గురువారం 09 జూలై 2020
Sports - Jun 03, 2020 , 18:44:30

రెండో యేడూ ఇదే తంతు: ప్రణయ్‌

రెండో యేడూ ఇదే తంతు: ప్రణయ్‌

వరుసగా రెండో ఏడాది అర్జున అవార్డుకు తన పేరు ప్రతిపాదించకపోడంపై బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు. టాప్‌ డబుల్స్‌ జోడీ సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ శెట్టితో పాటు సమీర్‌ వర్మ పేర్లను భారత బ్యాడ్మింటన్‌ సమాఖ్య (బాయ్‌) మంగళవారం అర్జున అవార్డు కోసం సిఫారసు చేసింది. ‘అదే పాత కథ. కామన్వెల్త్‌ క్రీడలు, ఆసియా చాంపియన్‌షిప్‌లో పతకాలు నెగ్గిన ఆటగాడి పేరును బాయ్‌ ప్రతిపాదించలేదు. అదే సమయంలో ఈ టోర్నీల్లో పాల్గొనని ప్లేయర్‌ పేరును అవార్డు కోసం సిఫారసు చేశారు. వాహ్‌. ఈ దేశం ఒక జోక్‌’ అని ట్విట్టర్‌లో రాసుకొచ్చాడు. ప్రణయ్‌కు మరో ఆటగాడు పారుపల్లి కశ్యప్‌ మద్దతుగా నిలిచాడు.

గతేడాది ప్రణయ్‌ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయకపోయినా.. అంతకుముందు 2018లో అతడు చక్కటి విజయాలు సాధించాడు. కెరీర్‌ బెస్ట్‌ ప్రపంచ ఎనిమిదో ర్యాంక్‌ సొంతం చేసుకున్నాడు. అంతకుముందు ఇండోనేసియా ఓపెన్‌లో ప్రపంచ మాజీ నంబర్‌ లీ చాంగ్‌ వీ, ఒలింపిక్‌ చాంపియన్‌ చెన్‌ లాంగ్‌లపై వరుస మ్యాచ్‌ల్లో గెలిచాడు. 2018లో మొత్తం మూడు టైటిల్స్‌ నెగ్గిన ప్రణయ్‌.. బీడబ్లూ్యఎఫ్‌ వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌కు అర్హత సాధించాడు. గతేడాది అవార్డుల ప్రతిపాదన సందర్భంలోనూ ప్రణయ్‌ బాయ్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.  


logo