులేకపోతున్నారు. ఇన్నింగ్స్‌కు మెరుపు ముగింపులు ఇవ్వలేకపోవడంతో పాటు లక్ష్యఛేదనలోనూ చాలాసార్లు మిడిలార్డర్‌ బ్యాటర్లు తడబడుతున్నారు. ఇటీవల ఆసీస్‌తో జరిగిన ముక్కోణపు టీ20 సిరీస్‌ ఇందుకు మరోసారి సాక్ష్యంగా నిలిచింది. ఓపెనర్‌ మందన(66) అదరగొట్టడంతో 156పరుగుల లక్ష్యఛేదనలో ఓ దశలో టీమ్‌ఇండియా మూడు వికెట్లకు 115పరుగులు చేసి పటిష్ఠ స్థితిలో నిలిచింది. ఆ తర్వాత రోడ్రిగ్స్‌, హర్మన్‌ ప్రీత్‌, దీప్తి శర్మ విఫలమవడంతో 144 పరుగులకే ఆలౌటై గెలువాల్సిన దశ నుంచి ఓటమి పాలైంది. వెస్టిండీస్‌తో జరిగిన వామప్‌ మ్యాచ్‌లోనూ బ్యాటర్లు చేతులెత్తేయగా.. బౌలర్లు రాణించడంతో 2పరుగుల తేడాతో జట్టు గెలిచింది. అయితే ప్రపంచకప్‌లో మిడిలార్డర్‌ వైఫల్యాలను చక్కదిద్దుకోవాలని భారత్‌ ఆశిస్తున్నది. వేద కృష్ణమూర్తి సైతం ఫామ్‌లోకి రావాలని పట్టుదలగా ఉంది. ఆల్‌ రౌండర్‌ దీప్తి శర్మ, వికెట్‌ కీపర్‌ తానియా భాటియా సైతం తలా కొన్ని పరుగులు చేస్తే టీమ్‌ఇండియా మిడిలార్డర్‌ కష్టాలు తీరే అవకాశం ఉంది. 


స్పిన్నే బలం..

ఆస్ట్రేలియా గడ్డపై విశ్వటోర్నీలో తలపడుతున్న టీమ్‌ఇండియాకు బౌలింగ్‌లో స్పిన్నర్లే కీలకం కానున్నారు. లెగ్‌ స్పిన్నర్‌ పూనమ్‌ యాదవ్‌ మంచి ఫామ్‌లో ఉంది. విండీస్‌తో జరిగిన లోస్కోరింగ్‌ మ్యాచ్‌లో మూడు వికెట్లు తీసి జట్టు గెలుపులో కీలకపాత్ర పోషించింది. పొట్టి ఫార్మాట్‌లో రెండేండ్లలో 51వికెట్లు సైతం దక్కించుకొని సత్తాచాటింది. ఆఫ్‌ స్పిన్నర్‌ దీప్తి శర్మ సైతం కీలకమైన సమయాల్లో వికెట్లు తీసి సత్తాచాటుతున్నది. ముఖ్యంగా వికెట్‌ టు వికెట్‌ బౌలింగ్‌తో పొదుపుగా బౌలింగ్‌ చేయడం చేస్తున్నది. పేస్‌ విభాగాన్ని శిఖా పాండే ముందుండి నడిపించనుంది. పేస్‌కు అనుకూలించే ఆసీస్‌ పిచ్‌లపై స్పిన్నర్లతో పాటు ఫాస్ట్‌ బౌలర్లు తప్పక రాణించాల్సి ఉంటుంది.  


సానుకూలంగానే ఉంటాం

ప్రపంచకప్‌లో ఏ జట్టునైనా ఒత్తిడిలోకి నెట్టగల సామర్థ్యం తమ జట్టుకు పూర్తిస్థాయిలో ఉందని టీమ్‌ఇండియా కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌ సింగ్‌ చెప్పింది. ప్రత్యర్థి జట్టు ఏదైనా సానూకులంగానే ముందుకు సాగుతామని స్పష్టం చేసింది. ప్రపంచంలో ఎక్కడున్నా భారతీయులు క్రికెట్‌ను ప్రేమిస్తారని, ఆసీస్‌లోనూ తమ జట్టుకు మద్దతు పెద్ద సంఖ్యలోనే ఉంటుందని ఆశిస్తున్నట్టు చెప్పింది. 

సంతోషకరమైన జట్టు మాదే : మందన 

టీ20 ప్రపంచకప్‌లో థాయ్‌లాండ్‌ కన్నా తమ జట్టే సంతోకరమైందని టీమ్‌ఇండియా స్టార్‌ ఓపెనర్‌ స్మృతి మందన చెప్పింది. జట్టు యువ ప్లేయర్లతో కళకళలాడుతున్నదని, వారితో తాను కలిసిపోతున్నానని తెలిపింది. ‘ప్రపంచకప్‌లో మాదే సంతోషకరమైన జట్టు. ఈ విషయంలో థాయ్‌లాండ్‌ మాతో పోటీలో ఉంది. కొత్త ప్లేయర్లు సౌకర్యంగా ఫీలయ్యేందుకు నేను కూడా వారితో కలిసిపోయా. మేం కలిసి డ్యాన్స్‌ చేస్తున్నాం. పాటలు పాడుతున్నాం. ఎంతో ఉల్లాసంగా ఉన్నాం’ అని మందన చెప్పింది. మిథాలీ రాజ్‌, జులన్‌ గోస్వామి లాంటి సీనియర్లు టీ20లకు గుడ్‌బై చెప్పడంతో భారత జట్టులో కొత్తవారు వచ్చారు. 


భారత జట్టు

హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌(కెప్టెన్‌), స్మృతి మంద న, షెఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్‌, హర్లీన్‌ దేవోల్‌, దీప్తిశర్మ, వేద కృష్ణమూర్తి, రిచా ఘోశ్‌, తానియా భాటియా(వికెట్‌ కీపర్‌), పూనమ్‌ యాదవ్‌, రాధాయాదవ్‌, రాజేశ్వరి గైక్వాడ్‌, శిఖ పాండే, పూజా వస్ర్తాకర్‌, అరుంధతి రెడ్డి 


గ్రూప్‌లో భారత్‌కు గట్టిపోటీ 

శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్‌లో ఆతిథ్య ఆస్ట్రేలియా, భారత్‌లను ఫేవరెట్‌ జట్లుగా క్రికెట్‌ పండితులు విశ్లేషిస్తున్నారు. ఈ రెండు జట్ల సమరంతోనే శుక్రవారం టోర్నీ ప్రారంభం కానుండడం ఆసక్తి రేపుతున్నది. ఈసారి విశ్వటోర్నీలో మొత్తం పది జట్టు రెండు గ్రూపుల్లో తలపడనున్నాయి. గ్రూప్‌-ఏలో ఆస్ట్రేలియా, భారత్‌, న్యూజిలాండ్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌ ఉండగా... గ్రూప్‌-బీలో ఇంగ్లండ్‌, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌, పాకిస్థాన్‌, థాయ్‌ లాండ్‌ ఉన్నాయి. వీటిల్లో బంగ్లా, థాయ్‌లాండ్‌ జట్లు క్వాలిఫయర్స్‌ ద్వారా టోర్నీకి అర్హత సాధించాయి. 


గ్రూప్‌ దశలో టీమ్‌ఇండియా మ్యాచ్‌లు 

ఫిబ్రవరి 21 ఆస్ట్రేలియాతో(సిడ్నీ) 

ఫిబ్రవరి 24 బంగ్లాదేశ్‌తో(పెర్త్‌)

ఫిబ్రవరి 27 న్యూజిలాండ్‌ (మెల్‌బోర్న్‌)

ఫిబ్రవరి 29 శ్రీలంకతో(మెల్‌బోర్న్‌) 


logo
>>>>>>